డి-మార్ట్ క్యూ2 ధమాకా: రూ.19,206 కోట్లకు చేరిన ఆదాయం.. 518కి పైగా స్టోర్లు
రిటైల్ రంగ దిగ్గజం 'డి-మార్ట్' మాతృ సంస్థ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ సెప్టెంబర్ 30తో ముగిసిన రెండో త్రైమాసికంలో రూ.19,206.18 కోట్ల ఆదాయాన్ని సాధించింది. గతేడాదితో పోలిస్తే ఆదాయం 18.4 శాతం వృద్ధి చెందగా, దేశవ్యాప్తంగా మొత్తం అవుట్‌లెట్ల సంఖ్య 518కి చేరింది.
ప్రముఖ రిటైల్ వ్యాపార శ్రేణి 'డి-మార్ట్' యజమాన్య సంస్థ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్ నూతన ఆర్థిక సంవత్సరం (2026-27) రెండో త్రైమాసికంలో మెరుగైన ప్రదర్శన కనబరిచింది. సెప్టెంబర్ 30తో ముగిసిన క్యూ2 కాలానికి కంపెనీ స్టాండ్‌అలోన్ నిర్వహణ ఆదాయం రికార్డు స్థాయిలో రూ.19,206.18 కోట్లకు చేరింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.16,218.79 కోట్లతో పోలిస్తే వార్షిక ప్రాతిపదికన ఏకంగా 18.4 శాతం వృద్ధి నమోదైంది. శనివారం కంపెనీ ఈ వివరాలను రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.
క్యూ1 కంటే పెరిగిన వ్యాపారం
డి-మార్ట్ క్యూ2 ధమాకా: రూ.19,206 కోట్లకు చేరిన ఆదాయం.. 518కి పైగా స్టోర్లు
{{^htLoading}} {{/htLoading}}
ప్రసిద్ధ పారిశ్రామికవేత్త రాధాకిషన్ దమానీ, ఆయన కుటుంబం ప్రమోట్ చేస్తున్న ఈ రిటైల్ దిగ్గజం వరుసగా త్రైమాసికాల వారీగా కూడా మంచి ప్రగతిని కనబరిచింది. ఈ ఏడాది జూన్ త్రైమాసికం (క్యూ1) లో కంపెనీ రూ.18,343.49 కోట్ల ఆదాయాన్ని నమోదు చేయగా, ఆ తర్వాతి త్రైమాసికానికి (క్యూ2) వచ్చేసరికి వ్యాపారం 4.7 శాతం వృద్ధి చెందింది.
518కి చేరిన డి-మార్ట్ స్టోర్లు
సెప్టెంబర్ 30 నాటికి దేశవ్యాప్తంగా డి-మార్ట్ మొత్తం అవుట్‌లెట్ల సంఖ్య 518కి చేరిందని కంపెనీ తెలిపింది. మహారాష్ట్ర నవీ ముంబైలోని సంపదా ప్రాంతంలో ఉన్న అవుట్‌లెట్ పునర్నిర్మాణ పనుల వల్ల ప్రస్తుతం మూసివేసి ఉంది. ఈ ఒక్కటి మినహా మిగిలిన అన్ని స్టోర్లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో విస్తృత సేవలు
సామాన్యులకు అవసరమైన గృహోపకరణాలు, నిత్యావసరాలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులను తక్కువ ధరలకే అందించడంలో డి-మార్ట్ మంచి ఆదరణ పొందింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్), తమిళనాడు, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈ సంస్థ తన వ్యాపార కార్యకలాపాలను విస్తృతంగా నిర్వహిస్తోంది.
ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.