...
...
Next Story

Mutual fund SIP : మ్యూచువల్ ఫండ్ సిప్.. నెలలో ఏ తేదీన కడితే అధిక రిటర్నులు వస్తాయి?

నెలలో ఏ తేదీన మ్యూచువల్ ఫండ్ సిప్ చెల్లిస్తే ఎక్కువ రాబడి వస్తుందన్న సందేహం చాలామంది ఉద్యోగులకు ఉంటుంది. ఒకటో తేదీనా, లేక 25వ తేదీనా? 30 ఏళ్ల సెన్సెక్స్ డేటాపై వైట్‌ఓక్ క్యాపిటల్ నిర్వహించిన తాజా అధ్యయనం ఆసక్తికర విషయాలను వెల్లడించింది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

Published on: Nov 23, 2026, 05:59:19 IST
Advertisement

మ్యూచువల్ ఫండ్స్​లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) ప్రారంభించేటప్పుడు ప్రతి ఒక్కరి మదిలో మెదిలే మొదటి ప్రశ్న.. నెలలో ఏ తేదీని ఎంచుకోవాలి? జీతం పడే ఒకటో తేదీనా, లేక ఐదో తేదీనా, మధ్యలో 15వ తేదీనా, లేదంటే నెలాఖరున 25వ తేదీన పెట్టుబడి పెడితే ఎక్కువ లాభం వస్తుందా? చాలామంది పెట్టుబడిదారులు ఏదో ఒక అదృష్ట తేదీని పట్టుకుంటే దీర్ఘకాలంలో అద్భుతమైన రాబడి వస్తుందని భావిస్తుంటారు. అయితే చారిత్రక సెన్సెక్స్ గణాంకాలు మాత్రం ఇందుకు భిన్నమైన వాస్తవాన్ని చెబుతున్నాయి. మీరు ఏ తేదీన సిప్ కట్టినా దీర్ఘకాలిక రాబడిలో వచ్చే తేడా నామమాత్రమేనని 'వైట్‌ఓక్ క్యాపిటల్ మ్యూచువల్ ఫండ్' తాజా అధ్యయనం స్పష్టం చేసింది! 10 ఏళ్ల సగటు మ్యూచువల్ ఫండ్ సిప్ రాబడి వివిధ తేదీల్లో దాదాపు ఒకేలా ఉందని ఈ విశ్లేషణ నిరూపించింది.

నెలవారీ సిప్ తేదీ రాబడిని ప్రభావితం చేస్తుందా?

మ్యూచువల్ ఫండ్ సిప్ రిటర్నులను డేట్ ప్రభావితం చేస్తుందా?
మ్యూచువల్ ఫండ్ సిప్ రిటర్నులను డేట్ ప్రభావితం చేస్తుందా?

వివిధ తేదీలలో చేసిన నెలవారీ ఎస్ఐపీ పెట్టుబడులపై 10 ఏళ్ల సగటు వార్షిక రాబడిని (XIRR) వైట్‌ఓక్ క్యాపిటల్ విశ్లేషించింది. ఈ అధ్యయన ఫలితాలను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది! అత్యధిక రాబడి ఇచ్చిన తేదీకి, అత్యల్ప రాబడి ఇచ్చిన తేదీకి మధ్య ఉన్న వ్యత్యాసం కేవలం 0.06 శాతం పాయింట్లు మాత్రమే.

ఈ విశ్లేషణ ప్రకారం.. ప్రతి నెలా 23 నుంచి 28వ తేదీల మధ్య చేసిన మ్యూచువల్ ఫండ్ సిప్​కు అత్యధిక సగటు రాబడి నమోదైంది. అదే సమయంలో 9వ తేదీన చేసిన పెట్టుబడులకు అత్యల్ప రాబడి వచ్చింది. అయితే ఈ రెండింటి మధ్య ఉన్న అంతరం చాలా స్వల్పం. ఒక తేదీ మరొక తేదీ కంటే ఏదో అద్భుతమైన ప్రయోజనాన్ని అందిస్తుందని చెప్పడానికి ఈ తేడా ఏమాత్రం సరిపోదు!

ఒక నెలలో అత్యధిక రాబడిని ఇచ్చిన రోజు, మరుసటి నెలలో అదే ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. గడిచిపోయిన కాలాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మాత్రమే ఏ తేదీ మంచిదో చెప్పగలం తప్ప, ముందే ఊహించడం అసాధ్యమని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి.

నెలవారీ సిప్ ఇన్వెస్ట్​మెంట్ తేదీ

10ఏళ్ల యావరేజ్ సిప్ XIRR

నెలలో 9వ రోజు13.11%
నెలలో 23- 28వ రోజు13.17%
వ్యత్యాసం0.06 పర్సెంటేజ్ పాయింట్లు
సోర్సు: వైట్ఓక్ క్యాపిటల్ మ్యూచువల్ ఫండ్. చారిత్రక సెన్సెక్స్ టీఆర్​ఐ డేటా

జీతం పడే తేదీకి అనుగుణంగా మ్యూచువల్ ఫండ్ సిప్ ఉండాలా?

కాబట్టి రాబడిని పెంచుకునే ప్రయత్నంలో పదేపదే సిప్ తేదీలను మార్చుకునే బదులు, ప్రతినెలా క్రమం తప్పకుండా, సౌకర్యవంతంగా పెట్టుబడి పెట్టడానికి వీలయ్యే తేదీని ఎంచుకోవడానికి ఇన్వెస్టర్లు ప్రాధాన్యం ఇవ్వాలి. క్రమం తప్పకుండా సిప్ చేయడం వల్ల మార్కెట్ హెచ్చుతగ్గులన్నింటిలోనూ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. మార్కెట్లు పడిపోయినప్పుడు అదే వాయిదా మొత్తంతో ఎక్కువ యూనిట్లు వస్తాయి. మార్కెట్లు పెరిగినప్పుడు తక్కువ యూనిట్లు వస్తాయి. దీన్నే ‘రూపీ-కాస్ట్ యావరేజింగ్’ ప్రయోజనం అంటారు.

సరైన మార్కెట్ స్థాయి కోసం వేచి చూడటం వల్ల విలువైన పెట్టుబడి అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉందని వైట్‌ఓక్ అధ్యయనం హెచ్చరించింది. మార్కెట్ ప్రతికూల స్థాయిలో ఉన్నప్పుడు పెట్టిన పెట్టుబడులు సైతం, ఎక్కువ కాలం కొనసాగితే అద్భుతంగా వృద్ధి చెందుతాయని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.

పెట్టుబడిదారులు గుర్తుంచుకోవాల్సిన కీలక అంశాలు!

ఆగస్టు 1996 నుంచి అక్టోబర్ 2026 మధ్య కాలంలో బీఎస్ఈ సెన్సెక్స్ టోటల్ రిటర్న్ ఇండెక్స్ ఆధారంగా ఊహాత్మక సిప్ ఇన్వెస్ట్​మెంట్స్​ని పోల్చి వైట్‌ఓక్ క్యాపిటల్ ఈ విశ్లేషణ చేసింది. ఇది ఏదైనా ఒక నిర్దిష్ట మ్యూచువల్ ఫండ్ పథకం అసలు పనితీరును సూచించదు. ఈ గణనలన్నీ పన్నులకు ముందువి; వీటిలో స్టాంప్ డ్యూటీ, ఇతర రుసుములను పరిగణనలోకి తీసుకోలేదు. గత పనితీరు భవిష్యత్ రాబడికి హామీ కాదని ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాలి.

మొత్తం మీద ఈ అధ్యయనం చెబుతున్న అసలు సారాంశం ఒక్కటే.. నెలవారీ సిప్ తేదీని ఖరారు చేయడానికి ఇన్వెస్టర్లు ఎక్కువ సమయం వృథా చేయాల్సిన అవసరం లేదు. వాయిదా నెల ప్రారంభంలో కట్ అవుతోందా లేక నెలాఖరులో కట్ అవుతోందా అన్న దానికంటే, ఎంత త్వరగా పెట్టుబడి ప్రారంభించారు, ఎంత క్రమశిక్షణతో కొనసాగిస్తున్నారు, దీర్ఘకాలం పాటు మార్కెట్లో ఎంత నిలకడగా ఉన్నారు అన్న అంశాలే మీ సంపద సృష్టిని శాసిస్తాయి.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఇన్వెస్ట్​మెంట్ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

 

ABOUT THE AUTHOR

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks