ఎట్టకేలకు స్కూలు బుక్స్​లో సేవింగ్స్, ఇన్వెస్ట్​మెంట్స్​పై పాఠాలు! క్లాస్ 9 సిలబస్‌లో 'పర్సనల్ ఫైనాన్స్'

ఎన్​సీఈఆర్​టీ 9వ తరగతి సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకాలంలో పర్సనల్ ఫైనాన్స్, ఈఎంఐ, టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టార్టప్‌ల ప్రాథమికాంశాలపై కొత్త పాఠాలను చేర్చారు. విద్యార్థులకు చిన్ననాటి నుంచే ఆర్థిక క్రమశిక్షణ నేర్పించేందుకు తీసుకొచ్చిన ఈ మార్పుల వివరాలు ఇక్కడ చూడండి..

Published on: Nov 5, 2026, 06:00:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

దేశంలో విద్యా వ్యవస్థను మరింత ఆచరణాత్మకంగా, నేటి కాలానికి అనుగుణంగా తీర్చిదిద్దే దిశగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్​సీఈఆర్​టీ) విప్లవాత్మక అడుగులు వేసింది. కొత్తగా రూపొందించిన 9వ తరగతి సోషల్ సైన్స్ (ఎకనామిక్స్) పార్ట్-2 పాఠ్యపుస్తకంలో 'పర్సనల్ ఫైనాన్స్' (వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ), 'ఎంటర్‌ప్రెన్యూర్ షిప్' (వ్యాపార వ్యవస్థాపకత) అధ్యాయాలను అధికారికంగా చేర్చింది.

ఎన్​సీఈఆర్​టీ క్లాస్ 9 సిలబస్‌లో 'పర్సనల్ ఫైనాన్స్' పాఠాలు..
ఎన్​సీఈఆర్​టీ క్లాస్ 9 సిలబస్‌లో 'పర్సనల్ ఫైనాన్స్' పాఠాలు..

విద్యార్థుల్లో చిన్నతనం నుంచే డబ్బు ప్రాముఖ్యత, పొదుపు, పెట్టుబడులు, స్వయం ఉపాధిపై అవగాహన పెంచేందుకు ఈ మార్పులు చేసినట్లు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో సీబీఎస్‌ఈ పాఠశాలల సంఖ్య ఏటా పెరుగుతోంది. అంతేకాకుండా స్టేట్ సిలబస్‌లలో కూడా ఎన్‌సీఈఆర్‌టీ మార్గదర్శకాలను ప్రామాణికంగా తీసుకుంటుంటారు. కాబట్టి మన తెలుగు విద్యార్థులు భవిష్యత్తు కోసం ఈ నూతన అధ్యాయాలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.

పర్సనల్ ఫైనాన్స్ పాఠాల్లో విద్యార్థులు ఏం నేర్చుకుంటారు?

చిన్నతనంలో పాకెట్ మనీ లేదా పండుగల సమయంలో పెద్దల నుంచి వచ్చే బహుమతుల డబ్బులను ఎలా ఖర్చు పెడతారు? పిగ్గీ బ్యాంక్​లో దాచుకుంటారా లేదా వెంటనే ఖర్చు చేస్తారా? అనే ఆసక్తికరమైన ప్రశ్నలతో ఈ పాఠం ప్రారంభమవుతుంది.

పాఠశాలలో క్యాంటీన్ ఖర్చులు, నోట్‌బుక్స్ కొనుగోళ్లు, పాఠశాలకు వెళ్లే ప్రయాణ ఖర్చులు, వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఊరికి వెళ్లేందుకు డబ్బులు ఎలా పొదుపు చేసుకోవాలి వంటి ఆచరణాత్మక ఉదాహరణలను ఇందులో పొందుపరిచారు.

ఈ అధ్యాయం ద్వారా విద్యార్థులు నేర్చుకునే ప్రధాన అంశాలు..

ఈఎంఐ, ఫిక్స్‌డ్ డిపాజిట్లు: సమాన నెలవారీ వాయిదాలు (ఈఎంఐ) ఎలా పనిచేస్తాయి? ఫైనాన్షియల్ గోల్స్ కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్​డీ), మ్యూచువల్ ఫండ్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి?

రిస్క్ - రిటర్న్ సిద్ధాంతం: తక్కువ రిస్క్ ఉండే పెట్టుబడుల్లో తక్కువ రాబడి, ఎక్కువ రిస్క్ ఉండే చోట ఎక్కువ లాభాలు వస్తాయనే ప్రాథమిక సూత్రాన్ని సులువుగా వివరిస్తుంది.

పన్నుల నిర్మాణం (ట్యాక్సులు): పన్నులు అంటే ఏంటి? ప్రభుత్వం రోడ్లు, ఆసుపత్రులు, రక్షణ రంగానికి నిధులు సమకూర్చుకోవడానికి పన్నులు ఎలా ఉపయోగపడతాయో వివరిస్తారు. ప్రత్యక్ష పన్నులు (ఇన్‌కమ్ టాక్స్), పరోక్ష పన్నులు (జీఎస్టీ), పర్సనల్ ఇన్‌కమ్ టాక్స్ మినహాయింపు పరిమితులపై ప్రాథమిక జ్ఞానాన్ని అందిస్తారు.

ఐడియాల నుంచి స్టార్టప్‌ల వరకు: ఎంటర్‌ప్రెన్యూర్​షిప్ పాఠం

విద్యార్థులను కేవలం ఉద్యోగార్థులుగా కాకుండా, జాబ్ క్రియేటర్లుగా మార్చాలనే లక్ష్యంతో ‘ఫ్రమ్ ఐడియాస్ టు స్టార్టప్స్’ అధ్యాయాన్ని చేర్చారు.

ఈ అధ్యాయంలో ఒక సరదా తరగతి గది యాక్టివిటీని చేర్చారు. పాఠశాల వార్షికోత్సవంలో విద్యార్థులు ఒక 'లేమనేడ్' (నిమ్మరసం) స్టాల్‌ను ఏర్పాటు చేసి, దానికి అయిన ఖర్చులు, వచ్చిన ఆదాయం, నికర లాభం ఎంత ఉందో లెక్కించి టీచర్‌కు రిపోర్ట్ సమర్పించాలి. దీని ద్వారా వ్యాపారంలో లాభనష్టాల అంచనాను సులువుగా అర్థం చేసుకుంటారు.

వ్యాపార నిర్వహణలోని 4 కీలక విభాగాలు:

ఒక వ్యాపారాన్ని లేదా స్టార్టప్‌ను విజయవంతంగా నడపడానికి అవసరమైన 4 ప్రధాన విభాగాలను ఈ పాఠంలో వివరించారు:

మేనేజ్‌మెంట్ అండ్ ఆపరేషన్స్ (ఉత్పత్తి, సప్లై చైన్): రోజువారీ వ్యాపార కార్యకలాపాలు, నాణ్యతా నియంత్రణ.

ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్: బడ్జెటింగ్, క్యాష్ ఫ్లో మేనేజ్‌మెంట్, ఆర్థిక నివేదికల నిర్వహణ.

హ్యూమన్ రిసోర్సెస్ (హెచ్​ఆర్): సరైన నైపుణ్యాలున్న ఉద్యోగులను నియమించడం, సమస్యలను పరిష్కరించడం.

మార్కెటింగ్ అండ్ సేల్స్: ప్రకటనలు, ప్రమోషన్ల ద్వారా కస్టమర్లలో అవగాహన పెంచి విక్రయాలను పెంచడం.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) యుగంలో మన విద్యార్థులు ఆర్థికంగా దృఢంగా మారడానికి, సొంతంగా ఆలోచించి ఆవిష్కరణలు చేయడానికి ఈ నూతన ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ ఎంతో దోహదపడుతుందని విద్యావేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More