Financial rules change : ఎల్పీజీ ధర, జీఎస్టీ, పెన్షన్ డెడ్‌లైన్- నవంబర్ 1 నుంచి కీలక రూల్స్‌లో మార్పులు..
నవంబర్ నెల ప్రారంభమవుతున్న వేళ దేశంలో పలు ఆర్థిక, పరిపాలనా నిబంధనల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. జీఎస్టీ డిస్కౌంట్ నియమాలు, జీవిత ప్రమాణ పత్రాల సమర్పణ, ఆదాయపు పన్ను రిటర్న్ గడువు పెంపు, గ్యాస్ సిలిండర్ ధరల రివిజన్ వంటి ముఖ్యమైన సమాచారం ఇక్కడ తెలుసుకోండి..
ప్రతి నెల ప్రారంభంలోనూ సామాన్యుడి జేబును ప్రభావితం చేసే పలు ఆర్థిక, వ్యాపార, పరిపాలనా నిబంధనలు మారుతుంటాయి. ఈ క్రమంలోనే నవంబర్ 1 నాటి నుంచి దేశంలో అనేక కీలక మార్పులు అమల్లోకి వస్తున్నాయి. జీఎస్టీ వర్తకులకు సడలింపులు, పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికెట్ సమర్పణ, ఆదాయపు పన్ను గడువు పొడిగింపు, ఎల్పీజీ సిలిండర్ ధరల సమీక్ష వంటి అనేక అంశాలపై పన్ను చెల్లింపుదారులు, వ్యాపారులు, సామాన్య ప్రజలు అవగాహన కలిగి ఉండటం ఎంతైనా అవసరం.

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నివాసితులపై, ముఖ్యంగా చిన్న తరహా వ్యాపారులు, ప్రభుత్వ పెన్షనర్లు, ఐటిఆర్ సమర్పించే పన్ను చెల్లింపుదారులపై ఈ కొత్త మార్పులు ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి. ఈ నేపథ్యంలో నవంబర్ నెలలో రానున్న ప్రధాన మార్పుల సమగ్ర వివరాలు ఈ విధంగా ఉన్నాయి:
1. జీఎస్టీ నిబంధనల్లో వర్తకులకు ఊరట..
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ నిబంధనల్లో కీలక మార్పులను నవంబర్ 1 నుంచి అమల్లోకి తీసుస్తోంది. కేంద్ర బడ్జెట్ 2026-27లో ప్రకటించిన విధంగా, సేల్స్ తర్వాతి డిస్కౌంట్లపై ఉండే నిబంధనలను ప్రభుత్వం సులభతరం చేసింది. అలాగే ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ ఎదుర్కొంటున్న వ్యాపారులకు రావాల్సిన ప్రొవిజనల్ రీఫండ్ల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని నిర్ణయించారు. దీనివల్ల వస్త్ర రంగానికి, చిన్న పరిశ్రమలకు నగదు లభ్యత పెరిగి ఎంతో లబ్ధి చేకూరనుంది.
2. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరల సమీక్ష..
ప్రతి నెలా మొదటి రోజున ప్రభుత్వ రంగానికి చెందిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) గ్యాస్ సిలిండర్ల ధరలను పునఃసమీక్షిస్తాయి. వాణిజ్య పరంగా వాడే సిలిండర్ ధరల్లో మార్పులు జరిగితే రెస్టారెంట్లు, హోటళ్లు, చిన్న తరహా వ్యాపారాలపై దాని ప్రభావం పడుతుంది. అయితే నవంబర్ 1కి సంబంధించి ధరల మార్పుపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. రీఫిల్ బుక్ చేసుకునే ముందు స్థానిక డిస్ట్రిబ్యూటర్ వద్ద తాజా ధరలను సరిచూసుకోవడం మంచిది.
3. పెన్షనర్లు 'లైఫ్ సర్టిఫికెట్' సమర్పణ..
ప్రభుత్వ పెన్షనర్లు తమ పింఛను సజావుగా అందుకోవడానికి ప్రతి ఏటా జీవిత ప్రమాణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.
80 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పెన్షనర్లు నవంబర్ 1 నుంచి తమ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించవచ్చు.
80 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ పెన్షనర్లు అక్టోబర్ 1 నుంచే సమర్పించే వెసులుబాటు కల్పించారు.
ఈ పత్రాల సమర్పణకు ఆఖరి తేదీ నవంబర్ 30. నిర్ణీత సమయంలోగా సర్టిఫికెట్ అందించకపోతే పింఛను చెల్లింపులు తాత్కాలికంగా నిలిచిపోయే ప్రమాదముంది.
4. ఐటీఆర్ దరఖాస్తు గడువు పొడిగింపు..
అకౌంటింగ్ ఆడిట్ అవసరమైన నిర్దిష్ట వర్గాల పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను శాఖ పెద్ద ఊరటనిచ్చింది. అసెస్మెంట్ ఇయర్ 2026-27కు గానూ ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయడానికి గతంలో ఉన్న అక్టోబర్ 31 గడువును నవంబర్ 21, 2026 వరకు పొడిగించారు. ఈ సడలింపు కేవలం ఆడిట్ పరిధిలోకి వచ్చే అర్హులైన వర్గాలకు మాత్రమే వర్తిస్తుంది.
5. దివ్యాంగ పెన్షన్ సంస్కరణలు: ఇంకా అమలు కాలేదు..
కేంద్ర కేబినెట్ ఇటీవల దివ్యాంగ పెన్షన్ పరిధిని విస్తరిస్తూ అర్హత వైకల్యాన్ని 80 శాతం నుంచి 40 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే వయోపరిమితి నిబంధనను కూడా తొలగించి ఆర్థిక సాయాన్ని రూ. 375, రూ. 625 (80 ఏళ్లు పైబడిన వారికి) పెంచేందుకు ప్రతిపాదించింది. అయితే దీనికి సంబంధించిన కొత్త ఆపరేషనల్ మార్గదర్శకాలు ఇంకా విడుదల కాకపోవడం వల్ల ఈ మార్పులు నవంబర్ 1 నుంచి అమల్లోకి రావు. లబ్ధిదారులు అధికారిక ఉత్తర్వుల కోసం వేచి చూడాల్సి ఉంటుంది.
ఇవే కాకుండా వివిధ బ్యాంకులు తమ ఫిక్స్డ్ డిపాజిట్లు, రుణాలు- వడ్డీ రేట్లు, క్రెడిట్ కార్డు ఛార్జీలను వ్యక్తిగతంగా సవరించే అవకాశముంది. ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునే ముందు అధికారిక ప్రకటనలను గమనించడం శ్రేయస్కరం.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


