Iran war : ‘ఇరాన్‌తో యుద్ధం దాదాపు ముగిసినట్టే’- ట్రంప్​

Trump Iran war news : ఇరాన్‌పై సాగుతున్న సైనిక చర్య తుది దశకు చేరుకుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అదే సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఆయన ఫోన్‌లో మాట్లాడటం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

Published on: Mar 10, 2026, 05:26:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇరాన్‌తో సాగుతున్న యుద్ధం దాదాపుగా ఒక ముగింపునకు వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సైనిక సామర్థ్యం పూర్తిగా దెబ్బతిందని, ఆ దేశం ఇప్పుడు సహాయ నిరాకరణ స్థితిలో ఉందనే సంకేతాలను ఆయన ఇచ్చారు. మరోవైపు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ట్రంప్ సుమారు గంటసేపు ఫోన్‌లో మాట్లాడి, తాజా యుద్ధ పరిస్థితులపై చర్చించారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్.. (AFP)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్.. (AFP)

ఇరాన్ వద్ద ఏం మిగల్లేదు: ట్రంప్

సీబీఎస్ న్యూస్ సీనియర్ వైట్ హౌస్ కరస్పాండెంట్ వీజియా జియాంగ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ కీలక విషయాలు వెల్లడించారు.

"ఇరాన్‌తో యుద్ధం దాదాపుగా పూర్తయినట్లేనని నేను భావిస్తున్నాను. ప్రస్తుతం వారి వద్ద నావికాదళం లేదు, కమ్యూనికేషన్ వ్యవస్థలు ధ్వంసమయ్యాయి, కనీసం ఎయిర్ ఫోర్స్ కూడా లేదు," అని ట్రంప్ పేర్కొన్నట్లు జియాంగ్ తన 'ఎక్స్​' (ట్విట్టర్) ఖాతాలో వెల్లడించారు.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఎప్పుడు తగ్గుతాయా అని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్న తరుణంలో ట్రంప్​ ఈ వ్యాఖ్యలు చేయడం ఊరటనిచ్చే విషయం.

'మొజ్తబా ఖమేనీకి నా దగ్గర సందేశం లేదు'

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ గురించి ప్రశ్నించగా.. "అతనికి పంపడానికి నా దగ్గర ఎలాంటి సందేశం లేదు" అని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే, ఖమేనీ స్థానంలో మరొకరిని నియమించే ఆలోచన తన మనసులో ఉందని, కానీ ఆ వివరాలను ఇప్పుడు వెల్లడించలేనని ఆయన దాటవేశారు.

పుతిన్ - ట్రంప్ చర్చల సారాంశం..

రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ట్రంప్ సోమవారం జరిపిన సంభాషణ "చాలా స్పష్టంగా, వృత్తిపరంగా" సాగిందని క్రెమ్లిన్ వర్గాలు తెలిపాయి. గల్ఫ్ దేశాల నేతలు, ఇరాన్ అధ్యక్షుడితో చర్చించిన తర్వాత, యుద్ధాన్ని రాజకీయంగా, దౌత్యపరంగా త్వరగా ముగించడానికి తన వద్ద ఉన్న కొన్ని ప్రతిపాదనలను పుతిన్ ఈ సందర్భంగా ట్రంప్‌కు వివరించారు.

ఇజ్రాయెల్-అమెరికా సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ల నేపథ్యంలో ప్రస్తుత స్థితిగతులను ట్రంప్ కూడా పుతిన్‌కు వివరించారు. ఈ ఇద్దరు నేతలు అంతర్జాతీయ చమురు మార్కెట్, వెనిజులా అంశాలపై కూడా చర్చించినట్లు పుతిన్ విదేశీ వ్యవహారాల సలహాదారు యూరి ఉషాకోవ్ తెలిపారు.

అయితే చమురు ధరలు పెరుగుతున్న వేళ కొన్ని ఆంక్షలు తొలగిస్తానని ట్రంప్​ మీడియాకు చెప్పినట్టు తెలుస్తోంది.

మొజ్తబా ఖమేనీకి రష్యా భరోసా..

ఇదే సమయంలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ తన పూర్తి మద్దతు ప్రకటించారు.

"ఇరాన్ సాయుధ దాడులను ఎదుర్కొంటున్న ఈ క్లిష్ట సమయంలో, అత్యున్నత పదవిని చేపట్టడానికి ఎంతో ధైర్యం, అంకితభావం అవసరం," అని పుతిన్ పేర్కొన్నారు. తన తండ్రి ఆశయాలను మొజ్తబా ఖమేనీ గౌరవప్రదంగా ముందుకు తీసుకెళతారని, కఠిన పరీక్షల ఎదుట ఇరాన్ ప్రజలను ఐక్యం చేస్తారని పుతిన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

గతంలో జరిగిన దాడుల్లో ఖమేనీ కుటుంబ సభ్యులు, ఇతర ఉన్నతాధికారులు మరణించినందుకు పుతిన్ తన ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేశారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More