ఇరాన్ యుద్ధంలో అమెరికా భారీ ఖర్చు: రోజుకు రూ. 7,500 కోట్లు! భారత్ అంతరిక్ష బడ్జెట్ కంటే ఎక్కువే..
అమెరికా-ఇరాన్ యుద్ధం వల్ల అమెరికా ఖజానాకు భారీ గండి పడుతోంది. రోజుకు 891 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 7,500 కోట్లు) ఖర్చవుతుండగా, మొదటి వారంలోనే 6 బిలియన్ డాలర్ల బిల్లు వచ్చింది. దీనితో ట్రంప్ సర్కార్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం కేవలం ప్రాణనష్టాన్ని మాత్రమే కాదు, అమెరికా ఆర్థిక వ్యవస్థను కూడా కుదిపేస్తోంది. యుద్ధం మొదలైన మొదటి వారంలోనే పెంటగాన్ సుమారు 6 బిలియన్ డాలర్లు (రూ. 50 వేల కోట్లకు పైగా) ఖర్చు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. అంటే సగటున రోజుకు 891.4 మిలియన్ డాలర్లు కరిగిపోతున్నాయి. ఈ ఖర్చు ఎంతో తెలుసా? మన దేశం (భారతదేశం) ఏడాది పొడవునా అంతరిక్ష ప్రయోగాల (ISRO) కోసం ఖర్చు చేసే బడ్జెట్ కంటే.. అమెరికా యుద్ధం కోసం ఒక్క రోజులో ఖర్చు చేసే మొత్తమే ఎక్కువ!

ఖర్చుల లెక్కలివే..
వాషింగ్టన్‌కు చెందిన 'సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్' (CSIS) విశ్లేషణ ప్రకారం ఖర్చుల వివరాలు ఇలా ఉన్నాయి:
- మందుగుండు సామగ్రి: మొదటి వారంలో ఖర్చయిన 6 బిలియన్ డాలర్లలో, 4 బిలియన్ డాలర్లు కేవలం క్షిపణులు, బాంబులకే సరిపోయింది. ముఖ్యంగా ఇరాన్ ప్రయోగించే క్షిపణులను అడ్డుకునే 'ఇంటర్సెప్టర్ల' కోసం అమెరికా భారీగా ఖర్చు చేస్తోంది.
- వైమానిక కార్యకలాపాలు: రోజుకు సుమారు 30 మిలియన్ డాలర్లు.
- నౌకాదళం: రోజుకు 15 మిలియన్ డాలర్లు.
- సైన్యం: యుద్ధ క్షేత్రంలో 50,000 మందికి పైగా సైనికులు, యుద్ధ విమానాలు, నౌకల నిర్వహణ కోసం రోజుకు మరో 1.6 మిలియన్ డాలర్లు ఖర్చవుతున్నాయి.
ఈ యుద్ధం గనుక రెండు నెలల పాటు కొనసాగితే, ప్రత్యక్ష సైనిక ఖర్చు 95 బిలియన్ డాలర్లకు (రూ. 8 లక్షల కోట్లు) చేరుకోవచ్చని పెన్సిల్వేనియా యూనివర్సిటీ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
ఇరాన్ తన 'ఆపరేషన్ మ్యాడ్ మ్యాన్' వ్యూహంతో అమెరికాను, దాని మిత్రదేశాలను ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తోంది.
- చమురు ధరలు: అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 119.50 డాలర్లకు చేరింది.
- ఇంధన సంక్షోభం: ప్రపంచ ఇంధన సరఫరాలో కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్' మార్గంలో రవాణా దాదాపు నిలిచిపోయింది.
- సప్లై చైన్: ఖతార్ నుంచి గ్యాస్ ఎగుమతులు నిలిచిపోవడం, సౌదీ అరేబియాలోని అతిపెద్ద రిఫైనరీపై డ్రోన్ దాడి జరగడం ప్రపంచవ్యాప్తంగా డీజిల్, పెట్రోల్ ధరలు పెరగడానికి కారణమయ్యాయి.
విమర్శలను లెక్కచేయని ట్రంప్
ఒకవైపు అమెరికాలో సామాన్యుడిపై భారం పడుతుంటే, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇరాన్ 'నిర్వందంగా లొంగిపోవాల్సిందే' అని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై డెమొక్రాట్లు మండిపడుతున్నారు. "ప్రజల ఆరోగ్యం, ఆహార పథకాలకు కోతలు విధిస్తూ, యుద్ధం కోసం బిలియన్ల కొద్దీ డాలర్లను మధ్య ప్రాచ్యానికి పంపుతున్నారు" అని హౌస్ డెమొక్రాటిక్ కాకస్ చైర్ పీట్ అగ్యిలర్ విమర్శించారు.
అయితే, ట్రంప్ మాత్రం తన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. "ఇరాన్‌ను వినాశనం అంచు నుంచి వెనక్కి తీసుకొస్తాం.. దాన్ని మునుపటి కంటే ఆర్థికంగా బలోపేతం చేస్తాం" అంటూ 'మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్' అనే నినాదాన్ని ఇస్తున్నారు.
మరోవైపు, తమ వద్ద అత్యాధునిక ఆయుధాలు ఇంకా ఉన్నాయని, ఈ యుద్ధాన్ని నెలల తరబడి కొనసాగించగలమని ఇరాన్ హెచ్చరిస్తోంది. ఈ పరిణామాలు చూస్తుంటే యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో, అమెరికా ఖజానాకు ఇంకెంత గండి పడుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


