సేఫ్టీలో ఏ మారుతీ సుజుకీ కారు బెస్ట్? ఏది కొనొచ్చు? క్రాష్ టెస్ట్ ఫలితాలు ఇలా..
మారుతీ సుజుకీ కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారు? ప్రస్తుతం ఉన్న టాప్ మోడల్స్‌లో ఏ కారు అత్యధిక సేఫ్టీని పొందిందో తెలుసుకోవాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే. మారుతీ సుజుకీ కార్లపై గతేడాది జరిగిన భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ ఫలితాలను ఇక్కడ చూసేయండి..
భారతదేశపు సొంత కార్ల భద్రతా విశ్లేషణ ప్రోగ్రామ్ ‘భారత్ ఎన్సీఏపీ’.. 2025 సంవత్సరంలో వివిధ బ్రాండ్లకు చెందిన కార్లను పరీక్షించింది. వీటిల్లో కొన్ని టాప్ రేటింగ్లను దక్కించుకోగా, ఇంకొన్ని మోడల్స్ పేలవ ప్రదర్శన చేశాయి. అయితే, మన దేశంలో అత్యధికంగా కార్లను విక్రయించే మారుతీ సుజుకీ, ఈసారి సేఫ్టీ విషయంలో తన ముద్ర వేసింది! మొత్తం ఐదు మారుతీ సుజుకీ మోడళ్లపై సేఫ్టీ టెస్ట్ చేయగా, అన్నీ కూడా మంచి పనితీరును కనబరిచాయి.

ఒక వేళ మీరు మారుతీ సుజుకీ కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే, భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్‌లో ఈ కంపెనీ మోడల్స్ ప్రదర్శన, సేఫ్టీ రేటింగ్ వివరాలను ఇక్కడ చూసేయండి.
| 2025లో మారుతీ సుజుకీ కార్లపై జరిగిన భారత్ ఎన్సీఏపీ టెస్ట్ ఫలితాలు | ||||
|---|---|---|---|---|
| మోడల్ | ఏఓపీ (పాయింట్లు) | రేటింగ్ (స్టార్) | సీఓపీ (పాయింట్లు) | రేటింగ్ (స్టార్) |
| మారుతీ సుజుకీ డిజైర్ | 29.46 / 32 | 5 | 41.57 / 49 | 5 |
| మారుతీ సుజుకీ విక్టోరిస్ | 31.66 / 32 | 5 | 43 / 49 | 5 |
| మారుతీ సుజుకీ ఈ విటారా | 31.49 / 32 | 5 | 43 / 49 | 5 |
| మారుతీ సుజుకీ బలెనో (2 ఎయిర్‌బ్యాగ్‌లు) | 24.04 / 32 | 4 | 34.81 / 49 | 3 |
| మారుతీ సుజుకీ బలెనో (6 ఎయిర్‌బ్యాగ్‌లు) | 26.52 / 32 | 4 | 34.81 / 49 | 3 |
| మారుతీ సుజుకీ ఇన్విక్టో | 30.43 / 32 | 5 | 45 / 49 | 5 |
| ||||
1. మారుతీ సుజుకీ డిజైర్:
సెడాన్ కార్ల మార్కెట్ తగ్గుతున్నా, డిజైర్ జోరు మాత్రం తగ్గడం లేదు. కొత్త తరం డిజైర్ కేవలం లుక్స్‌లో మాత్రమే కాదు, భద్రతలోనూ మేటి అని నిరూపించుకుంది. గతంలో గ్లోబల్ ఎన్సీఏపీలో 5-స్టార్ సాధించిన ఈ కారు, 2025లో భారత్ ఎన్సీఏపీ టెస్టుల్లోనూ 5-స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది. ముందు కూర్చునే ప్రయాణికుల తల, మెడ, కాళ్లకు ఇది మంచి రక్షణ ఇస్తుందని తేలింది.
ఎస్‌యూవీల పోటీని తట్టుకోవడమే కాదు, 2025లో బెస్ట్ సెల్లింగ్ కారుగా మారుతీ సుజుకీ డిజైర్ సెడాన్ నిలిచింది.
2. మారుతీ సుజుకీ ఈ-విటారా:
మారుతీ నుంచి రాబోతున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ఇది. ఇంకా మార్కెట్లోకి విడుదల కాకముందే భారత్ ఎన్సీఏపీ దీనిని క్రాష్ టెస్ట్ చేసింది. ఫ్రంటల్ క్రాష్ టెస్టులో డ్రైవర్, ప్యాసింజర్లకు ఈ కారు మెరుగైన రక్షణ కల్పిస్తున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా సైడ్ ఇంపాక్ట్ టెస్టులో అన్ని శరీర భాగాలకు ఇది అత్యుత్తమ రక్షణ కల్పిస్తూ ఆకట్టుకుంది.
3. మారుతీ సుజుకీ విక్టోరిస్:
2025లో లాంచ్ అయిన ఈ మారుతీ సుజుకీ విక్టోరిస్ ఎస్‌యూవీ కూడా 5-స్టార్ రేటింగ్‌తో అదరగొట్టింది. ఇందులో స్టాండర్డ్ వస్తున్న 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, లెవల్-2 అడాస్ వంటి ఫీచర్లు ప్రయాణికులకు కొండంత అండగా నిలుస్తున్నాయి. సైడ్ పోల్ ఇంపాక్ట్ టెస్టులో తల, ఛాతీ, పొత్తికడుపు భాగాలకు ఇది పూర్తి భద్రతను ఇస్తుందని నిపుణులు పేర్కొన్నారు.
4. మారుతీ సుజుకీ ఇన్విక్టో:
టయోటా భాగస్వామ్యంతో వచ్చిన ఈ ప్రీమియం కారు కూడా 5-స్టార్ రేటింగ్ సాధించింది. భారత్ ఎన్సీఏపీ జరిపిన పరీక్షల్లో, కారు ముందు భాగం బలంగా ఢీకొన్నప్పుడు కూడా ప్రయాణికుల తలకు ఎటువంటి గాయాలు కాకుండా మంచి రక్షణ లభించిందని రేటింగ్స్ వెల్లడిస్తున్నాయి.
5. మారుతీ సుజుకీ బలెనో:
బలెనోలో రెండు వెర్షన్లను భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ చేసింది. 2 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్న మోడల్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్న మోడల్.. రెండూ కూడా 4-స్టార్ రేటింగ్‌ను పొందాయి. అయితే, 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్న వెర్షన్ సైడ్ ఇంపాక్ట్ సమయంలో శరీర భాగాలకు మెరుగైన రక్షణ కల్పిస్తున్నట్లు తేలింది. పిల్లల రక్షణ విషయంలోనూ ఈ కారు సంతృప్తికరమైన ఫలితాలను ఇచ్చింది.
ఒకప్పుడు కేవలం మైలేజీకే ప్రాధాన్యత ఇస్తుందన్న విమర్శలు ఎదుర్కొన్న మారుతీ సుజుకీ.. ఇప్పుడు భద్రతలోనూ తన సత్తా చాటడం భారతీయ కస్టమర్లకు శుభపరిణామం.














