E20 petrol : ‘ఈ20 ఫ్యూయల్​తో 2-6శాతం వరకు మైలేజ్ డ్రాప్.. కానీ చాలా లాభాలు’

E20 petrol mileage : ఈ20 పెట్రోల్ వాడకంతో వాహనాల మైలేజ్ 2 నుంచి 6 శాతం తగ్గే మాట వాస్తవమేనని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లోక్‌సభలో తెలిపారు. అయితే ఇంజిన్లు పాడవుతాయనే ప్రచారంలో నిజం లేదని, దీనివల్ల ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు.

Published on: Jul 31, 2026, 10:45:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశంలో 20 శాతం ఇథనాల్ కలిపిన ఈ20 పెట్రోల్ వాడకంపై వాహనదారుల్లో చెలరేగుతున్న అనుమానాలు, విమర్శలపై పార్లమెంట్ వేదికగా పూర్తి స్పష్టత ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ20 పెట్రోల్ వాడకం వల్ల వాహనం మోడల్, దాని వయస్సును బట్టి మైలేజ్ (ఇంధన పొదుపు) 2 నుంచి 6 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని కేంద్ర రహదారి రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లోక్‌సభలో వెల్లడించారు. అయితే మైలేజ్ స్వల్పంగా తగ్గినా.. ఇంజిన్ మన్నికపై ఇది ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదని, ఈ20 వల్ల ఇంజిన్లు విఫలమైన దాఖలాలు ఎక్కడా లేవని ఆయన స్పష్టం చేశారు.

కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ..
కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ..

లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి రాతపూర్వక సమాధానం ఇస్తూ ఇథనాల్ మిశ్రమ రహిత ఇంధన కార్యక్రమాన్ని గట్టిగా సమర్థించారు. ఈ10 పెట్రోల్‌తో పోలిస్తే ఈ20 ఇంధనం వల్ల వాహనం పికప్ (యాక్సిలరేషన్) మెరుగవడమే కాకుండా, ప్రయాణం సుఫీగా ఉంటుందని చెప్పారు. అంతేకాకుండా కార్బన్ ఉద్గారాలు దాదాపు 30 శాతం వరకు తగ్గుతాయని వివరించారు. బీఎస్-III, బీఎస్-IV, బీఎస్-VI వర్గానికి చెందిన ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలపై ఈ20 ప్రభావం ఎంతవరకు ఉందో తెలుసుకోవడానికి ఏఆర్‌ఏఐ, సియామ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్) సంస్థలు సంయుక్తంగా పూర్తిస్థాయి అధ్యయనం నిర్వహించాయని పేర్కొన్నారు.

వాహనదారుల ఆందోళనలు – ప్రతిపక్షాల విమర్శలు..

సాధారణ పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపి విక్రయించే ఈ ఈ20 ఇంధనం ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. అయితే పాత వాహనదారులతో పాటు కొందరు వినియోగదారుల సంఘాలు, ప్రతిపక్షాల నుంచి దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఈ20 ఇంధనానికి అనువుగా తయారుకాని పాత వాహనాల్లో దీని వల్ల ఇంజిన్లు, ఫ్యూయల్ సిస్టమ్‌లు దెబ్బతింటున్నాయని, నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నాయని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ ఇంజిన్ పాడైతే బాధ్యత ఎవరిదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

'కోట్లాది వాహనాల్లో పరీక్షలు – ఎలాంటి ముప్పు లేదు'

ఈ విమర్శలను మంత్రి నితిన్ గడ్కరీ తిరస్కరించారు. నీతి ఆయోగ్, ఆటోమొబైల్ తయారీదారులు, చమురు సంస్థలు, ఇతర సాంకేతిక పరిశోధనా సంస్థల భాగస్వామ్యంతో ఎంతో శాస్త్రీయంగా ఆలోచించే ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చామని చెప్పారు. ప్రస్తుతం దేశంలో 20 కోట్లకు పైగా ద్విచక్ర వాహనాలు, 3 కోట్లకు పైగా పెట్రోల్ కార్లు ఈ ఇథనాల్ మిశ్రమ ఇంధనంతోనే నడుస్తున్నాయని, ఎక్కడా ఇంజిన్లు ఫెయిల్ అయినట్లు ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఈ20 ఇంధనం వాడటం వల్ల వాహన విడిభాగాల్లో ఎలాంటి అసాధారణ అరిగిపోవడం గానీ, తుప్పు పట్టడం గానీ జరగలేదని ఆటోమొబైల్ కంపెనీల సర్వీస్ డేటా ధృవీకరిస్తోందన్నారు. ఈ20 వాడే వాహనాలకు కూడా వాహన తయారీదారులు ఎప్పటిలాగే వారంటీ సేవలు అందిస్తున్నారని, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు.

ఆ ప్రచారంలో నిజం లేదు: చమురు మంత్రిత్వ శాఖ

మరోవైపు ఈ20 ఇంధనంపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని కేంద్ర చమురు, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఖండించింది. కోట్లాది వాహనాల్లో ఏళ్లకు ఏళ్లుగా ఈ ఇంధనాన్ని వాడుతున్నామని, ఇంజిన్లు పాడవుతున్నాయనే వ్యాఖ్యలు కేవలం 'అవాస్తవాలు' అని తేల్చిచెప్పింది.

పాత వాహనాల్లో మైలేజ్ తగ్గడంపై స్పందిస్తూ.. ఈ10 ఇంధనం కోసం రూపొందించిన కొన్ని పాత వాహనాల్లో మైలేజ్ కేవలం 3 నుంచి 5 శాతం మాత్రమే తగ్గుతుందని, అంతకుమించి పెద్ద తేడా ఏమీ ఉండదని సదరు శాఖ తెలిపింది. అసలు మైలేజ్ అనేది డ్రైవింగ్ విధానం, టైర్లలో గాలి, ట్రాఫిక్ పరిస్థితులు, వాహన సర్వీసింగ్ వంటి అంశాలపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుందని పేర్కొంది. పైగా ఈ20 వల్ల ఆక్టేన్ రేటింగ్ పెరిగి ఇంధనం స్వచ్ఛంగా మండుతుందని, దీనివల్ల ఇంజిన్ పనితీరు మరింత స్మూత్‌గా మారుతుందని చమురు మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More