ఇథనాల్ మ్యూచువల్ ఫండ్స్: కొత్త థీమ్‌లో పెట్టుబడులు.. నిపుణుల సలహాలివే
దేశంలో ఇథనాల్ బ్లెండింగ్‌కు ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఈ సరికొత్త థీమ్ వైపు మొగ్గు చూపుతున్నారు. నేరుగా స్టాక్స్‌లో కాకుండా మ్యూచువల్ ఫండ్ల ద్వారా ఇందులో ఎలా ఇన్వెస్ట్ చేయాలో నిపుణులు వివరిస్తున్నారు.
భారత ప్రభుత్వం ఇథనాల్ బ్లెండింగ్‌ను (E20 పెట్రోల్) వేగంగా ప్రోత్సహిస్తుండటంతో స్టాక్ మార్కెట్లో ఒక సరికొత్త ఇన్వెస్ట్‌మెంట్ థీమ్ తెరపైకి వచ్చింది. ఆటోమొబైల్, ఈవీ, షుగర్, డిస్టిలరీస్, ఆయిల్ మార్కెటింగ్, ఎనర్జీ రంగాల్లోని కంపెనీలకు ఈ నిర్ణయం కొత్త ఊపునిస్తోంది. అయితే వాహనాల మైలేజీ తగ్గడం, పాత ఇంజన్లకు ఇథనాల్ ఇంధనం ఎంతవరకు సరిపోతుందనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇథనాల్ థీమ్‌లో ఇప్పుడు పెట్టుబడులు పెట్టవచ్చా లేదా అనే సందిగ్ధత ఇన్వెస్టర్లలో నెలకొంది. మ్యూచువల్ ఫండ్ల ద్వారా లభిస్తున్న అవకాశాలు, ఇందులో ఉన్న రిస్కులపై మార్కెట్ నిపుణులు కీలక విషయాలు పంచుకున్నారు.

ప్రత్యేకంగా ఇథనాల్ ఫండ్స్ ఉన్నాయా?
ప్రస్తుతానికి మార్కెట్లో నేరుగా ఇథనాల్ రంగంపైనే ఇన్వెస్ట్ చేసే ప్రత్యేక మ్యూచువల్ ఫండ్స్ ఏవీ లేవు.
"ఇండియాలో ప్రస్తుతానికి ప్యూర్-ప్లే ఇథనాల్ మ్యూచువల్ ఫండ్స్ లేవు. షుగర్, డిస్టిలరీస్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, ఎనర్జీ, ఆటో రంగానికి చెందిన థీమాటిక్, సెక్టోరల్ ఫండ్ల ద్వారా ఈ థీమ్‌లో పరోక్షంగా ఇన్వెస్ట్ చేయవచ్చు" అని ఆనంద్ రాఠీ వెల్త్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చిరాగ్ ముని పేర్కొన్నారు.
ఇథనాల్ ఇంధన తయారీ సంస్థల్లో 10 శాతం కంటే ఎక్కువ పెట్టుబడులు ఉన్న కొన్ని ఫండ్లను ఆయన సూచించారు. ఫోన్‌పే కి చెందిన 'షేర్.మార్కెట్' క్వాంట్ రీసెర్చర్ నిశ్చల్ జైన్ కూడా ఇథనాల్ థీమ్ ఉన్న కొన్ని పరోక్ష ఫండ్ల వివరాలను వెల్లడించారు. ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలను తయారు చేసే ఆటోమొబైల్ రంగాన్ని ఎంచుకోవాలనుకుంటే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నిఫ్టీ ఆటో ఇండెక్స్ ఫండ్, యూటీఐ నిఫ్టీ ఆటో ఇండెక్స్ ఫండ్స్ పరిశీలించవచ్చని ఆయన చెప్పారు.
అలాగే సప్లై చైన్, డిస్టిలరీల సామర్థ్యం పెంచుతున్న కంపెనీల కోసం ఎస్‌బీఐ ఎనర్జీ ఆపర్చునిటీస్ ఫండ్, టాటా రిసోర్సెస్ & ఎనర్జీ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ కమోడిటీస్ ఫండ్స్ ద్వారా పెట్టుబడి పెట్టవచ్చని నిశ్చల్ జైన్ వివరించారు.
ఇన్వెస్టర్లు గమనించాల్సిన ప్రధాన రిస్కులు
ఇథనాల్ రంగంలో వృద్ధి కనిపిస్తున్నప్పటికీ, కొన్ని కీలక సవాళ్లను ఇన్వెస్టర్లు మర్చిపోకూడదని చిరాగ్ ముని హెచ్చరిస్తున్నారు.
వాల్యుయేషన్లు: దేశం ఇప్పటికే దాదాపు 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ మైలురాయిని అందుకుంది. కంపెనీల ఉత్పత్తి సామర్థ్యం కూడా పెరిగింది. అంటే, ప్రభుత్వ పాలసీ వల్ల వచ్చే లాభాలు ఇప్పటికే స్టాక్ ధరల్లో ప్రతిబింబించి ఉండవచ్చు.
ముడిసరుకు కొరత: ఇథనాల్ తయారీకి చెరకు, మొక్కజొన్న, బియ్యం వంటి పంటలు అవసరం. వర్షాలు పడకపోయినా, ఆహార ద్రవ్యోల్బణం పెరిగినా ప్రభుత్వం ముడిసరుకును ఇథనాల్ వైపు మళ్లించకుండా ఆంక్షలు విధించే ప్రమాదం ఉంది. దీనివల్ల కంపెనీల మార్జిన్లు దెబ్బతింటాయి.
పర్యావరణ సవాళ్లు: ఇథనాల్ తయారీకి ఎక్కువగా వాడే చెరకు పంటకు విపరీతంగా నీరు అవసరమవుతుంది. ఇది భవిష్యత్తులో పర్యావరణ పరమైన ఆందోళనలకు దారితీయవచ్చు.
వినియోగదారుల ఆమోదం: ఇథనాల్ ఇంధనం వల్ల వాహనాల మైలేజీ తగ్గడం, పాత ఇంజన్లు పాడవడం వంటి ఆందోళనలు వాహనదారుల్లో ఉన్నాయి. ఇది ఇంధన విస్తరణపై ప్రభావం చూపవచ్చు.
ఈవీల ముప్పు: దీర్ఘకాలంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) విప్లవం వేగంగా పుంజుకుంటే, ఇథనాల్ లాంటి బ్లెండెడ్ ఇంధనాల అవసరం తగ్గిపోయే ప్రమాదం ఉంది.
ఇథనాల్ థీమ్‌కు దూరంగా ఉండాలా?
ఈ రంగానికి ప్రభుత్వం నుంచి బలమైన మద్దతు ఉన్నందున, ఇన్వెస్టర్లు దీనిని పూర్తిగా వదిలేయాల్సిన అవసరం లేదు. అలాగని కేవలం ఇథనాల్ స్టాక్స్‌ను మాత్రమే నమ్ముకుని భారీగా పెట్టుబడులు పెట్టడం కూడా సరికాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఇన్వెస్టర్లు తమ ప్రధాన పోర్ట్‌ఫోలియోను లార్జ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, లేదా మల్టీ క్యాప్ ఫండ్లలో సురక్షితంగా ఉంచుకోవాలని చిరాగ్ ముని సూచించారు. ఇథనాల్ లాంటి సెక్టోరల్ థీమ్‌లను కేవలం శాటిలైట్ అలోకేషన్ (పరిమిత పెట్టుబడి) లాగా మాత్రమే చూడాలన్నారు.
నేరుగా సింగిల్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం కంటే, డైవర్సిఫైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదా కమోడిటీ ఫండ్ల ద్వారా వెళ్లడం మంచిదని నిశ్చల్ జైన్ అభిప్రాయపడ్డారు. దీనివల్ల మార్కెట్ పరిస్థితులు లేదా ప్రభుత్వ నిబంధనలు మారినా, ఫండ్ మేనేజర్లు పెట్టుబడులను ఇతర రంగాలకు సులువుగా మళ్లించే అవకాశం ఉంటుంది.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


