...
...
Next Story

E20 పెట్రోల్‌తో వాహన ఇన్సూరెన్స్ రద్దు కాదు: కేంద్రం కీలక ప్రకటన

E20 (ఇథనాల్ బ్లెండెడ్) పెట్రోల్ వాడటం వల్ల వాహనాల ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు రద్దవుతాయనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని, ఇథనాల్ వల్ల ఇంజన్లు పాడవుతున్నాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవని తేల్చిచెప్పింది.

Published on: Jun 24, 2026 01:12 PM IST
Advertisement

వాహనదారుల్లో గందరగోళం సృష్టిస్తున్న E20 పెట్రోల్ (ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్) ఇన్సూరెన్స్ వివాదంపై కేంద్ర ప్రభుత్వం గట్టి క్లారిటీ ఇచ్చింది. E20 పెట్రోల్ వాడటం వల్ల వాహన ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు చెల్లకుండా పోతాయనే ప్రచారాన్ని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ పూర్తిగా తోసిపుచ్చింది.

E20 పెట్రోల్‌తో వాహన ఇన్సూరెన్స్ రద్దు కాదు: కేంద్రం కీలక ప్రకటన
E20 పెట్రోల్‌తో వాహన ఇన్సూరెన్స్ రద్దు కాదు: కేంద్రం కీలక ప్రకటన

"ఇథనాల్ బ్లెండింగ్ అనేది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన విధానం. అమెరికా, బ్రెజిల్, జపాన్ వంటి పలు దేశాల్లో ఇది ఇప్పటికే విజయవంతంగా అమలవుతోంది" అని మంత్రిత్వ శాఖ తన అధికారిక ప్రకటనలో పేర్కొంది.

ఇది చెరకు రసం కాదు.. నాణ్యమైన ఇంధనం

సోషల్ మీడియాలో పెట్రోల్‌లో నేరుగా చెరకు రసాన్ని కలుపుతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఇటువంటి వార్తలు పూర్తిగా నిరాధారమైనవని స్పష్టం చేసింది. ఇథనాల్‌ను చెరకు రసం, మొలాసిస్, నూకలు (విరిగిన బియ్యం), మొక్కజొన్న వంటి రకరకాల ముడి పదార్థాల నుండి తయారు చేసినప్పటికీ.. అది పారిశ్రామిక ప్రక్రియల ద్వారా రూపాంతరం చెందుతుందని వివరించింది. కిణ్వ ప్రక్రియ (Fermentation) వంటి కఠినమైన దశల గుండా వెళ్ళిన తర్వాత తయారయ్యే ఇథనాల్ గుణాలు, దాని ముడి పదార్థాల కంటే పూర్తిగా భిన్నంగా ఉంటాయని స్పష్టం చేసింది.

చీమల పుకార్లకు శాస్త్రీయ ఆధారం లేదు

ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో వాహనం ఫ్యూయల్ ట్యాంక్ వద్ద చీమలు చేరడంపై భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) వివరణ ఇచ్చింది. ఇథనాల్ తయారీలో డిస్టిలేషన్ ప్రక్రియను ఉపయోగించడం వల్ల తుది ఇంధనంలో చక్కెర అవశేషాలు ఏమాత్రం మిగలవని స్పష్టం చేసింది. పైగా, ఫ్యూయల్ గ్రేడ్ ఇథనాల్‌లో కీటకాలను వికర్షించే (Repellent) రసాయనాలు ఉంటాయని తెలిపింది. E20 ఇంధనంలో చీమలను ఆకర్షించే గుణాలు ఏవీ లేవని, ఈ ప్రచారానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని వెల్లడించింది.

ఇంజన్ ఫెయిల్యూర్ ఆరోపణలు అవాస్తవం

ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ ద్వారా దేశానికి భారీగా విదేశీ మారక ద్రవ్యం ఆదా అయిందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ముడి చమురు దిగుమతులు తగ్గడం వల్ల ఇప్పటివరకు దేశానికి రూ.1.4 లక్షల కోట్లకు పైగా మిగిలాయని పేర్కొంది. ఇథనాల్ తయారీకి అవసరమైన వ్యవసాయ ముడిపదార్థాలకు డిమాండ్ పెరగడం వల్ల రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తోంది. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఎంతగానో తోడ్పడుతోంది. భారతదేశ ఇంధన భద్రతను పెంపొందించడంలో, కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో, స్వచ్ఛమైన రవాణా వ్యవస్థ వైపు అడుగులు వేయడంలో ఇథనాల్ బ్లెండింగ్ కీలక పాత్ర పోషిస్తోంది. వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని శాస్త్రీయ ఆధారాలతోనే ఈ కార్యక్రమాన్ని మరింత పారదర్శకంగా ముందుకు తీసుకెళ్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe