...
...
Next Story

ఓటర్ల జాబితా నుంచి తొలగించిన వారికి ఈసీ మరో అవకాశం

ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) డ్రాఫ్ట్ జాబితాలో పేర్లు కోల్పోయిన తెలుగు రాష్ట్రాలతో సహా ఏడు రాష్ట్రాల ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం మళ్లీ అవకాశం కల్పించింది. ఇకపై ఫారం-6 సమర్పించాల్సిన అవసరం లేకుండానే, తమ వివరాలను సరిచేసుకుని తిరిగి ఓటరు జాబితాలో చేరేందుకు వెసులుబాటు కల్పించింది.

Published on: Nov 7, 2026, 07:25:53 IST
Advertisement

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో సహా 7 రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) డ్రాఫ్ట్ నుంచి పేర్లు తొలిగిపోయిన కోట్లాది మంది పౌరులకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) బిగ్ రిలీఫ్ ఇచ్చింది. 'ఏఎస్డీడీ' (గైర్హాజరు, స్థలం మారినవారు, మరణించినవారు, నకిలీ) వర్గాల కింద డ్రాఫ్ట్ ఓటరు జాబితా నుంచి తొలగించిన ఓటర్లు తిరిగి తుది జాబితాలో చేరేందుకు ఈసీ మరో ಅవకాశం ఇచ్చింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు (సీఈఓలు) ఆదేశాలు పంపింది.

ఓటర్ల జాబితా నుంచి తొలగించిన వారికి ఈసీ మరో అవకాశం
ఓటర్ల జాబితా నుంచి తొలగించిన వారికి ఈసీ మరో అవకాశం

ఈ ప్రక్రియ కోసం పాత ఓటర్లు కొత్తగా 'ఫారం-6' సమర్పించాల్సిన అవసరం లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దరఖాస్తు ఆమోదం పొందిన ఓటర్లకు గతంలో ఉన్న పాత ఈపీఐసీ (EPIC) సంఖ్యనే పునరుద్ధరిస్తారు. పాత ఓటర్లను కొత్తగా నమోదైన వారిగా కాకుండా, ఉన్న నివాసితులుగానే పరిగణిస్తున్నట్లు స్పష్టమవుతోంది. దేశవ్యాప్తంగా డ్రాఫ్ట్ జాబితాల నుంచి తొలగించిన 13.4 కోట్ల మందిలో దాదాపు 13 కోట్ల మంది ఈ ఏఎస్డీడీ వర్గానికి చెందినవారే ఉండడం గమనార్హం.

పోలింగ్ కేంద్రాల్లో జాబితాల ప్రదర్శన

ఎస్ఐఆర్ సవరణ సమయంలో గణన ఫారాలు తిరిగి అందక, డ్రాఫ్ట్ రోల్స్‌లో చోటు దక్కించుకోలేకపోయిన ఏఎస్డీడీ ఓటర్ల జాబితాలను సంబంధిత పోలింగ్ కేంద్రాల నోటీసు బోర్డులపై బీఎల్‌ఓలు మళ్లీ ప్రదర్శిస్తారని ఈసీ తెలిపింది. కొత్త ఓటరుగా మారడానికి ఫారం-6 నింపాల్సిన పనిలేదని, నిర్దేశిత డిక్లరేషన్‌తో ఎన్యూమరేషన్ ఫారాన్ని తిరిగి నింపితే సరిపోతుందని ఎన్నికల సంఘం ఉన్నతాధికారి వెల్లడించారు.

ఫారం-6 వివాదం - న్యాయస్థానాల జోక్యం

ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, నిబంధనలు 1960 ప్రకారం ఫారం-6 అనేది కేవలం మొదటిసారి ఓటరుగా నమోదయ్యే వారి కోసం ఉద్దేశించింది. అందులో "తాను మొదటిసారి మాత్రమే నమోదు చేసుకుంటున్నానని, మరెక్కడా ఓటు లేదని" అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ తప్పుడు ప్రకటన ఇస్తే సెక్షన్ 31 ప్రకారం ఏడాది వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధించే అవకాశముంది. అప్పటికే ఓటు హక్కు కలిగి ఉన్న పాత ఓటర్లు కూడా ఫారం-6 నింపాలనడం వివాదాస్పదమైంది.

మరోవైపు బొంబాయి హైకోర్టు గోవా బెంచ్ జస్టిస్ వాల్మీకి మెనెజెస్, జస్టిస్ అమిత్ జమ్సాండేకర్లతో కూడిన ధర్మాసనం తీర్పునిస్తూ, కేవలం చిరునామా మారిన పాత ఓటర్లను ఫారం-6 నింపాలని నిర్బంధించకూడదని, ఎస్ఐఆర్ ప్రక్రియ సాగుతున్నప్పటికీ ఫారం-8 సమర్పించేందుకు అనుమతించాలని ఆదేశించింది.

ఇంటింటికీ బీఎల్‌ఓలు - ఈసీ కొత్త కార్యాచరణ

ఈసీ నూతన ఉత్తర్వుల ప్రకారం, పూర్తికాని ఎన్యూమరేషన్ ఫారాలను ఈసీఐనెట్ (ECINET) డాష్‌బోర్డ్‌లో పునరుత్పత్తి చేస్తారు. జిల్లా ఎన్నికల అధికారులు, ఈఆర్‌వోలు ప్రత్యక్షంగా లేదా వాట్సాప్, ఈమెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా ఓటర్లను సంప్రదిస్తారు. బీఎల్‌ఓలు రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లతో (బీఎల్‌ఏ) కలిసి ఇంటింటికీ తిరుగుతారు. పొరుగువారు, కుటుంబ సభ్యులు, నివాస సంక్షేమ సంఘాలను (RWA) అడిగి వివరాలు సేకరిస్తారు. ఓటర్లు తమ పాత ఈపీఐసీ సంఖ్యను ఉపయోగించి ఆన్‌లైన్‌లోనూ ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకుని నింపవచ్చు.

దరఖాస్తు విధానం

చిరునామా మారని ఓటర్లు: గత రౌండ్‌లో ఎందుకు దరఖాస్తు చేయలేకపోయారో వివరిస్తూ సంతకం చేసిన ఎన్యూమరేషన్ ఫారంను స్వయంగా గానీ, కుటుంబ సభ్యుల ద్వారా గానీ లేదా ఈ-సైన్‌తో ఆన్‌లైన్‌లో గానీ సమర్పించాలి.

రాష్ట్ర పరిధిలోనే చిరునామా మారిన ఓటర్లు: వీరు ఫారం-8 నింపాల్సిన అవసరం లేదు. కొత్త నియోజకవర్గ ఈఆర్‌వోకు ఎన్యూమరేషన్ ఫారంతో పాటు వివరణ పత్రం, నూతన చిరునామా ఆధారాలను అందజేస్తే సరిపోతుంది. వెబ్‌సైట్ లేదా యాప్‌లోని 'బుక్ ఏ కాల్ విత్ బీఎల్‌ఓ' సౌకర్యాన్ని వాడుకోవచ్చు.

నిరాశ్రయులైన ఓటర్లు: నివాస ఆధారాలు లేని నిరాశ్రయులకు బీఎల్‌ఓ ఫీల్డ్ వెరిఫికేషన్ నివేదికే ప్రామాణికంగా పనిచేస్తుంది.

గతంలోనే ఫారం-6 దరఖాస్తు చేసిన ఓటర్లు మళ్లీ దరఖాస్తు చేయనవసరం లేదు. వారి దరఖాస్తులను ఈసీ నవంబరు 3 నాటి వివరణ ప్రకారం పరిశీలిస్తుంది. సుప్రీంకోర్టు సూచనలు, సీఈఓల విజ్ఞప్తి మేరకు అక్టోబరు 29న ఎస్ఐఆర్ గడువును ఈసీ ఇప్పటికే పలుమార్లు పొడిగించిన సంగతి తెలిసిందే.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks