ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.
పగలు రూపాయిన్నర.. రాత్రి 10 రూపాయలు.. ఎండాకాలంలో మన పరిస్థితి ఏంటి?
భూతాపానికి ఎల్‌నినో తోడవడంతో భారత్‌లో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. ఏప్రిల్-ఆగస్టు మధ్య డిమాండ్ 9.5 శాతం ఎగబాకగా, రాత్రివేళల్లో సరఫరా ఒత్తిడి పెరిగింది. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మన పవర్ గ్రిడ్లను ఎలా ఆధునికీకరించాలో నిపుణుల విశ్లేషణ ఇది.
వేసవి వేడికి తోడు ఉక్కపోత పెరిగితే ఏసీలు, కూలర్ల వాడకం ఆకాశాన్నంటుతుంది. సరిగ్గా ఇదే ఇప్పుడు భారత విద్యుత్ రంగానికి అతిపెద్ద పరీక్షగా మారింది. ఇప్పటికే వేడెక్కిన వాతావరణ పరిస్థితుల మధ్య 'ఎల్‌నినో' (El Niño) ప్రభావం తోడవడంతో దేశంలో వాతావరణ విపత్తులతో పాటు విద్యుత్ డిమాండ్ కూడా అనూహ్యంగా పెరుగుతోంది.
ఎల్‌నినో అనేది ప్రపంచానికి కొత్తేమీ కాదు. 1600వ దశకంలో పెరూ దేశపు మత్స్యకారులు సముద్రపు నీరు అసాధారణంగా వేడెక్కడాన్ని, అదే సమయంలో తమకు చేపల వేట తగ్గడాన్ని గమనించారు. సాధారణంగా క్రిస్మస్ సమయంలో ఈ మార్పు కనిపించడంతో దీనికి 'ఎల్‌నినో డి నావిడాడ్' (క్రైస్ట్ చైల్డ్) అని పేరు పెట్టారు. ఉపగ్రహాలు, వాతావరణ నమూనాలు లేని కాలంలోనే వారు భూమిపై అత్యంత ప్రభావవంతమైన వాతావరణ చక్రాన్ని గుర్తించారు. ప్రతి రెండు నుంచి ఏడేళ్లకు ఒకసారి మధ్య, తూర్పు పసిఫిక్ మహాసముద్రం వేడెక్కడం వల్ల ప్రపంచవ్యాప్తంగా వర్షపాతం, ఉష్ణోగ్రత, వాతావరణ సరళి మారిపోతుంటుంది.
అయితే దశాబ్దాలుగా పెరుగుతున్న భూతాపం వల్ల ఎల్‌నినోకు ఇప్పుడు అత్యంత వేడి వాతావరణం పునాదిగా దొరికింది. సముద్రాలు, వాతావరణం మరింత వేడెక్కడం వల్ల వాతావరణ విపత్తుల తీవ్రత, తరచుదనం పెరుగుతున్నాయి. మానవ తప్పిదాల వల్ల కలిగే వాతావరణ మార్పులకు, ఎల్‌నినోకు ఉన్న కచ్చితమైన సంబంధంపై శాస్త్రవేత్తలు ఇంకా అధ్యయనం చేస్తున్నప్పటికీ, ఒకదానికొకటి తోడై సృష్టిస్తున్న విపత్తులపై ఎలాంటి సందేహం లేదు.
విపత్తుల రూపంలో విరుచుకుపడుతున్న ముప్పు
ఇటీవలి ప్రకృతి వైపరీత్యాలే ఇందుకు నిదర్శనం. ఆగస్టు చివరిలో ఎల్‌నినోతో సంబంధం ఉన్న తుపాను అవశేషాల కారణంగా భారీ వర్షాలు కురిసి అమెరికాలోని గ్రాండ్ కాన్యన్లో ప్రాణాంతక వరదలు సంభవించాయి. అంతకు కొద్ది రోజుల ముందే నేపాల్‌లో హిమానీనదం (గ్లేసియర్) కూలి భారీ జలప్రళయం విరుచుకుపడింది. గత మూడు దశాబ్దాలుగా నేపాల్ హిమానీనదాలు తమ మంచు పరిమాణంలో దాదాపు మూడో వంతు కోల్పోయాయి. 2010వ దశకంలో ఈ వేగం మరింత పుంజుకుంది. ప్రపంచ గ్రీన్హౌస్ ఉద్గారాల్లో 0.1 శాతం కంటే తక్కువ వాటా ఉన్న నేపాల్, ఈ విపత్తుల నుంచి కోలుకుని పునర్నిర్మాణం చేపట్టడానికి సుమారు 4 నుంచి 5 బిలియన్ డాలర్లు (యూఎస్డీ) ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో దాదాపు పదో వంతుకు సమానం.
ఈ పరిణామాలు 2013 నాటి కేదార్నాథ్ జలప్రళయాన్ని గుర్తుచేస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అస్తవ్యస్తమైన వాతావరణ పరిస్థితుల వల్ల ఇలాంటి విపత్తులు మరింత పెరుగుతాయని శాస్త్రవేత్తలు ఆనాడే హెచ్చరించారు. పదమూడేళ్ల తర్వాత ఆ హెచ్చరికలు కళ్లముందే నిజమవుతున్నాయి. ఈ విపత్తులు మనుషుల ప్రాణాలపైనే కాకుండా ఆర్థిక వ్యవస్థ, పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మరోవైపు భూతాపాన్ని కట్టడి చేయడానికి సంప్రదాయ ఇంధనాలకు దూరమై పునరుత్పాదక ఇంధనం, విద్యుదీకరణను వేగంగా విస్తరించాల్సిన అవసరం ఉంది. వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో అంచనా వేయలేని పరిస్థితుల్లో, ప్రజలకు నిరంతరాయంగా, అందుబాటు ధరల్లో విద్యుత్ అందించడం భారత పవర్ గ్రిడ్లకు కత్తిమీద సాములా మారింది.
ఎగబాకుతున్న విద్యుత్ వినియోగం.. మారుతున్న డిమాండ్
భారత విద్యుత్ వ్యవస్థ ప్రస్తుతం రెండు ప్రధాన సవాళ్లను ఎదుర్కొంటోంది. మొదటిది విపరీతంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్. గతేడాది ఇదే కాలంలో విద్యుత్ వినియోగం కేవలం 0.3 శాతం మాత్రమే పెరగగా, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య ఏకంగా 9.5 శాతం వృద్ధి నమోదైంది. ఎల్‌నినో ప్రభావంతో వేడి, ఉక్కపోత పెరగడం వల్ల కూలింగ్ అవసరాలు ఎక్కువ కావడమే ఇందుకు ప్రధాన కారణం.
ఈ ధోరణి రానున్న రోజుల్లో మరింత తీవ్రమవుతుందని 'సీఆర్ఈఏ' (CREA) అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. కేవలం చల్లదనం (కూలింగ్) అవసరాల కోసమే ఒక్క ఏడాదిలో దాదాపు 10 టెరావాట్ అవర్ల (టీడబ్ల్యూహెచ్) అదనపు విద్యుత్ వినియోగం పెరిగే అవకాశం ఉంది. దీని తీవ్రతను అర్థం చేసుకోవాలంటే, దేశ రాజధాని ఢిల్లీ ఏడాది పొడవునా వినియోగించే మొత్తం విద్యుత్‌లో ఇది నాలుగో వంతుకు సమానం.
వాతావరణం మారితే పునరుత్పాదక విద్యుత్‌పై ప్రభావం
రెండో సవాల్.. వాతావరణంపై ఆధారపడే పునరుత్పాదక ఇంధన వనరులను గ్రిడ్‌కు అనుసంధానించడం. వాతావరణాన్ని ముందే కచ్చితంగా అంచనా వేయడం కష్టంగా మారడంతో విద్యుత్ ఉత్పత్తిలో ఒడుదొడుకులు ఎదురవుతున్నాయి. జులైలో రుతుపవనాలు బలహీనపడటంతో మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో జలవిద్యుత్ వాటా దాదాపు 22 శాతానికి పడిపోయింది. వాతావరణ పీడనం, గాలి వేగంలో మార్పుల వల్ల పవన విద్యుత్ ఉత్పత్తిలోనూ నిలకడ లోపిస్తోంది.
ఇప్పటివరకు ఎల్‌నినో ప్రభావం అతి తక్కువగా పడింది సౌర విద్యుత్‌పైనే. పగటిపూట విద్యుత్ డిమాండ్ గరిష్ఠంగా ఉన్న సమయంలో సౌర విద్యుత్ గ్రిడ్‌కు అండగా నిలుస్తోంది. కానీ రాత్రివేళల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతుండటంతో సమస్య మొదలవుతోంది. రాత్రిపూట సౌర విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోవడంతో పెరిగిన డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా చేయడం కష్టమవుతోంది. ఈ ప్రభావం విద్యుత్ ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది. దేశంలోనే అత్యధిక గరిష్ఠ విద్యుత్ డిమాండ్ నమోదైన మే 21న, ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ డే-అహెడ్ మార్కెట్ (ఐఈఎక్స్-డీఏఎం)లో మధ్యాహ్నం 1:00 గంటకు యూనిట్ విద్యుత్ ధర రూ.1.56 వద్ద ట్రేడయ్యింది. సాయంత్రం 6:30 గంటలకు సౌర విద్యుత్ నిలిచిపోగానే, అదే యూనిట్ ధర మార్కెట్ గరిష్ఠ పరిమితి అయిన రూ.10కి చేరింది. సౌర విద్యుత్ అందుబాటులో లేనప్పుడు డిమాండ్, సరఫరా మధ్య పెరుగుతున్న ఒత్తిడికి ఇది అద్దం పడుతోంది.
ఏఐ నిఘా.. బ్యాటరీ నిల్వ సామర్థ్యమే పరిష్కారం
ఈ సవాళ్లను చూసి హరిత ఇంధన మార్పుల వేగాన్ని తగ్గించకూడదు. బదులుగా మారుతున్న పరిస్థితులను ముందే పసిగట్టే సాంకేతిక పరిజ్ఞానాన్ని మన విద్యుత్ వ్యవస్థలకు అందించాలి. ఇందులో మొదటి అడుగు గ్రిడ్ మొత్తం పర్యవేక్షణ (నెట్వర్క్-వైడ్ విజిబిలిటీ). బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లలో వెసులుబాటు లేకపోవడం, డిమాండ్-సరఫరా మధ్య అసమతుల్యత కారణంగా గతేడాది దాదాపు 2 టీడబ్ల్యూహెచ్ పునరుత్పాదక విద్యుత్‌ను వృథాగా నిలిపివేయాల్సి వచ్చింది. అదనపు విద్యుత్‌ను గ్రిడ్ స్వీకరించలేకపోవడమే ఇందుకు కారణం. ఎక్కడ డిమాండ్ పెరుగుతోంది, ఎక్కడ సరఫరాలో రద్దీ ఏర్పడుతోంది, ఎక్కడ ఉత్పత్తి తగ్గుతుందో గ్రిడ్ వ్యవస్థ ముందే గుర్తించాలి. ఆధునిక వాతావరణ అంచనాలు, కృత్రిమ మేధ (ఏఐ), డిజిటల్ గ్రిడ్ మ్యాపింగ్, రియల్-టైమ్ అనలిటిక్స్ ద్వారా విపత్తు తలెత్తకముందే ఒత్తిడిని అంచనా వేయవచ్చు.
దీంతో పాటు భారత్ ఇంధన నిల్వ (ఎనర్జీ స్టోరేజ్) వ్యవస్థలపై పెట్టుబడులను వేగవంతం చేయాలి. 2030 నాటికి దేశానికి సుమారు 208 గిగావాట్ అవర్ల (జీడబ్ల్యూహెచ్) బ్యాటరీ నిల్వ సామర్థ్యం అవసరమవుతుందని కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సీఈఏ) అంచనా వేసింది. అదనపు పునరుత్పాదక విద్యుత్‌ను నిల్వ చేయడానికి, గ్రిడ్ విశ్వసనీయతను పెంచడానికి, ఖర్చుతో కూడుకున్న నెట్వర్క్ విస్తరణను తగ్గించడానికి బ్యాటరీలు కీలక ఆస్తులుగా మారుతున్నాయి. సౌర విద్యుత్ లేని రాత్రి వేళల్లో డిమాండ్‌ను తీర్చడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.
గ్రిడ్ పటిష్టతే ఆర్థిక భద్రత
పవర్ గ్రిడ్ పటిష్టత అనేది అంతిమంగా దేశ ఆర్థిక పటిష్టతతో ముడిపడి ఉందని భారత్ గుర్తించాలి. వాతావరణ విపత్తులకు రంగాల మధ్య హద్దులు తెలియవు. అవి వ్యవసాయం, వైద్యం, పరిశ్రమలు, నీటి వ్యవస్థలు, సామాన్యుల ఇళ్లపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కాబట్టి మారుతున్న వాతావరణానికి తగ్గట్లు విద్యుత్ వ్యవస్థను తీర్చిదిద్దడానికి పెట్టే పెట్టుబడులు దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధిని కాపాడే రక్షణ కవచాలుగా పనిచేస్తాయి.
ఎల్‌నినో వంటి పరిణామాలను ఇకపై కేవలం ఒక రంగానికి పరిమితమైన తాత్కాలిక అంతరాయాలుగా చూడకూడదు. మన అభివృద్ధి ప్రణాళికల ప్రతి దశలోనూ వాతావరణ ముప్పులను పరిగణనలోకి తీసుకోవాలి. భారత్ ఇంధన రంగ పరివర్తన అనేది మనం నిర్మించే గిగావాట్ల సామర్థ్యంపైనే ఆధారపడి లేదు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ ఆ విద్యుత్‌ను ప్రజలకు నిరంతరాయంగా అందించడానికి మన గ్రిడ్లు ఎంతవరకు సిద్ధంగా ఉన్నాయనేదే అసలైన కొలమానం.
రచయిత్రి: తాన్యా సింఘాల్
(రచయిత్రి తాన్యా సింఘాల్ గ్లోబల్ ఎనర్జీ అలయన్స్ ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్ సంస్థకు భారతదేశ వైస్ ప్రెసిడెంట్, కంట్రీ హెడ్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ వ్యాసంలోని అభిప్రాయాలు రచయిత్రి వ్యక్తిగతమైనవి.)

E-Paper
