...
...
Next Story

ఈసీలో తీవ్ర విభేదాలు: సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై విపక్షాలు, సీజేపీ మండిపాటు

కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ)లో అంతర్గత విభేదాలు నెలకొన్నాయంటూ వచ్చిన కథనం తీవ్ర కలకలం రేపుతోంది. ముగ్గురు ఎన్నికల కమిషనర్లలో ఇద్దరిని సంప్రదించకుండానే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలపై సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ లక్ష్యంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Published on: Sep 23, 2026, 16:40:37 IST
Advertisement

కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయాలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియతో పాటు పలు కీలక అంశాల్లో తమకు సమాచారం ఇవ్వకుండా చీకటిలో ఉంచారని ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఫిర్యాదు చేసినట్లు వచ్చిన మీడియా నివేదిక సంచలనం సృష్టిస్తోంది. ఈ కథనం ఆధారంగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే, అధికార ప్రతినిధి సౌరభ్ దాస్ సోషల్ మీడియా వేదికగా సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

స్క్రిప్ట్ రాస్తున్నారు: సీజేపీ నేతల ఘాటు వ్యాఖ్యలు

ఈసీలో తీవ్ర విభేదాలు: సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై విపక్షాలు, సీజేపీ మండిపాటు (HT_PRINT)
ఈసీలో తీవ్ర విభేదాలు: సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై విపక్షాలు, సీజేపీ మండిపాటు (HT_PRINT)

ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను 'భారత శత్రువు'గా అభివర్ణిస్తూ అభిజీత్ దిప్కే ఎక్స్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "ఓటర్ల జాబితా నుంచి దాదాపు 12 కోట్లకు పైగా పేర్లను తొలగించారు. ఇది 2024 లోక్‌సభ ఎన్నికల్లో నమోదైన 97 కోట్ల మంది ఓటర్లలో దాదాపు 12.4 శాతానికి సమానం. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు, ప్రతిపక్షాలకు మధ్య ఓట్ల వ్యత్యాసం కేవలం 2 శాతం మాత్రమే. జ్ఞానేష్ కుమార్ ఎన్నికలను నిర్వహించడం లేదు, స్వయంగా స్క్రిప్ట్ రాస్తున్నారు" అని దిప్కే ఆరోపించారు.

మరోవైపు, సీజేపీ అధికార ప్రతినిధి సౌరభ్ దాస్ ఒక వీడియోను షేర్ చేస్తూ.. "జ్ఞానేష్ బ్రో.. ఇది ముగిసింది. భారత ఎన్నికల సంఘం పారదర్శకతను కోల్పోయింది. మన ఓట్లను, ఓటు హక్కును దొంగిలిస్తున్నారు" అని విమర్శించారు.

అసలు దర్యాప్తు నివేదికలో ఏముంది?

ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ప్రచురించిన దర్యాప్తు కథనం ప్రకారం.. కేంద్ర ఎన్నికల సంఘంలో తీవ్ర అంతర్గత విభేదాలు ఉన్నాయి. ముగ్గురు సభ్యుల కమిషన్‌లో ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషి గడిచిన 10 నెలల కాలంలో సీఈసీ తీసుకున్న నిర్ణయాలపై కనీసం 14 సార్లు అధికారికంగా తమ అభ్యంతరాలను నమోదు చేశారు.

ఈ ఆరోపణలను ఎన్నికల సంఘం వర్గాలు తోసిపుచ్చాయి. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియతో సహా ఎన్నికల సంఘం తీసుకున్న అన్ని నిర్ణయాలకూ ముగ్గురు ఎన్నికల కమిషనర్ల ఆమోదం ఉందని స్పష్టం చేశాయి.

నకిలీ, మరణించిన లేదా అనర్హులైన ఓటర్ల పేర్లను గుర్తించి తొలగించేందుకు ఈ ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను ప్రారంభించారు. గతేడాది జూన్ నెలలో బీహార్‌లో ప్రారంభమైన ఈ ప్రక్రియను ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకు విస్తరించారు. అయితే ఈ ప్రక్రియను అధికార బీజేపీకి ప్రయోజనం చేకూర్చేలా వాడుకుంటున్నారని ప్రతిపక్షాలు ఆరోపించగా, ఈసీతో పాటు బీజేపీ ఆ ఆరోపణలను తిరస్కరించాయి.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks