...
...
Next Story

Election commission : ఓటర్ల జాబితాలో పేరు పోయిందా? ఈసీ కీలక ఆదేశాలు.. మళ్లీ దరఖాస్తుకు ఛాన్స్!

ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్​ఐఆర్) తర్వాత ఓటర్ల జాబితాలో పేర్లు కోల్పోయిన అర్హులైన పౌరులతో పాటు తొలిసారి ఓటు హక్కు పొందే యువతకు ఎన్నికల సంఘం ఉపశమనం కలిగించింది. అర్హులందరినీ ఓటర్లుగా నమోదు చేసేందుకు 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో “ప్రత్యేక ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్” ప్రారంభించాలని ఆదేశించింది.

Published on: Oct 2, 2026, 10:45:26 IST
Advertisement

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఓటు హక్కు కోల్పోయిన పౌరులకు, నూతన ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్​ఐఆర్) పూర్తయిన 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అర్హులైన వారందరినీ తిరిగి నమోదు చేసేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు (స్పెషల్ డ్రైవ్స్) చేపట్టాలని ఎన్నికల అధికారులను ఆదేశించింది.

13 కోట్ల పేర్ల తొలగింపు.. చెలరేగిన వివాదం

ఓటర్ల జాబితాలో పేరు పోయిందా? ఈసీ కీలక ఆదేశాలు..
ఓటర్ల జాబితాలో పేరు పోయిందా? ఈసీ కీలక ఆదేశాలు..

దేశవ్యాప్తంగా నిర్వహించిన ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాల నుంచి దాదాపు 13 కోట్ల పేర్లను తొలగించారు. ఈ తొలగింపులపై వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు, సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే తొలగించిన పేర్లన్నీ అనర్హులవని భావించలేమని, సాంకేతిక సరిచూపులు లేదా విచారణ నిమిత్తం ముసాయిదా నుంచి తొలగించిన వాటిలో అర్హులైన ఓటర్లు కూడా ఉండే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఏ ఒక్క అర్హుడైన పౌరుడు కూడా ఓటు హక్కుకు దూరం కాకూడదనే లక్ష్యంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.

ఫారమ్-6 ద్వారా దరఖాస్తుకు అవకాశం

అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు తక్షణమే ఈ స్పెషల్ డ్రైవ్‌ను ప్రారంభించాలని కేంద్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్ 26న జారీ చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది.

"ఎస్‌ఐఆర్ ప్రక్రియలో లేదా ఆ తర్వాత పేర్లు పోయిన ఓటర్లు, అలాగే తొలిసారి ఓటు హక్కు పొందుతున్న యువత నిరంతర నవీకరణ ప్రక్రియ కింద సంబంధిత ఈఆర్‌ఓకి ఫారమ్-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు," అని ఎన్నికల సంఘం వివరించింది.

క్షేత్రస్థాయి పరిశీలన, ఇంటింటికీ బూత్ లెవల్ ఆఫీసర్లు

ఉదాహరణకు గోవాలో 97 కేసులను గుర్తించగా, వారిలో ఆరుగురు విదేశాల్లో ఉన్నారని, ముగ్గురు పోర్చుగీస్ పాస్‌పోర్ట్ కలిగిన వారని అధికారులు తేల్చారు. మిగిలిన 88 మంది అర్హులైన ఓటర్లకు ఫారమ్-6 అందించగా, వారి దరఖాస్తులను స్వీకరించి ఓటర్ల జాబితాలో పునరుద్ధరించారు.

నిజమైన ఓటర్లకు, ఇతర కారణాల వల్ల చెల్లుబాటు కాని ఓటర్లకు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడంలో ఈ క్షేత్రస్థాయి తనిఖీలు ఎంతో కీలకమని అధికారులు చెబుతున్నారు.

పౌరులు తమ ఓటు హక్కును పరిరక్షించుకోవడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఓటర్ల జాబితాలో పేరు లేనివారు ఆందోళన చెందకుండా, ఆన్‌లైన్ లేదా బీఎల్‌ఓల ద్వారా ఫారమ్-6 సమర్పించి వెంటనే ఎన్‌రోల్ చేసుకోవచ్చు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks