Election results 2026 : బెంగాల్​లో బీజేపీ లీడింగ్​- తమిళనాడులో విజయ్​ ఎక్కడ? ఎర్లీ ట్రెండ్స్ ఇలా..

west bengal election results : 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రోజొచ్చేసింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల తీర్పు నేడు వెలువడనుంది. ఓట్ల లెక్కింపునకు సంబంధించిన ఎర్లీ ట్రెండ్స్​ వివరాలను ఇక్కడ చూసేయండి..

Published on: May 4, 2026, 08:23:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

when does counting start : దేశ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం! 4 రాష్ట్రాలు, 1 కేంద్ర పాలిత ప్రాంతంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఈ ఫలితాలు కేవలం ఆయా రాష్ట్రాలకే పరిమితం కాకుండా, జాతీయ రాజకీయాల దిశను మార్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ‘ఇండియా’ కూటమికి, అధికార బీజేపీకి ఈ ఎన్నికలు ఒక అగ్నిపరీక్షలా మారాయి. ప్రాంతీయ నేతలు మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, పినరయి విజయన్ తమ రాజకీయ ఉనికిని చాటుకోవాలని చూస్తుంటే, మరోవైపు వారికి గట్టి పోటీనివ్వాలని బీజేపీ తహతహలాడుతోంది. మరి వీరిలో గెలుపెవరిది?

అసోంలో బీజేపీ మద్దతుదారులు..
అసోంలో బీజేపీ మద్దతుదారులు..

కౌంటింగ్ ప్రక్రియ: భద్రత మధ్య లెక్కింపు

ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు, ఆ తర్వాత 8:30 గంటల నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఈసారి ఎన్నికల సంఘం అత్యంత పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేయడమే కాకుండా, తొలిసారిగా క్యూఆర్ కోడ్ ఆధారిత ఐడెంటిటీ కార్డులను సిబ్బందికి అందజేశారు. బెంగాల్ వంటి సున్నితమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు.

ఎర్లీ ట్రెండ్స్​ ఇలా..

8 గంటల 15 నిమిషాల వరకు ఉన్న ఎర్లీ ట్రెండ్స్​ ప్రకారం.. పశ్చిమ బెంగాల్​లో టీఎంసీ 2 చోట్ల, బీజేపీ 7 స్థానాల్లో లీడింగ్​లో ఉన్నాయి.

తమిళనాడులో డీఎంకే 17 స్థానాల్లో, అన్నాడీఎంకే 0 చోట్ల, విజయ్​ టీవీకే 1 సీటులో లీడింగ్​లో ఉన్నాయి.

కేరళలో యూడీఎఫ్, ఎల్​డీఎఫ్​ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. రెండూ చరో 34 చోట్ల లీడింగ్​లో ఉన్నాయి. ఎన్డీఏ 3 స్థానాల్లో ముందుంది.

అసోంలో బీజేపీ ప్రభంజనం కొనసాగుతోంది! ఇక్కడ కమలదళం ఇప్పటికే 7 చోట్ల లీడింగ్​లో ఉంది. కాంగ్రెస్, ఏఐయూడీఎఫ్​ ఖాతా తెరవలేదు.

పుదుచ్చెరి విషయానికొస్తే.. ఇక్కడ ఎన్డీఏ కూటమి 3 చోట్ల ముందుంది.

(గమనిక- ఇవి ప్రాథమిక రిపోర్టులు మాత్రమే. సమయం బట్టి మారుతుంటాయి.)

బెంగాల్‌లో రికార్డు స్థాయి ఓటింగ్.. ఎవరికి లాభం?

పశ్చిమ బెంగాల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 93.05 శాతం ఓటింగ్ నమోదైంది. గత 15 ఏళ్లుగా మమతా బెనర్జీ తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న ఈ రాష్ట్రంలో, ఈసారి మార్పు వస్తుందని బీజేపీ ధీమాగా ఉంది. ఓటర్ల జాబితా నుంచి పెద్ద ఎత్తున పేర్ల తొలగింపు (ఎస్​ఐఆర్ వివాదం) జరిగినప్పటికీ, జనం పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నా, ‘దీదీ’ మ్యాజిక్ వర్కవుట్ అవుతుందా లేదా అనేది మధ్యాహ్నం కల్లా తేలిపోనుంది.

తమిళనాట మూడో శక్తిగా 'దళపతి' విజయ్!

తమిళనాడులో ఎప్పుడూ డీఎంకే, ఏఐఏడీఎంకేల మధ్యే ప్రధాన పోటీ ఉంటుంది. కానీ ఈసారి నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ సమీకరణాలను తలకిందులు చేసేలా కనిపిస్తోంది. కొన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే డీఎంకే కంటే విజయ్ పార్టీయే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుందని జోస్యం చెప్పడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి స్టాలిన్ తన అధికారాన్ని నిలబెట్టుకుంటారా లేక విజయ్ ‘సినిమాటిక్’ ఎంట్రీ ఇస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరం.

కేరళలో కమ్యూనిస్టుల ఆఖరి పోరాటం.. అసోం హిమంత హవా!

దేశంలో కేరళలో మాత్రమే అధికారంలో ఉన్న లెఫ్ట్ పార్టీలకు ఇది జీవన్మరణ సమస్య. ఇక్కడ పినరయి విజయన్ ఓడిపోతే, భారత రాజకీయాల్లో కమ్యూనిస్టులు చరిత్రగా మిగిలిపోయే ప్రమాదం ఉంది!. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ వైపు మొగ్గు చూపుతున్నాయి.

మరోవైపు, అసోంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తిరుగులేని మెజారిటీతో హ్యాట్రిక్ కొట్టబోతున్నారని అంచనాలు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ గెలిస్తే అది మోదీ నాయకత్వానికి మరింత బలాన్ని ఇస్తుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More