‘మా అబ్బాయి పేరు శేఖర్​’- నిఖిల్​ కామత్​ పోడ్​కాస్ట్​లో ఎలాన్​ మస్క్​..

నిఖిల్​ కామత్​- ఎలాన్​ మస్క్​కి సంబంధించిన డబ్ల్యూటీఎఫ్​ పోడ్​కాస్ట్​ వీడియో లైవ్​ అయ్యింది. వీరిద్దరు అనేక విషయాలపై చర్చించుకున్నారు. ఈ నేపథ్యంలో మస్క్​ తన కుమారుడి పేరు శేఖర్​ అని వివరించారు. మరోవైపు, హెచ్​1బీ వీసా వ్యవహారంపైనా ఆయన స్పందించారు.

Published on: Dec 1, 2025, 07:30:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జెరోధా సహ-వ్యస్థాపకుడు నిఖిల్ కామత్​కి చెందిన డబ్ల్యూటీఎఫ్ పోడ్‌కాస్ట్ సిరీస్‌లో మచ్​ అవైటెడ్​ ఎపిసోడ్ విడుదలైంది. ఈ ఎపిసోడ్‌లో ఎలాన్ మస్క్‌తో నిఖిల్​ కామత్​ విస్తృత శ్రేణిలో ఆసక్తికరమైన సంభాషణ చేశారు. కామత్ యూట్యూబ్ ఛానెల్‌లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న ఈ ఎపిసోడ్ టెక్నాలజీ, వ్యవస్థాపకత, ఆవిష్కరణలపై లోతుగా చర్చించింది. అంతేకాకుండా, టెస్లా అధినేత వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అరుదైన విషయాలను కూడా తెలిసింది.

నిఖిల్​ కామత్​ ఎలాన్​ మస్క్​.. (YouTube/ Nikhil Kamath)
నిఖిల్​ కామత్​ ఎలాన్​ మస్క్​.. (YouTube/ Nikhil Kamath)

శివోన్ జిలిస్, భారతీయ మూలాలు..

పోడ్​కాస్ట్​ సందర్భంగా, మస్క్ తన భాగస్వామి శివోన్ జిలిస్ భారతీయ నేపథ్యం గురించి వెల్లడించారు.

"మీకు తెలుసా, నా భాగస్వామి శివోన్... ఆమె హాఫ్​ ఇండియన్​," అని మస్క్ అనగా, కామత్ ఆశ్చర్యంతో "నాకు తెలియదు" అని బదులిచ్చారు.

మస్క్ కొనసాగిస్తూ, "అవును. ఆమెతో నాకు పుట్టిన పిల్లల్లో ఒకరికి.. నోబెల్ గ్రహీత చంద్రశేఖర్ పేరు మీదగా 'శేఖర్' అనే మిడిల్​ నేమ్​ (మధ్య పేరు) పెట్టాం," అని తెలిపారు.

దీనికి ఆశ్చర్యపోయిన కామత్, “అద్భుతం! చాలా ఆసక్తికరంగా ఉంది. శివోన్ ఎప్పుడైనా భారతదేశంలో గడిపిందా?” అని ప్రశ్నించారు.

మస్క్ స్పందిస్తూ, "లేదు, ఆమె కెనడాలో పెరిగింది" అని స్పష్టం చేశారు. అప్పుడు కామత్, ఆమె తల్లిదండ్రులు లేదా పూర్వీకుల ద్వారా ఆమె మూలాల గురించి అడుగుతున్నానని పేర్కొన్నారు. మస్క్ బదులిస్తూ, "అవును, అవును, ఆమె తండ్రి.. అంటే ఆమెను చిన్నతనంలోనే దత్తతకు ఇచ్చారు. కాబట్టి ఆమె తండ్రి యూనివర్సిటీలో ఎక్స్​ఛేంజ్​ స్టూడెంట్‌గా ఉండేవారని అనుకుంటున్నాను. కచ్చితమైన వివరాలు నాకు తెలియదు, కానీ.. ఆమెను దత్తతకు ఇచ్చారు. అవును, ఆమె కెనడాలో పెరిగింది," అని వివరించారు.

నిఖిల్​ కామత్​- ఎలామ్​ మస్క్​ వీడియోను ఇక్కడ చూడండి:

ఎవరు ఈ శివోన్ జిలిస్?

శివోన్ జిలిస్ కెనడాకు చెందిన వ్యాపారవేత్త. మస్క్ కో-ఫౌండ్​ చేసిన న్యూరోటెక్నాలజీ సంస్థ న్యూరాలింక్‌లో ఆమె కార్యనిర్వాహక హోదాలో ఉన్నారు. ఆమె పంజాబీ తల్లికి, కెనడియన్ తండ్రికి జన్మించారు.

మస్క్ పలువురు మహిళలతో పిల్లలను కలిగి ఉన్నారు. ప్రపంచ జనాభాను పెంచడానికి తాను కట్టుబడి ఉన్నానని ఆయన తరచుగా బహిరంగంగా చెబుతుంటారు. ది వాల్ స్ట్రీట్ జర్నల్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం.. జిలిస్‌కు మస్క్ అంతరంగిక వర్గంలో “ప్రత్యేక హోదా” ఉంది. ఆమెను మస్క్ పిల్లల తల్లుల్లో “అత్యంత ప్రముఖురాలు.”

భారతీయులు, ఇమ్మిగ్రేషన్‌పై ఎలాన్ మస్క్ ఏమన్నారు?

నిఖిల్ కామత్ పోడ్‌కాస్ట్‌లో, ఎలాన్ మస్క్ హెచ్​1బీ వీసాలు, నైపుణ్యం కలిగిన ఇమ్మిగ్రేషన్, అమెరికా సరిహద్దు నియంత్రణల గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ సంభాషణలో, భారతదేశం నుంచి వచ్చిన ప్రతిభావంతుల ద్వారా అమెరికా "చాలా కాలంగా ప్రయోజనం పొందుతోంది," అని మస్క్ అంగీకరించారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న “నిజంగా తెలివైన వ్యక్తులను” యునైటెడ్ స్టేట్స్ దశాబ్దాలుగా ఆకర్షించిందంటూ కామత్ చర్చను ప్రారంభించారు. అమెరికా “కొంతవరకు ఇమ్మిగ్రేషన్‌కు వ్యతిరేకంగా” మారిందని, ఇటీవలి సంవత్సరాల్లో ఇమ్మిగ్రేషన్ చుట్టూ ఉన్న ధోరణి ఎందుకు మారిందని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు బదులిస్తూ, అమెరికా అభివృద్ధిలో భారతీయ ప్రతిభ ప్రధాన పాత్ర పోషించిందని మస్క్ అంగీకరించారు. "అవును, అమెరికాకు వచ్చిన ప్రతిభావంతులైన భారతీయుల వల్ల అమెరికా విపరీతంగా ప్రయోజనం పొందిందని నేను భావిస్తున్నాను," అని ఆయన అన్నారు.

యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్న సమయంలో, హెచ్1బీ వీసా విధానంలో ఇటీవల మార్పులు జరిగిన నేపథ్యంలో మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ముందుగా అక్టోబర్‌లో, కొత్త హెచ్1బీ వీసా దరఖాస్తులకు 100,000 డాలర్ల ఫీజును ప్రవేశపెడుతూ ట్రంప్ ఒక ఆర్డర్​పై సంతకం చేశారు. అమెరికా పౌరులను నియమించుకోవడానికి కంపెనీలు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ చర్య తీసుకున్నప్పటికీ, ఇది అనేక రంగాల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది.

హెచ్-1బీ కార్యక్రమంపై ఉన్న ఆందోళనలను మస్క్ అంగీకరించినప్పటికీ, దానిని పూర్తిగా బలహీనపరచకుండా, దుర్వినియోగాన్ని సరిదిద్దడంపై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు.

"హెచ్1బీ కార్యక్రమంలో కొంత దుర్వినియోగం జరిగింది. కొన్ని అవుట్‌సోర్సింగ్ కంపెనీలు వ్యవస్థను వక్రీకరించాయి," అని ఆయన పేర్కొన్నారు. దీనికి పరిష్కారం వీసాను పూర్తిగా రద్దు చేయడం కాదని, "వ్యవస్థను వక్రీకరించడాన్ని ఆపాలి," అని ఆయన అన్నారు.

ఈ పథకాన్ని పూర్తిగా ముగించాలని కొన్ని సాంప్రదాయవాద సమూహాల నుంచి వచ్చిన డిమాండ్లను ఎలాన్ మస్క్ తోసిపుచ్చారు. "మనం హెచ్-1బీ కార్యక్రమాన్ని ముసివేయాలనే ఆలోచనను నేను సమర్ధించను. అది నిజంగా చాలా చెడ్డది," అని ఆయన స్పష్టం చేశారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More