...
...
Next Story

ఐసీయూలో అమ్మమ్మ- పని మధ్యలో వదిలి హాస్పిటల్​కి వెళ్లిన ఉద్యోగి జీతం కట్​! అరుపులు..

ఓ రెడిట్​ యూజర్​ తనకు జరిగిన సంఘటనను వివరించారు. ఇది చాలా షాకింగ్​గా ఉంది! తన అమ్మమ్మ ఐసీయూలో ఉండటంతో పనిని మధ్యలో వదిలి వెళ్లానని, దాని కారణంగా తన కంపెనీ తన జీతాన్ని కట్​ చేసిందని సదరు ఉద్యోగి వెల్లడించారు.

Published on: Dec 2, 2025, 09:10:02 IST
Advertisement

వర్క్​-లైఫ్​ బ్యాలెన్స్​ గురించి దేశంలో భారీగా చర్చ జరుగుతున్న వేళ ఒక ఆందోళనకర వార్త బయటకు వచ్చింది. ఐసీయూలో చేరిన తన అమ్మమ్మను చూసుకునేందుకు పనిని మధ్యలో ఆపి, అత్యవసరంగా వెళ్లిపోయిన కారణంగా తన కంపెనీ, తన రోజు జీతాన్ని కట్​ చేసిందని ఓ వ్యక్తి రెడిట్​ పోస్ట్​ ద్వారా వెల్లడించారు. ఈ పోస్ట్​ ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఉద్యోగుల హక్కులు, పని ప్రదేశంలో మానవత్వం గురించి ఈ పోస్ట్ పెద్ద చర్చకు దారి తీసింది.

హాస్పిటల్​కి వెళ్లిన ఉద్యోగి జీతం కట్​..
హాస్పిటల్​కి వెళ్లిన ఉద్యోగి జీతం కట్​..

"మా అమ్మమ్మను ఐసీయూలో చేర్చారు. నేను అప్పటికే లాగిన్ అయి ఇంటి నుంచి పనిచేస్తున్నప్పటికీ, అత్యవసరంగా బయలుదేరాల్సి వచ్చింది. ఈ కారణంగా, నేను క్లయింట్‌తో రాత్రి 9 గంటలకు జరిగే రెగ్యులర్ మీటింగ్‌కు హాజరు కాలేకపోయాను," అని ఆ యూజర్ పోస్ట్‌లో రాశారు.

తాను హఠాత్తుగా పని వదిలి వెళ్లాల్సి వస్తున్నటు సహోద్యోగుల్లో ఒకరికి తెలియజేశానని, కానీ మేనేజ్‌మెంట్‌కు చెప్పడం మరచిపోయానని ఆ ఉద్యోగి వివరించారు.

"నేను ఇంకా హాస్పిటల్‌లో ఉన్నప్పుడే, కంపెనీ డైరెక్టర్ అరవడం, కేకలు వేయడం మొదలుపెట్టారు. ఆ సమయంలో సరైన స్పందించే స్థితిలో ఉంటే బాగుండు అనుకున్నాను, కానీ నేను ఉన్న పరిస్థితి వల్ల, అప్పటికే మేమందరం ఒత్తిడిలో ఉండటం వల్ల నేను ప్రతిస్పందించలేకపోయాను," అని ఆ ఉద్యోగి వివరించారు.

16.5 గంటలు పని..!

కొన్ని రోజుల తర్వాత, ఆ ఉద్యోగి ఏకంగా 16.5 గంటల పాటు (ఉదయం 11 గంటల నుంచి తెల్లవారుజామున 3:30 వరకు) పనిచేయాల్సి వచ్చింది!. దీనితో సదరు ఉద్యోగి మేనేజ్‌మెంట్‌కు ఒక ఈమెయిల్ రాసి, పని ప్రదేశంలో తమ పరిమితులను స్పష్టం చేశారు.

"నేను 2025 నవంబర్ 27న 16.5 గంటలు (ఉదయం 11 గంటల నుంచి తెల్లవారుజామున 3:30 వరకు) పనిచేశాను. ఆ రోజుకు ఇది సరిపోతుందేమో దయచేసి చెప్పండి. ఒకవేళ సరిపోకపోతే, ఈ రోజు నుంచి నా షిఫ్ట్ సమయం దాటిన తర్వాత, రాత్రి ఆలస్యంగా మీటింగ్‌లు షెడ్యూల్ చేసినా కూడా, నేను పనిచేయలేనని తెలియజేస్తున్నాను."

ఆ తర్వాత, హెచ్‌ఆర్ ఆ ఉద్యోగికి ఫోన్ చేసి, కోపంగా ఉండవద్దని, ఇది పెద్ద విషయం కాదని చెప్పింది. "దురదృష్టవశాత్తూ, నాకు బాండ్ ఉండటం వల్ల నేను ఇప్పుడే రాజీనామా చేయలేను. కానీ నేను ఇకపై ఎక్కువ పనిచేయను. నా పని వరకు చేసి, మిగిలిన సమయాన్ని తెలివిగా ఒక సైడ్ హస్టిల్ లేదా ఏదైనా పనిపై దృష్టి పెట్టడానికి ఉపయోగిస్తాను," అని ఆ యూజర్ ఆ పోస్ట్‌లో జోడించారు.

సోషల్ మీడియాలో మద్దతు: 'సరైన పని చేశావు'

ఈ పోస్ట్ వైరల్ కావడంతో, సోషల్ మీడియా వినియోగదారులు ఆ ఉద్యోగిని ప్రశంసించారు. ఈమెయిల్ రాసి, తమ అభిప్రాయాన్ని బలంగా చెప్పడాన్ని నెటిజన్లు మెచ్చుకున్నారు. కొందరు ఆ బాండ్ చట్టపరంగా అమలు అవ్వకపోవచ్చని కూడా సలహా ఇచ్చారు.

ఒక యూజర్ ఇలా అన్నారు: "తగిన జవాబు ఇచ్చావు! నిజాయితీగా ఉండు, నీ నైపుణ్యాలను మెరుగుపరచుకో, అప్పుడు నువ్వు ఉద్యోగం గురించి భయపడాల్సిన అవసరం ఉండదు. అలాగే, అన్ని కమ్యూనికేషన్లను రాతపూర్వకంగా పొందడం మంచిది."

"హఠాత్తుగా వదిలి వెళ్లవద్దు, బాగా సిద్ధం చేసుకో, ఒక బ్యాకప్ సిద్ధం చేసుకున్న తర్వాతే వదిలివెళ్లు. బాండ్ చెక్ గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు," అని ఇంకొకరు వెల్లడించారు.

"నువ్వు సరైన పని చేశావు. నువ్వు రాసిన ఈమెయిల్‌కే కట్టుబడి ఉండు. దానికి ఈమెయిల్ ద్వారా మాత్రమే స్పందించమని అడుగు," అని ఇంకొకరు మద్దతు తెలిపారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks