HCL CEO : సీఈఓ స్టేజ్ మీదకు రాగానే 'జీతాలు పెంచండి' అంటూ ఉద్యోగుల నినాదాలు.. వీడియో వైరల్!

HCL 50th Anniversary : హెచ్‌సీఎల్ 50 ఏళ్ల వేడుకల్లో విచిత్ర సంఘటన జరిగింది. సీఈఓ సీ విజయకుమార్ వేదికపైకి రాగానే ఉద్యోగులంతా ఒకేసారి ‘మాకు హైక్ కావాలి’ అంటూ నినాదాలు చేశారు. చెన్నైలో జరిగిన సంగీత విభావరిలో జరిగిన ఈ ఘటన వీడియో వైరల్ అవుతోంది.

Published on: Jul 28, 2026, 10:45:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రముఖ దిగ్గజ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ 50 ఏళ్ల వార్షికోత్సవం నేపథ్యంలో నిర్వహించిన వేడుకల్లో ఊహించని సంఘటన ఎదురైంది. కంపెనీ స్వర్ణోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) సీ విజయకుమార్ వేదికపైకి రాగానే, సభలో ఉన్న ఉద్యోగుల్లో చాలా మంది.. ఒక్కసారిగా “మాకు జీతాల పెంపు (హైక్) కావాలి” అంటూ గట్టిగా నినాదాలు చేయడం మొదలుపెట్టారు.

హెచ్​సీఎల్​ సీఈఓ విజయ్​కుమార్ (Screengrab (X))
హెచ్​సీఎల్​ సీఈఓ విజయ్​కుమార్ (Screengrab (X))

అసలేం జరిగింది?

హెచ్‌సీఎల్ గ్రూప్ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో సంగీత కచేరీలు, వేడుకలను కంపెనీ ఘనంగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఇటీవల చెన్నైలో తమ ఉద్యోగుల కోసం మాత్రమే ప్రత్యేకంగా ఒక సంగీత విభావరిని ఏర్పాటు చేసింది. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చేలా ఈ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు.

అయితే ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఒక వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అందులో వేదికపై ఉన్న భారీ డిజిటల్ స్క్రీన్‌పై సీఈఓ సీ విజయకుమార్ ఫొటో కనిపిస్తోంది. ఆ తర్వాత కొన్ని క్షణాలకే ఉద్యోగుల ఈలలు, కేరింతల మధ్య ఆయన చిరునవ్వులు చిందిస్తూ వేదికపైకి వచ్చారు.

అయితే ఆయన మైక్ పట్టుకుని ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడటం ప్రారంభించగానే.. సభలోని ఒక విభాగం ఉద్యోగులంతా ఏకమై “మాకు హైక్ కావాలి.. వీ వాంట్ హైక్!” అంటూ ఒక్కసారిగా నినాదాలు చేయడం ప్రారంభించారు.

“హెచ్‌సీఎల్ సీఈఓ స్టేజ్ మీదకు రాగానే ఉద్యోగులంతా ఒకే స్వరంతో ‘మాకు జీతాల పెంపు కావాలి!’ అని గట్టిగా అరిచారు” సోషల్ మీడియా వేదికగా వైరల్ వీడియోను షేర్ చేసిన ఒక ఎక్స్ (X) వినియోగదారుడు

ఈ వీడియో ఇప్పుడు ఎక్స్ (గతంలో ట్విట్టర్)తో పాటు వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విపరీతంగా షేర్ అవుతోంది. ఐటీ రంగంలో జీతాల పెంపు ఆలస్యం కావడం, కొలువుల అభద్రత వంటి అంశాల మధ్య ఈ ఘటన ఐటీ ఉద్యోగుల ఆవేదనకు అద్దం పడుతోందని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఎవరీ సీ విజయకుమార్?

సీ విజయకుమార్ 2016లో హెచ్‌సీఎల్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత 2021లో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా (ఎండీ) నియమితులయ్యారు. తమిళనాడులోని పీఎస్‌జీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన ఈయన, 1994లో సీనియర్ ఇంజనీర్‌గా హెచ్‌సీఎల్ కంపెనీలో అడుగుపెట్టారు.

హెచ్‌సీఎల్ కామ్‌నెట్ వ్యవస్థాపక బృందంలో సభ్యుడిగా ఉన్న ఆయన, రిమోట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్ సేవలను నెలకొల్పడంలో అత్యంత కీలక పాత్ర పోషించారు. నేడు ప్రపంచవ్యాప్తంగా ఇది బిలియన్ డాలర్ల పరిశ్రమగా రూపుదిద్దుకుంది. దీనితో పాటు హెచ్‌సీఎల్ అమెరికా, హెచ్‌సీఎల్ ల్యాటిన్ అమెరికా, హెచ్‌సీఎల్ కెనడా వంటి పలు అంతర్జాతీయ విభాగాలకు కూడా ఆయన డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

హెచ్‌సీఎల్ 50 సంవత్సరాల వేడుకలు..

1976లో ప్రారంభమైన హెచ్‌సీఎల్ సంస్థ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 'గోల్డెన్ జూబ్లీ' వేడుకలను కొద్ది నెలల పాటు వైభవంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఏప్రిల్ నెలలో దిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో బాలీవుడ్ స్టార్ సింగర్ అరిజిత్ సింగ్ లైవ్ కాన్సర్ట్‌తో ఈ వేడుకలు ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి.

వివిధ నగరాల్లో ఉన్న కంపెనీ ఉద్యోగుల కోసం మొత్తం 9 భారీ సంగీత కచేరీలు నిర్వహించనున్నట్లు హెచ్‌సీఎల్ చైర్‌పర్సన్ రోష్ని నాడార్ ఇప్పటికే ప్రకటించారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More