ప్రేమలో విఫలమైతే కొందరు సైలెంట్‌గా పక్కకి జరిగిపోతారు. ఇంకొందరు మద్యం మత్తులో ఊగిసలాడుతుంటారు. కానీ కొందరు మాత్రం చాలా డేంజరెస్‌గా తయారై, ప్రేమించిన వారికే నష్టం కలిగించాలని చూస్తుంటారు. బ్రిటన్‌లోని చెస్టర్ క్రౌన్ కోర్టులో విచారణకు వచ్చిన ఒక విస్తుపోయే కేసు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తనను కాదన్న మాజీ ప్రేయసిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఓ వ్యక్తి ఏకంగా ఆమె పేరుతో నకిలీ డేటింగ్ ప్రొఫైల్ సృష్టించి, అపరిచితులను ఆమెపైకి ఉసిగొల్పాడు. తొమ్మిది రోజుల సుదీర్ఘ విచారణ తర్వాత నిందితుడు అసద్ హుస్సేన్ (36)ను కోర్టు దోషిగా నిర్ధారించింది.
'మిక్ రెన్నీ' ముసుగులో అసలు రూపం!

గ్రేటర్ మాంచెస్టర్‌కు చెందిన అసద్ హుస్సేన్.. ఏప్రిల్ 2024లో 'మిక్ రెన్నీ' అనే మారుపేరుతో ఒక మహిళకు పరిచయమయ్యాడు. వీరి మధ్య మొదలైన సంబంధం కొద్దిరోజుల్లోనే ముగిసిపోయింది. హుస్సేన్ ప్రవర్తన అత్యంత నియంత్రణగా మారడంతో ఆమె దూరం పెట్టింది. ఒక సందర్భంలో ఆమె ఇంటి వద్దకు వెళ్లి రెండు గంటల పాటు నిరంతరాయంగా బెల్ కొడుతూ వేధించడంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. చివరకు మే నెలలో ఆమె ఫోన్ చెక్ చేసి, ఇతర పురుషుల గురించి నిలదీయడంతో వారి బంధం పూర్తిగా తెగిపోయింది.
టిండర్‌లో నకిలీ ప్రొఫైల్.. ప్రాణాపాయంలో బాధితురాలు
బ్రేక్-అప్ తర్వాత హుస్సేన్ పగ పెంచుకున్నాడు. బాధితురాలి పేరుతో టిండర్‌లో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశాడు. అందులో అత్యంత దారుణమైన 'రేప్ ఫాంటసీ' మెసేజ్‌లను పోస్ట్ చేశాడు. ఆ మెసేజ్‌లు చూసిన అపరిచిత వ్యక్తులు.. ఆమె నిజంగానే తన ఇంటికి రమ్మని ఆహ్వానిస్తోందని భ్రమపడ్డారు.
ఆ రాత్రి ఏం జరిగిందంటే..
ఈ నేపథ్యంలోనే ఏకంగా 18 మంది పురుషులు వివిధ సమయాల్లో ఆమె ఇంటి అడ్రస్ వెతుక్కుంటూ వచ్చారు.
ఒకే రాత్రి నలుగురు వ్యక్తులు దాదాపు ఒకే రకమైన మెసేజ్‌లతో ఆమె తలుపు తట్టారు. ఒక వ్యక్తి అయితే ఏకంగా తలుపును బలంగా నెట్టి లోపలికి వచ్చే ప్రయత్నం చేశాడు!
{{/usCountry}}ఒకే రాత్రి నలుగురు వ్యక్తులు దాదాపు ఒకే రకమైన మెసేజ్‌లతో ఆమె తలుపు తట్టారు. ఒక వ్యక్తి అయితే ఏకంగా తలుపును బలంగా నెట్టి లోపలికి వచ్చే ప్రయత్నం చేశాడు!
{{/usCountry}}మరో సందర్భంలో బాధితురాలు ఇంట్లో లేని సమయంలో ఒక అపరిచితుడు లోపలికి రాగా, పైన గదిలో ఆమె టీనేజ్ కుమార్తె భయంతో వణికిపోయింది.
"ఇది కేవలం వేధింపు మాత్రమే కాదు, ఆమె ప్రాణాలకు ముప్పు తెచ్చేలా హుస్సేన్ పన్నిన ఒక భయంకరమైన కుట్ర," అని పోలీసులు కోర్టులో పేర్కొన్నారు.
నిందితుడిని పట్టించిన 'బిజినెస్ వెహికల్'
పోలీసులను తప్పుదోవ పట్టించడానికి హుస్సేన్ చాలా ప్రయత్నాలు చేశాడు. వేర్వేరు ఫోన్లు వాడటం, కారు నంబర్ ప్లేట్లు మార్చడం వంటివి చేశాడు. అయితే, తన వ్యాపారం పేరుతో రిజిస్టర్ అయిన ఒక వాహనం అతడి కొంపముంచింది. టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా పోలీసులు హుస్సేన్ కదలికలను ట్రాక్ చేశారు. ఆ నకిలీ ప్రొఫైల్ యాక్టివ్‌గా ఉన్న ప్రతిసారీ, హుస్సేన్ ఆమె ఇంటికి సమీపం వద్దే ఉన్నట్లు పోలీసులు ఆధారాలతో నిరూపించారు.
కోర్టు తీర్పు: జూన్‌లో శిక్ష ఖరారు..
చెషైర్ పోలీసులు ఈ కేసును తాము చూసిన "అత్యంత విచారకరమైన కేసులలో ఒకటి"గా అభివర్ణించారు. నిందితుడు హుస్సేన్ తన తప్పును ఎక్కడా ఒప్పుకోలేదు సరే కదా, కనీసం పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయలేదని పీసీ కీత్ టెర్రిల్ మండిపడ్డారు. పోలీసులను తక్కువ అంచనా వేసి తప్పించుకోవచ్చని భావించిన హుస్సేన్‌ను కోర్టు ‘స్టాకింగ్’ కేసులో దోషిగా తేల్చింది. జూన్ నెలలో అతడికి శిక్ష ఖరారు కానుంది.