Paneer : మీరు తింటున్న పన్నీర్​ అసలైనదేనా? లేక ఫేక్​ ఆ? ఇంట్లోనే ఇలా తెలుసుకోండి..

Paneer test : మార్కెట్​లో లభించే పన్నీర్‌లో స్టార్చ్, డిటర్జెంట్లు కలిపి నకిలీ పన్నీర్ తయారు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీ ఇంట్లోనే చిన్న చిన్న పరీక్షల ద్వారా పన్నీర్ స్వచ్ఛతను ఎలా గుర్తించాలో ఇక్కడ తెలుసుకోండి..

Published on: Apr 29, 2026, 10:43:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Fake Paneer Test : తెలుగు రాష్టరాల్లో, మరీ ముఖ్యంగా హైదరాబాద్​ వంటి నగరాల్లో ఈ మధ్యకాలంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహిస్తున్న దాడుల్లో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా శాఖాహారులు ప్రోటీన్ కోసం ఎక్కువగా తినే పన్నీర్ ఇప్పుడు కల్తీ మాఫియా చేతిల్లోకి వెళ్లిపోయింది! పాలతో కాకుండా యూరియా, డిటర్జెంట్లు, సల్ఫ్యూరిక్ యాసిడ్ వంటి ప్రమాదకర రసాయనాలతో తయారు చేస్తున్న 'సింథటిక్ పన్నీర్' మార్కెట్​లోకి భారీగా వస్తోంది. ఇది చూడటానికి తెల్లగా, మృదువుగా ఉన్నా.. ఆరోగ్యానికి మాత్రం తీరని నష్టం కలిగిస్తుంది.

మీరు తింటున్నది పన్నీర్​ అసలైనదేనా?
మీరు తింటున్నది పన్నీర్​ అసలైనదేనా?

మరి ప్రోటీన్ కోసం మీరు కొన్న పన్నీర్ అసలైనదేనా కాదా అని తెలుసుకోవడం ఎలా? ఇంట్లోనే ఈ టిప్స్​ పాటించి తెలుసుకోండి..

1. వాసన చూసి పసిగట్టవచ్చు..

ఫ్రెష్ పన్నీర్ ఎప్పుడూ స్వచ్ఛమైన పాల వాసనను కలిగి ఉంటుంది. పన్నీర్ ముక్కను ముక్కు దగ్గరకు తీసుకున్నప్పుడు కమ్మని వాసన వస్తే అది స్వచ్ఛమైనది. అలా కాకుండా పుల్లటి వాసన లేదా కెమికల్స్ వాసన వస్తున్నా, అసలు వాసనే లేకపోయినా అది వాడకపోవడమే శ్రేయస్కరం.

2. చేతితో నొక్కి చూడండి..

పన్నీర్ ముక్కను తీసుకుని మీ వేళ్లతో మెల్లగా నొక్కండి. అసలైన పన్నీర్ అయితే అది మెత్తగా ఉండి, ఒత్తిడికి వెంటనే ముక్కలు ముక్కలుగా విడిపోతుంది. అదే నకిలీ పన్నీర్ అయితే రబ్బరులా సాగుతుంది. ఒకవేళ అది రబ్బరు బంతిలా తిరిగి యధాస్థానానికి వస్తున్నా లేదా విరగకుండా సాగుతున్నా అది కల్తీ పన్నీర్ అని గుర్తుంచుకోండి.

3. అయోడిన్ పరీక్ష..

ఇది కల్తీని గుర్తించే అత్యంత శాస్త్రీయమైన పద్ధతి. కొద్దిగా పన్నీర్‌ను నీళ్లలో వేసి మరిగించి, ఆ తర్వాత చల్లార్చండి. అందులో కొన్ని చుక్కల అయోడిన్ టింక్చర్ వేయండి. ఒకవేళ ఆ పన్నీర్ ముక్క నీలం లేదా నలుపు రంగులోకి మారితే, అందులో బరువు పెంచడానికి 'స్టార్చ్' (గంజి వంటి పదార్థం) కలిపారని అర్థం. అసలైన పన్నీర్ రంగులో ఎలాంటి మార్పు ఉండదు.

4. పెనంపై వేడి చేయండి..

నూనె వేయకుండా ఒక చిన్న పన్నీర్ ముక్కను వేడి పెనం మీద వేయండి. స్వచ్ఛమైన పన్నీర్ వేడి తగలగానే మెత్తబడి, కమ్మని పాల వాసనను విడుదల చేస్తుంది. కల్తీ పన్నీర్ అయితే పెనంపై రబ్బరులా మారుతుంది లేదా విపరీతమైన నూనెను బయటకు వదులుతుంది. కొన్నిసార్లు దుర్వాసన కూడా రావచ్చు.

5. రంగును గమనించండి..

పన్నీర్ సహజంగా లేత తెలుపు లేదా మీగడ రంగులో ఉంటుంది. కానీ కొన్ని రసాయనాలు కలిపిన పన్నీర్ విపరీతమైన తెలుపు రంగుతో, ప్లాస్టిక్ లాంటి మెరుపుతో కనిపిస్తుంది. అతిగా తెల్లగా ఉన్న పన్నీర్‌లో బ్లీచింగ్ ఏజెంట్లు కలిపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

6. గోరువెచ్చని నీటితో పరీక్ష..

ఒక గిన్నెలో గోరువెచ్చని నీటిని తీసుకుని పన్నీర్ ముక్కను అందులో వేయండి. కొద్దిసేపటి తర్వాత ఆ నీరు పాలలా తెల్లగా మారి, పన్నీర్ ముక్క కరిగిపోతున్నట్లు కనిపిస్తే అందులో సింథటిక్ పాలు లేదా పౌడర్ కలిపినట్లు అనుమానించాలి. అసలైన పన్నీర్ నీటిలో ఉన్నా తన ఆకారాన్ని కోల్పోదు.

కల్తీ పన్నీర్ తింటే వచ్చే అనారోగ్యాలు..

నకిలీ పన్నీర్ తయారీలో వాడే యూరియా, సల్ఫ్యూరిక్ యాసిడ్ వంటి రసాయనాలు నేరుగా మన జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతాయి. వీటివల్ల తీవ్రమైన కడుపునొప్పి, విరేచనాలు, కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే పన్నీర్ కొనేటప్పుడు అది ఏ బ్రాండ్? ఎక్కడ తయారైంది? అనే అంశాలను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకోవడం ముఖ్యం.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More