మొత్తం యూట్యూబ్​లోనే నేర్చుకున్నాడు- మిలియన్​ డాలర్ల వ్యాపారానికి అధిపతి అయ్యాడు

కేవలం యూట్యూబ్ చూస్తూ వీడియో ఎడిటింగ్ నేర్చుకున్న ఓ యువకుడు.. తక్కువ కాలంలోనే తన వ్యాపారాన్ని 1.4 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 11.6 కోట్లు) స్థాయికి తీసుకెళ్లాడు. ఇతని జర్నీ ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఆసక్తికరమైన అతని ప్రయాణం గురించి ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jan 11, 2026, 06:03:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జీవితంలో ఏదైనా సాధించాలనే పట్టుదల ఉండాలే కానీ డిగ్రీలు, అనుభవం అవసరం లేదని నిరూపిస్తున్నాడు కెనడాకు చెందిన యువ పారిశ్రామికవేత్త టూన్ లే. కనీసం కాలేజీ చదువు కూడా పూర్తి చేయని ఈ కుర్రాడు.. కేవలం 'యూట్యూబ్'ని గురువుగా చేసుకుని, నేడు కోట్ల రూపాయల టర్నోవర్ చేసే స్థాయికి చేరుకున్నాడు. వినడానికి సినిమా కథలా ఉన్నా.. దీని వెనుక ఐదేళ్ల కఠోర శ్రమ దాగి ఉంది.

యూట్యూబ్​లో నేర్చుకుని కోట్లు సంపాదిస్తున్న కుర్రాడు.. (Instagram/@tuann_lee)
యూట్యూబ్​లో నేర్చుకుని కోట్లు సంపాదిస్తున్న కుర్రాడు.. (Instagram/@tuann_lee)

యూట్యూబ్‌తో మొదలైన ప్రయాణం..

టూన్ లే తన కెరీర్‌ను ఒక ప్రొడక్షన్ అసిస్టెంట్‌గా ప్రారంభించాడు. 2019లో టొరంటో ఫిల్మ్ స్కూల్‌లో చేరినప్పటికీ, కేవలం నాలుగు నెలలకే అక్కడ చదువు ఆపేసి బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత యూట్యూబ్​లో ఎడిటింగ్​ నేర్చుకోవడం ప్రారంభించాడు.

"నేను నేర్చుకున్నదంతా యూట్యూబ్ నుంచే" అని అతను గర్వంగా చెబుతాడు. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి స్థానిక వ్యాపార సంస్థల కోసం చాలా తక్కువ ధరకే వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. అలా మొదటి ఏడాది 8,500 డాలర్లు (సుమారు రూ. 7 లక్షలు) సంపాదించాడు.

కరోనా కష్టాలు.. కానీ వెనకడుగు వేయలేదు

రెండో ఏడాది సంపాదన 17,000 డాలర్లకు పెరిగినప్పటికీ, కరోనా మహమ్మారి రూపంలో అతనికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. లాక్‌డౌన్ కారణంగా, ఉన్న క్లయింట్లు అందరూ దూరమయ్యారు.

మూడో ఏడాదిలోకి అడుగుపెట్టేసరికి పరిస్థితి చాలా దారుణంగా మారింది. ఆ సమయంలో అతని సంపాదన కేవలం 12,350 డాలర్లు మాత్రమే. "ఒకానొక దశలో అంతా వదిలేసి మళ్లీ కాలేజీకి వెళ్లిపోదామా అనిపించింది," అని అతను నాటి పరిస్థితులను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్​ చేశాడు.

ఒక్క ఐడియా.. మలుపు తిరిగిన జీవితం

ఓటమి అంచున ఉన్నా టూన్ లే వెనకడుగు వేయలేదు! తన దగ్గర ఉన్న ప్రతి పైసాను మళ్లీ వ్యాపారంలోనే పెట్టుబడిగా పెట్టాడు. వేల సంఖ్యలో కంపెనీలకు కోల్డ్​ ఈమెయిల్స్ పంపాడు. అతని పట్టుదలకు ఫలితం దక్కింది. మూడో ఏడాది చివరకల్లా అతని ఆదాయం ఏకంగా 1,10,000 డాలర్లకు (సుమారు రూ. 91 లక్షలు) చేరింది.

టూన్​ లే ఇక అక్కడి నుంచి ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. నాలుగో ఏడాదిలో మొదటి ఉద్యోగిని నియమించుకుని 3,50,000 డాలర్లు సంపాదించాడు. ప్రస్తుతం అతని దగ్గర 15 మంది సభ్యుల బృందం ఉంది. ప్రపంచవ్యాప్తంగా పేరున్న బ్రాండ్స్ ఇప్పుడు అతని క్లయింట్లు. ఐదో ఏడాది ముగిసేసరికి అతని మొత్తం సంపాదన 1.4 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 11.6 కోట్లు) దాటిపోయింది.

"వ్యాపారం చేయడం అనేది నా జీవితంలో అత్యంత కష్టమైన, అదే సమయంలో ఎంతో సంతృప్తినిచ్చే పని," అని టూన్ లే తన జర్నీ గురించి చెప్పుకొచ్చాడు. పట్టుదల ఉంటే ఆకాశమే హద్దు అని ఈ యువ ఎంట్రప్రెన్యూర్ ప్రయాణం మరోసారి నిరూపించింది.

నెటిజన్ల ప్రశంసలు..

టూన్ లే సక్సెస్ స్టోరీ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

"ఏదైనా ఒక పనిని ఏళ్ల తరబడి పట్టుదలతో చేస్తే అందులో మాస్టర్ అవ్వొచ్చని నువ్వు నిరూపించావు," అంటూ ఒక యూజర్ ప్రశంసించగా, "12 వేల నుంచి లక్ష డాలర్లకు ఎదగడం నిజంగా అద్భుతం," అని మరొకరు కామెంట్ చేశారు.

మరి మీరు మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఏది అడ్డుగా ఉంది?

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More