...
...
Next Story

ఈపీఎఫ్‌ఓ వాట్సాప్ సేవలు ప్రారంభం: పీఎఫ్ బ్యాలెన్స్, పాస్‌బుక్ చెక్ చేయండిలా

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) వాట్సాప్ ద్వారా సేవలను అందుబాటులోకి తెచ్చింది. యూజర్లు అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వకుండానే కేవలం ఒక వాట్సాప్ మెసేజ్‌తో తమ పీఎఫ్ బ్యాలెన్స్, గత 5 లావాదేవీల వివరాలు తెలుసుకోవడంతో పాటు పాస్‌బుక్‌ను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Published on: Nov 2, 2026, 17:47:00 IST
Advertisement

వేతన జీవులకు నిత్యం అవసరమయ్యే ప్రొవిడెంట్ ఫండ్ (పీఎఫ్) సేవలను మరింత వేగంగా, సులభంగా అందించేందుకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈపీఎఫ్‌ఓ పోర్టల్‌లోకి వెళ్లే అవసరం లేకుండా, యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌లు గుర్తుపెట్టుకునే నిమిత్తం లేకుండానే కేవలం వాట్సాప్ ద్వారా పీఎఫ్ సేవలు పొందే సౌకర్యాన్ని ప్రారంభించింది.

ఈపీఎఫ్‌ఓ వాట్సాప్ సేవలు ప్రారంభం: పీఎఫ్ బ్యాలెన్స్, పాస్‌బుక్ చెక్ చేయండిలా
ఈపీఎఫ్‌ఓ వాట్సాప్ సేవలు ప్రారంభం: పీఎఫ్ బ్యాలెన్స్, పాస్‌బుక్ చెక్ చేయండిలా

ఈపీఎఫ్‌ఓ 74వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని 2026 నవంబర్ 1న కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ వాట్సాప్ ఆధారిత సేవలను అధికారికంగా ప్రారంభించారు. వెబ్‌సైట్ వాడకంలో ఇబ్బందులు ఎదుర్కొనే ఉద్యోగులకు, మొబైల్ యాప్‌ల నిర్వహణ కష్టంగా భావించే వారికి ఈ విధానం ఎంతగానో దోహదపడనుంది.

వాట్సాప్‌లో లభించే ప్రధాన సేవలు

సాధారణంగా ప్రజలు ఎక్కువగా ఉపయోగించే వాట్సాప్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఈపీఎఫ్‌ఓ క్రింది సేవలను అందిస్తోంది.

పీఎఫ్ బ్యాలెన్స్ తనిఖీ: మీ పిఎఫ్ ఖాతాలో ఉన్న ప్రస్తుత నిల్వను క్షణాల్లో తెలుసుకోవచ్చు.

గత 5 లావాదేవీల వివరాలు: మీ ఖాతాలో జమయిన ఆఖరి 5 నెలల చందాలు, నిధుల విత్‌డ్రాయల్ వివరాలను పరిశీలించవచ్చు.

ఈపీఎఫ్ పాస్‌బుక్ డౌన్‌లోడ్: యజమాని, ఉద్యోగి జమ చేసిన వివరాలతో కూడిన పూర్తి పాస్‌బుక్ ప్రతిని నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

పీఎంవీబీఆర్‌వై సాయం: ప్రధాన్ మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన (PMVBRY) నిబంధనలు, అవసరాలకు సంబంధించిన వ్యక్తిగత మార్గదర్శకాలను పొందవచ్చు.

వాట్సాప్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసే విధానం

ఈపీఎఫ్‌ఓ అధికారిక వాట్సాప్ నంబర్ +91 8796441800 ద్వారా ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. సేవలు త్వరగా పొందడానికి మీ యూఏఎన్ (UAN) ఖాతాకు లింక్ అయిన మొబైల్ నంబర్ నుంచే మెసేజ్ పంపాల్సి ఉంటుంది.

దశలవారీగా ప్రక్రియ ఇదే:

దశ 1: నంబర్ సేవ్ చేసుకోవడం

వాట్సాప్ ఓపెన్ చేసి సేవ్‌ చేసిన కాంటాక్ట్‌కి 'Hi' అని టైప్ చేసి మెసేజ్ పంపండి. చాట్‌బాట్ తక్షణమే స్పందిస్తుంది.

దశ 3: భాష ఎంపిక

ఆటోమేటిక్ రిప్లై వచ్చిన తర్వాత, మీకు సౌకర్యవంతంగా ఉండే భాషను ఎంచుకోవాలని చాట్‌బాట్ కోరుతుంది. అందులో మీకు నచ్చిన భాషను ఎంపిక చేసుకోండి.

దశ 4: సేవను ఎంచుకోవడం

భాషను ఎంచుకోగానే స్క్రీన్‌పై అందుబాటులో ఉన్న సేవల జాబితా కనిపిస్తుంది. అందులో బ్యాలెన్స్ చెక్, లావాదేవీల వివరాలు లేదా పాస్‌బుక్ డౌన్‌లోడ్ వంటి ఆప్షన్లలో మీకు కావలసిన దాన్ని క్లిక్ చేయండి.

దశ 5: ఓటీపీ వెరిఫికేషన్

మీ గుర్తింపును నిర్ధారించుకోవడానికి చాట్‌బాట్ ఇచ్చే సూచనలను పాటించండి. మీ యూఏఎన్ నమోదు చేసిన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ (OTP) ని చాట్‌లో నమోదు చేయాలి.

దశ 6: ఖాతా ఎంపిక - సమాచారం పొందుట

వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత, మీ పీఎఫ్ ఖాతాను ఎంచుకుంటే మీకు కావాల్సిన బ్యాలెన్స్, లావాదేవీల వివరాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి.

గత 5 లావాదేవీల వివరాలు పొందడం ఎలా?

ప్రతి నెల మీ జీతం నుంచి కట్ అయిన పీఎఫ్ సొమ్ము ఖాతాలో జమ అవుతుందో లేదో తెలుసుకోవడానికి ఈ ఆప్షన్ ఎంతో ఉపయోగపడుతుంది. ఉదాహరణకు మీ ప్రాథమిక వేతనం (Basic Salary) ₹30,000 ఉండి, అందులో 12 శాతం చొప్పున నెలకు ₹3,600 పీఎఫ్ కట్ అవుతుంటే, ఆ నిధులు జమయిన విషయాన్ని ఈ క్రింది విధంగా తనిఖీ చేయవచ్చు:

  1. ఈపీఎఫ్‌ఓ వాట్సాప్ చాట్ ఓపెన్ చేయండి.
  2. 'Hi' అని పంపి, భాషను ఎంచుకోండి.
  3. మెనూ నుంచి 'Last 5 Transactions' అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. ఓటీపీ ద్వారా వివరాలు ధ్రువీకరించండి.
  5. మీ పీఎఫ్ ఖాతాను ఎంచుకుని ఇటీవలి 5 లావాదేవీలను పరిశీలించండి.

పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?

  • అధికారిక ఈపీఎఫ్‌ఓ వాట్సాప్ చాట్‌లోకి వెళ్లండి.
  • 'Hi' అని సందేశం పంపండి.
  • మీ భాషను ఎంచుకున్న తర్వాత మెనూలో 'Download Passbook' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
  • సూచించిన విధంగా గుర్తింపు నిర్ధారణ (OTP) పూర్తి చేయండి.
  • పిడిఎఫ్ (PDF) రూపంలో వచ్చే మీ ఈపీఎఫ్ పాస్‌బుక్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

క్యూఆర్ కోడ్ (QR Code) ద్వారా చాట్ ప్రారంభించడం

ఫోన్ నంబర్ సేవ్ చేసుకోవడం ఇష్టం లేని వారు ఈపీఎఫ్‌ఓ విడుదల చేసిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి నేరుగా చాట్ ప్రారంభించవచ్చు.

  • ఈపీఎఫ్‌ఓ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన క్యూఆర్ కోడ్‌ను పరిశీలించండి.
  • వేరే ఫోన్ ఉంటే నేరుగా స్కాన్ చేయవచ్చు, లేదా అదే ఫోన్ అయితే క్యూఆర్ కోడ్ ఇమేజ్‌ను సేవ్ చేసుకుని గూగుల్ లెన్స్ లేదా స్కానర్ ద్వారా స్కాన్ చేయండి.
  • స్క్రీన్ పై కనిపించే వాట్సాప్ లింక్‌ను క్లిక్ చేస్తే నేరుగా చాట్ ఓపెన్ అవుతుంది.
  • అక్కడ 'Hi' అని టైప్ చేసి సేవలను పొందవచ్చు.

సాంకేతిక సమస్యలు - భద్రతా హెచ్చరికలు

సేవలు ప్రారంభమైన కొత్తలో ఓటీపీలు రాకపోవడం, చాట్‌బాట్ సరిగ్గా స్పందించకపోవడం వంటి సాంకేతిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అటువంటి సమయంలో కాసేపు ఆగి మళ్లీ ప్రయత్నించాలని సూచించారు.

కీలక భద్రతా సూచన:

ఈపీఎఫ్‌ఓ పేరుతో వచ్చే నకిలీ మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈపీఎఫ్‌ఓ సిబ్బంది ఎప్పుడూ మీ యూఏఎన్ పాస్‌వర్డ్, ఏటీఎం పిన్, బ్యాంకింగ్ వివరాలు లేదా ఓటీపీలను అడగరని గుర్తుంచుకోండి. అధికారికంగా ధ్రువీకరించిన వాట్సాప్ నంబర్‌ (+91 8796441800) ను మాత్రమే ఉపయోగించండి.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks