Mutual funds : సెప్టెంబర్​లో మ్యూచువల్​ ఫండ్స్ క్రాష్- ప్రతి విభాగం డౌన్.. ఇన్వెస్టర్ల పరిస్థితేంటి?

సెప్టెంబర్ 2026లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు నష్టాల్లో ముగిసినప్పటికీ, దీర్ఘకాలికంగా చూస్తే మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ బెంచ్‌మార్క్‌లు లార్జ్‌క్యాప్‌ కంటే మెరుగైన రాబడులను అందించాయని వాల్యూ రీసెర్చ్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

Published on: Oct 3, 2026, 06:45:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

స్టాక్ మార్కెట్​ ట్రేడర్లు, ఇన్వెస్టర్లతో పాటు మ్యూచువల్ ఫండ్​ పెట్టుబడిదారులకు సెప్టెంబర్​ నెల ఒక పీడకలగా మారింది! మరీ ముఖ్యంగా మ్యూచువల్​ ఫండ్స్​లో భారీ పతనం కనిపించింది.

సెప్టెంబర్​లో మ్యూచువల్​ ఫండ్స్ క్రాష్- ప్రతి విభాగం డౌన్..
సెప్టెంబర్​లో మ్యూచువల్​ ఫండ్స్ క్రాష్- ప్రతి విభాగం డౌన్..

ఈ నేపథ్యంలోనే ఈక్విటీ మార్కెట్లలో స్వల్పకాలిక హెచ్చుతగ్గులను చూసి ఆందోళన చెందే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు సెప్టెంబర్ 2026 ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పింది. ఒక నెల వ్యవధిలో లార్జ్, మిడ్ క్యాప్ ఫండ్లు పతనమైనప్పటికీ, 3 నుంచి 10 ఏళ్ల సుదీర్ఘ కాలవ్యవధిలో చూస్తే మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ రంగాలు లార్జ్‌క్యాప్ కంటే అత్యధిక రాబడులను అందించాయి.

సెప్టెంబర్‌లో పతనమైన ఫండ్లు..

ఫండ్ ప్రదర్శనను స్వల్పకాలిక నష్టాలతో కాకుండా, సరైన సూచీలతో పోల్చి చూడటం ఎంత అవసరమో ఈ డేటా నిరూపిస్తోంది. సాధారణంగా లార్జ్‌‌క్యాప్ మ్యూచువల్ ఫండ్లను నిఫ్టీ 100 టీఆర్‌ఐ, మిడ్‌క్యాప్ ఫండ్లను నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 టీఆర్‌ఐ, స్మాల్‌క్యాప్ ఫండ్లను నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250 టీఆర్‌ఐ, ఫ్లెక్సీ-క్యాప్ ఫండ్లను నిఫ్టీ 500 టీఆర్‌ఐ సూచీలతో పోలుస్తారు.

సెప్టెంబర్ నెలలో మార్కెట్ దిద్దుబాటుకు గురికావడంతో అన్ని ప్రధాన కేటగిరీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. బెంచ్‌మార్క్ సూచీల పరంగా నిఫ్టీ మిడ్‌‌క్యాప్ 150 అత్యధికంగా 7.1 శాతం పడిపోగా, నిఫ్టీ 100 సూచీ 5.9 శాతం, నిఫ్టీ 500 సూచీ 5.8 శాతం నష్టపోయాయి. స్మాల్‌క్యాప్ 250 సూచీ 3.1 శాతంతో కొంత వరకు నష్టాన్ని తట్టుకోగలిగింది.

వాల్యూ రీసెర్చ్ సెప్టెంబర్ 2026 సగటు వివరాల ప్రకారం.. యాక్టివ్ ఈక్విటీ ఫండ్ కేటగిరీలన్నీ నష్టాల్లోనే ముగిశాయి. మిడ్‌క్యాప్ ఫండ్లు సగటున 6.72 శాతం, లార్జ్‌క్యాప్ ఫండ్లు 5.83 శాతం, ఫ్లెక్సీ-క్యాప్ ఫండ్లు 5.23 శాతం, స్మాల్‌క్యాప్ ఫండ్లు 2.71 శాతం పడిపోయాయి. అయితే తమ సంబంధిత సూచీల పతనంతో పోలిస్తే, ఈ నాలుగు విభాగాల ఫండ్లు తక్కువ నష్టాన్ని నమోదు చేయడం గమనార్హం.

మ్యూచువల్ ఫండ్ కేటగరీబెంచ్​మార్క్1నెల3ఏళ్లు5ఏళ్లు10ఏళ్లు
లార్జ్ క్యాప్నిఫ్టీ100-5.9%7.8%7.1%11.7%
మిడ్​ క్యాప్నిఫ్టీ మిట్​క్యాప్ 150-7.1%13.7%14.8%16.6%
స్మాల్ క్యాప్నిఫ్టీ స్మాల్​క్యాప్ 250-3.1%14.0%14.5%14.6%
ఫ్లెక్సీ క్యాప్నిఫ్టీ500-5.8%9.5%9.0%12.8%

సోర్స్: క్యాపిటల్​మైండ్ మ్యూచువల్ ఫండ్. 30 సెప్టెంబర్ 2026 సీఏజీఆర్

దీర్ఘకాలంలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ హవా..

స్వల్పకాలంలో మార్కెట్ పడిపోయినప్పటికీ, 3 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలవ్యవధిని పరిశీలిస్తే భిన్నమైన చిత్రం కనిపిస్తుంది. 3 ఏళ్ల వార్షిక చక్రవడ్డీ రాబడి (సీఏజీఆర్) పరంగా స్మాల్‌క్యాప్ బెంచ్‌మార్క్ 14 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. మిడ్‌క్యాప్ 13.7 శాతం, ఫ్లెక్సీ-క్యాప్ 9.5 శాతం, లార్జ్‌‌క్యాప్ 7.8 శాతం రాబడిని ఇచ్చాయి.

5ఏళ్ల కాలవ్యవధిలో ఈ వ్యత్యాసం మరింత స్పష్టంగా కనిపించింది. మిడ్‌క్యాప్ విభాగం 14.8 శాతం వార్షిక రాబడితో మొదటి స్థానంలో నిలవగా, స్మాల్‌క్యాప్ 14.5 శాతంతో దానికి సమీపంలో నిలిచింది. ఫ్లెక్సీ-క్యాప్ 9 శాతం, లార్జ్‌క్యాప్ 7.1 శాతానికి పరిమితమయ్యాయి.

10ఏళ్ల సుదీర్ఘ వ్యవధిలో కూడా మిడ్‌క్యాప్‌‌దే పైచేయిగా నిలిచింది. ఇది వార్షికంగా 16.6 శాతం రాబడిని అందించగా, స్మాల్‌క్యాప్ 14.6 శాతం, ఫ్లెక్సీ-క్యాప్ 12.8 శాతం, లార్జ్‌క్యాప్ 11.7 శాతం రాబడులను నమోదు చేశాయి. ఓవరాల్‌గా 5, 10 ఏళ్ల కాల పరిమితుల్లో మిడ్‌క్యాప్ ఫండ్లు అత్యధిక ప్రదర్శన కనబరిచాయి.

ఇన్వెస్టర్లు గ్రహించాల్సిన అంశాలు..

సూచీలు మంచి రాబడులు ఇచ్చాయంటే, ఆ కేటగిరీలోని ప్రతి స్కీమ్‌ కూడా అదే స్థాయిలో రాబడి ఇస్తుందని భావించకూడదు. యాక్టివ్ ఫండ్లలో ఫండ్ మేనేజర్లు ఎంచుకునే స్టాక్స్, తీసుకొనే నిర్ణయాల ఆధారంగా పథకాల రాబడులు మారతాయి. ఇక ఇండెక్స్ ఫండ్లు, ఈటీఎఫ్​లు వంటి పాసివ్ ఫండ్లు మాత్రం నేరుగా తమ బెంచ్‌మార్క్ సూచీల ప్రదర్శనను ప్రతిబింబిస్తూ సమానమైన రాబడులను అందిస్తాయి. ఇన్వెస్టర్లు కేవలం ఒక నెల ప్రదర్శనను చూసి నిర్ణయాలు తీసుకోకుండా, తమ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా లాంగ్ టర్మ్ దృష్టితో పెట్టుబడులు కొనసాగించడం శ్రేయస్కరం.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్​లో ఇన్వెస్ట్ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More