మెస్సీ ఈవెంట్ ఆర్గ‌నైజ‌ర్ అరెస్ట్‌.. టికెట్ రిఫండ్‌కు పోలీసుల హామీ

బ్రేకింగ్.. మెస్సీ కోల్‌క‌తా టూర్ ఆర్గనైజర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. స్టేడియంలో అభిమానుల విధ్వంసం నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అంతే కాకుండా అభిమానుల టికెట్ డబ్బులు రీఫండ్ అయేలా చూస్తామని కూడా హామీనిచ్చారు. 

Published on: Dec 13, 2025 3:57 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోల్‌కతా పర్యటన సందర్భంగా స్టేడియంలో చోటు చేసుకున్న విధ్వంసంపై పోలీసులు విచారణ మొదలెట్టారు. ఈ ఈవెంట్ నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో అభిమానులు హింసాత్మకంగా ప్రవర్తించారు. మెస్సీ కొద్ది నిమిషాలు మాత్రమే ఉండి, చాలా మందికి కనిపించలేదు. దీంతో డబ్బులు పెట్టి టికెట్ కొన్న ఫ్యాన్స్ కోపంతో రచ్చ చేశారు.

కోల్‌క‌తా స్టేడియంలో ఫ్యాన్స్ రచ్చ (Sahiba Chawdhary/Reuters)
కోల్‌క‌తా స్టేడియంలో ఫ్యాన్స్ రచ్చ (Sahiba Chawdhary/Reuters)

పోలీస్ కేసు

"మెస్సీ ఆడటం లేదని అభిమానులలో కొంత కోపం లేదా ఆందోళన ఉంది. అతను ఇక్కడికి వచ్చి చేతులు ఊపి, కొందరిని కలిసి వెళ్లిపోతాడన్నది ప్రణాళిక" అని పశ్చిమ బెంగాల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజీవ్ కుమార్ వార్తా సంస్థ పీటీఐకి తెలిపారు. "ఇప్పుడు ప్రభుత్వం ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇది అన్ని అంశాలను పరిశీలిస్తుంది" అని ఆయన చెప్పారు. మెస్సీని సరిగా చూడలేకపోయిన తర్వాత సాల్ట్ లేక్ స్టేడియంలో వందలాది మంది ఫ్యాన్స్ కోపం తెచ్చుకుని సీసాలు, కుర్చీలు విసిరారు.

టికెట్ మనీ రీఫండ్

నిర్వాహకులు టిక్కెట్ల డబ్బును రీఫండ్ చేస్తామని రాతపూర్వకంగా హామీనిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇప్పుడు పరిస్థితి అదుపులో ఉందని చెప్పారు. అభిమానులు చెప్పిన దాని ప్రకారం టిక్కెట్ రేట్లు రూ.4,000 నుండి రూ.25,000 వరకు అమ్ముడయ్యాయి.

అడిషన్ డీజీపీ (శాంతిభద్రతలు) జావేద్ షమీమ్ కూడా ఆర్గనైజర్ అరెస్టును ధృవీకరించారు. "ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం. ప్రధాన నిర్వాహకుడు అరెస్ట్ అయ్యాడు’’ అని షమీమ్ వార్తా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడుతూ చెప్పారు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం అరెస్ట్ అయిన వ్యక్తి సతద్రు దత్తా అని తెలుస్తోంది.

సీఎం సారీ

"లియోనెల్ మెస్సీకి, అలాగే క్రీడాభిమానులందరికీ, అతని అభిమానులకు ఈ దురదృష్టకర సంఘటనకు నేను హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నా" అని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎక్స్ లో పోస్ట్ చేశారు. "సాల్ట్ లేక్ స్టేడియంలో ఈరోజు జరిగిన నిర్వాహక వైఫల్యాన్ని చూసి నేను తీవ్రంగా కలత చెందా. షాక్‌కు గురయ్యాను. నేను స్టేడియానికి వెళ్తున్నా. అక్కడ లియోనెల్ మెస్సీని చూడటానికి వేలాది మంది అభిమానులు తరలివచ్చారు" అని ఆమె పేర్కొన్నారు.

ముఖం కూడా చూడలేదని

వార్తా సంస్థలు షేర్ చేసిన వీడియో క్లిప్‌లలో కోపంగా ఉన్న ప్రేక్షకులు నిర్వాహకులను కార్యక్రమాన్ని "వీఐపీ ప్రదర్శన"గా మార్చినట్లు ఆరోపించారు. ఒక అభిమాని.. "నాయకులు, నటులు మాత్రమే మెస్సీ చుట్టూ ఉన్నారు" అని, రూ.12,000 చెల్లించినప్పటికీ అతని ముఖాన్ని చూడలేకపోయాన్నాడు. “కిక్ లేదు, పెనాల్టీ లేదు” అని మరో ఫ్యాన్ పేర్కొన్నాడు. ఇది మెస్సీ మూడు రోజుల, నాలుగు నగరాల “GOAT ఇండియా టూర్ 2025”లో మొదటి ఈవెంట్.