ఎగ్జిట్ పోల్స్ 2026: బెంగాల్‌లో కమలం వికసిస్తుందా? కేరళలో యూడీఎఫ్ జోరు.. తమిళనాట 'దళపతి' ప్రకంపనలు

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి. బెంగాల్‌లో బీజేపీ చారిత్రక విజయం దిశగా సాగుతుండగా, కేరళలో పదేళ్ల తర్వాత యూడీఎఫ్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఇక తమిళనాడులో నటుడు విజయ్ పార్టీ సంచలనాలకు కేంద్రబిందువుగా మారింది.

Published on: Apr 30, 2026, 08:18:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమవ్వగా, తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రాజకీయ వర్గాల్లో వేడిని పెంచుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ కోటను బద్దలు కొట్టి బీజేపీ జెండా పాతనుందని మెజారిటీ సర్వేలు అంచనా వేయగా, కేరళలో ఎల్‌డీఎఫ్ వరుస విజయాలకు బ్రేక్ పడనుందని విశ్లేషణలు వెలువడ్డాయి.

తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎగ్జిట్ పోల్ అంచనాలు (ANI/PTI)
తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎగ్జిట్ పోల్ అంచనాలు (ANI/PTI)

బెంగాల్‌లో మమతకు చెక్?

దేశం మొత్తం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పశ్చిమ బెంగాల్ ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ ఆసక్తికర అంచనాలను ఇచ్చాయి. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ 148ని దాటి, అధికారాన్ని కైవసం చేసుకుంటుందని అత్యధిక సంస్థలు ప్రకటించాయి. అయితే, 'పీపుల్స్ పల్స్' వంటి కొన్ని సంస్థలు మాత్రం తృణమూల్ కాంగ్రెస్ (TMC) హ్యాట్రిక్ కొడుతుందని విశ్లేషించాయి. ఈసారి ఎన్నికల్లో భారీ స్థాయిలో ఓట్ల తొలగింపులు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, ఓటరు తీర్పు ఎలా ఉండబోతుందనేది సోమవారం నాటి లెక్కింపులో తేలనుంది.

కేరళలో మారుతున్న పవనాలు

కేరళ రాజకీయ చరిత్రలో ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వం మారుతుందనే సంప్రదాయాన్ని 2021లో పినరయి విజయన్ చెరిపివేశారు. కానీ, 2026లో మళ్ళీ పాత సంప్రదాయమే పునరావృతం కానుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) స్పష్టమైన మెజారిటీతో పదేళ్ల తర్వాత అధికార పీఠాన్ని అధిరోహించబోతోందని అంచనా. బీజేపీ ఇక్కడ తన ఓటు బ్యాంకును పెంచుకున్నప్పటికీ, అది సీట్లుగా మారే అవకాశం తక్కువగా కనిపిస్తోంది.

తమిళనాడులో విజయ్ సంచలనం

తమిళనాడు ఎన్నికల విశ్లేషణలు రాజకీయ పండితులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. మెజారిటీ సర్వేలు ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే (DMK) మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పగా, 'యాక్సిస్ మై ఇండియా' (AxisMyIndia) మాత్రం బాంబు పేల్చింది. నటుడు విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కళగం' (TVK) రాష్ట్రంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించడమే కాకుండా, సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఈ సర్వే పేర్కొంది. అన్నాడీఎంకే (AIADMK) పూర్తిగా చతికిలపడటం విజయ్‌కు కలిసి వచ్చిందని ఈ నివేదిక సారాంశం.

ఎగ్జిట్ పోల్ అంచనాలు (HT photos)
ఎగ్జిట్ పోల్ అంచనాలు (HT photos)

అస్సాం, పుదుచ్చేరిల్లో ఎవరిది హవా?

అస్సాంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తన పట్టును నిరూపించుకోబోతున్నారు. దాదాపు అన్ని సర్వేలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే (NDA) వరుసగా మూడోసారి భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఏకగ్రీవంగా ప్రకటించాయి. పుదుచ్చేరిలో కూడా ఎన్డీయేదే విజయమని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.

ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా?

గత చరిత్రను గమనిస్తే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎప్పుడూ నూటికి నూరు శాతం నిజం కాలేదు. 2021 బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని చెప్పిన సర్వేలు, తీరా ఫలితాల రోజున తలకిందులయ్యాయి. అలాగే 2024 సాధారణ ఎన్నికల సమయంలోనూ విశ్లేషణలు తప్పాయి. కాబట్టి, అసలైన ఫలితం ఏంటో తెలియాలంటే మే 4వ తేదీ సోమవారం వరకు వేచి చూడాల్సిందే.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More