...
...
Next Story

భారీ పేలుళ్లతో దద్దరిల్లిన వెనెజువెలా.. ఇది ట్రంప్​ పనేనా?

వెనెజువెలా రాజధాని కారకాస్‌లో శనివారం తెల్లవారుజామున వరుస పేలుళ్లు సంభవించాయి. అమెరికా యుద్ధ విమానాలు తక్కువ ఎత్తులో ప్రయాణించడంతో ప్రజలు భయాందోళనతో రోడ్లపైకి పరుగులు తీశారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.

Published on: Jan 3, 2026, 13:12:06 IST
Advertisement

వెనెజువెలా రాజధాని కారకాస్‌ నగరం శనివారం తెల్లవారుజామున పేలుళ్లలతో దద్దరిల్లింది. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో కనీసం ఏడు భారీ పేలుళ్లు సంభవించాయి. అదే సమయంలో యుద్ధ విమానాలు నగరంపై తక్కువ ఎత్తులో ప్రయాణించడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు.

పేలుళ్ల అనంతరం లా కార్లొటా విమానాశ్రయం వద్ద పరిస్థితులు..
పేలుళ్ల అనంతరం లా కార్లొటా విమానాశ్రయం వద్ద పరిస్థితులు..

వెనెజువెలా- అమెరికా ఉద్రిక్తతలు, సైనిక కార్యకలాపాలు చేపడతామని అగ్రరాజ్య అధ్యక్షుడు చేసిన హెచ్చరికల నేపథ్యంలో దక్షిణ అమెరికా దేశంలో తాజా పరిణామాలు సర్వత్రా వార్తల్లో నిలిచాయి. ట్రంప్​ చెప్పింది చేసి ఉంటే, వెనెజువెలా గడ్డపై అమెరికా జరిపిన మొట్టమొదటి ప్రత్యక్ష దాడి ఇదే అవుతుంది.

నగరంలోని పలు ప్రాంతాల్లో కాల్పుల శబ్దాలు కూడా వినిపించాయని, ప్రధాన సైనిక స్థావరం సమీపంలోని దక్షిణ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అంతర్జాతీయ వార్తా సంస్థలు నివేదించాయి.

ట్రంప్ హెచ్చరికలు.. రంగంలోకి బలగాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత కొంతకాలంగా వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోపై ఒత్తిడి పెంచుతున్నారు. మదురో గద్దె దిగాలంటూ ఆంక్షలు విధించడమే కాకుండా, కరీబియన్ సముద్ర ప్రాంతంలో అమెరికా సైనిక బలగాలను భారీగా మోహరించారు. వెనెజువెలా కేంద్రంగా జరుగుతున్న మాదకద్రవ్యాల అక్రమ కార్యకలాపాలను అరికడతానని, అవసరమైతే ఆ దేశంలో దాడులు చస్తానని కూడా ట్రంప్​ హెచ్చరించారు.

డ్రగ్స్ రవాణాకు ఉపయోగిస్తున్న ఒక డాకింగ్ ఏరియాను (నౌకలు నిలిపే ప్రాంతం) అమెరికా దళాలు ధ్వంసం చేసినట్లు ట్రంప్ గతంలోనే పేర్కొన్నారు. అయితే ఈ ఆపరేషన్ సైన్యం చేసిందా లేదా (CIA) చేసిందా అనే విషయంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు.

తనపై అగ్రరాజ్యం ‘నార్కో-టెర్రరిజం’ నిందలు వేస్తున్నప్పటికీ, మదురో మాత్రం అమెరికాతో చర్చలకు సిద్ధమని ప్రకటించారు. వెనెజువెలాలో ఉన్న అపారమైన చమురు నిల్వల కోసమే అమెరికా ప్రభుత్వం ఇక్కడ తిరుగుబాటుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.

"మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టే విషయంలో అమెరికాకు చిత్తశుద్ధి ఉంటే చర్చలు జరపడానికి మేము సిద్ధం. వారికి చమురు కావాలంటే.. వెనెజువెలాలో పెట్టుబడులు పెట్టడానికి మేము ఎప్పుడూ ఆహ్వానిస్తాము," అని మదురో ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

కొనసాగుతున్న అమెరికా దాడులు

సెప్టెంబర్ నెల నుంచి సముద్ర మార్గంలో డ్రగ్స్ రవాణా చేస్తున్న నౌకలపై అమెరికా దళాలు సుమారు 30 దాడులు జరిపాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకు కనీసం 107 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అమెరికా సైనిక గణాంకాలు చెబుతున్నాయి. అయితే తాము లక్ష్యంగా చేసుకున్న నౌకలు నిజంగానే డ్రగ్స్ రవాణా చేస్తున్నాయనే దానికి అమెరికా ప్రభుత్వం ఇంకా సరైన ఆధారాలు చూపలేదు. దీనివల్ల ఈ దాడుల చట్టబద్ధతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుతం కారకాస్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అమెరికా-వెనెజువెలా మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks