Agniveer : ముగింపు దశకు తొలి బ్యాచ్ అగ్నివీరుల సేవలు- డిసెంబర్​ 31తో లాస్ట్! తర్వాత ఏంటి? బెనిఫిట్స్ ఉంటాయా?

అగ్నిపథ్ పథకం కింద ఎంపికైన తొలి బ్యాచ్‌లోని 18,000 మందికి పైగా అగ్నివీరులు తమ 4 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకుని డిసెంబర్ 31 నాటికి సాయుధ బలగాల నుంచి బయటకు రానున్నారు. మరి ఈ అగ్నివీరులకు నెక్ట్స్ ఏంటి? ఉద్యోగ అవకాశాలు ఎక్కడ లభిస్తాయి? ఇంతకాలం చేసిన పనికి బెనిఫిట్స్ ఉంటాయా?

Published on: Oct 26, 2026, 10:45:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

భారతీయ సాయుధ బలగాల చరిత్రలో అత్యంత సంచలనాత్మక మార్పుగా భావించిన ‘అగ్నిపథ్’ నియామక పథకం ఒక కీలక ఘట్టానికి చేరుకుంది! సైన్యాన్ని మరింత యువశక్తితో, పోరాట పటిమతో తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం 2022లో ప్రవేశపెట్టిన ఈ పథకం కింద ఎంపికైన తొలి బ్యాచ్ అగ్నివీరుల్లో ముప్పావు వంతు (75 శాతం) మంది డిసెంబర్ 31 నాటికి తమ నాలుగేళ్ల పదవీకాలాన్ని ముగించుకుని బయటకు రానున్నారు.

అగ్నివీరులకు నెక్ట్స్ ఏంటి? బెనిఫిట్స్ ఉంటాయా? (Representational image)
అగ్నివీరులకు నెక్ట్స్ ఏంటి? బెనిఫిట్స్ ఉంటాయా? (Representational image)

భారత నౌకాదళం (నేవీ), వైమానిక దళం (ఎయిర్​ ఫోర్స్), తదనంతరం సైన్యం (ఆర్మీ) నుంచి నవంబర్ మధ్య నాటి నుంచి విడతల వారీగా అగ్నివీరులను విడుదల చేసే ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలి విడతలో ఎంపికైన మొత్తం 24,400 మంది అగ్నివీర్లలో సుమారు 18,300 మంది విధుల నుంచి విముక్తి పొందుతారు. కేవలం 25 శాతం మందిని మాత్రమే శాశ్వత సర్వీసు (రెగ్యులర్ సర్వీస్) కోసం మరో 15 ఏళ్ల పాటు ఆర్మీ కొనసాగిస్తుంది.

తెలుగు రాష్ట్రాల యువతకు రీసెటిల్‌మెంట్ పరీక్ష!

అగ్నివీరులు చూపిన అసాధారణ పోరాట పటిమ, క్రమశిక్షణపై మూడు దళాలు (ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్) తీవ్ర సంతృప్తిని వ్యక్తం చేశాయి. ముఖ్యంగా సరిహద్దుల్లో జరిగిన ఆపరేషన్లలోనూ, విపత్కర పరిస్థితుల్లోనూ వీరు చూపిన ప్రతిభ అగ్నిపథ్ పథకంపై ఉన్న అనేక అనుమానాలను పటాపంచలు చేసింది.

ప్రస్తుతం ఆర్మీలో 2,70,000 మంది, ఎయిర్‌ఫోర్స్‌లో 27,000 మంది, నేవీలో 21,000 మంది అగ్నివీరులు సేవలు అందిస్తున్నారు.

అయితే, సైన్యం నుంచి బయటకు వచ్చే 21.5 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వయస్సు గల ఈ యువకులకు రెండో ఇన్నింగ్స్ (మరో ఉద్యోగం) కల్పించడం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సవాలుగా మారింది! తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా అనేకమంది యువకులు తొలి బ్యాచ్‌లో అగ్నివీరులుగా ఎంపికై విధులు నిర్వర్తించారు. వీరికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కల్పిస్తున్న రిజర్వేషన్లు ఎంతో కీలకం కానున్నాయి.

ఎక్కడెక్కడ ఉద్యోగ అవకాశాలు?

బయటకు వస్తున్న అగ్నివీరుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు శాఖలలో ప్రత్యేక కోటాలను ప్రకటించింది:

కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఏపీఎఫ్): బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్, ఐటీబీపీ, అసోం రైఫిల్స్ వంటి బలగాల్లో ప్రాథమిక స్థాయి ఉద్యోగాల్లో 50 శాతం పోస్టులను మాజీ అగ్నివీరులకే కేటాయించనున్నారు.

ఇతర రంగాలు: భారత రైల్వేలు, ఇండియన్ కోస్ట్ గార్డ్, 16 రక్షణ రంగ ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రత్యేక రిజర్వేషన్లు ఉంటాయి.

రాష్ట్ర పోలీస్ శాఖలు: హరియాణా, రాజస్థాన్, మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాలు తమ పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో అగ్నివీర్లకు ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించాయి.

పదాతి దళంలో యుద్ధ శిక్షణ పొందిన అగ్నివీరులకు శాంతిభద్రతలు, శాంతి పరిరక్షణ విధుల్లో శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక మోడ్యూళ్లను సిద్ధం చేస్తున్నారు.

జీతం, ఇన్సూరెన్స్, 'సేవా నిధి' ప్యాకేజీ..

సాంప్రదాయ పద్ధతిలో రిటైరయ్యే సైనికులకు 20 ఏళ్ల సర్వీసు తర్వాత పెన్షన్, హెల్త్‌కేర్ (ఈసీహెచ్​ఎస్), క్యాంటీన్ (సీఎస్​డీ) సదుపాయాలు ఉంటాయి. అగ్నివీరులకు మాత్రం ఇవి లభించవు. అయితే, వీరికి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక ప్యాకేజీని అందించారు.

జీతం: మొదటి సంవత్సరంలో రూ. 4.76 లక్షల వార్షిక జీతం కాగా, నాల్గోవ సంవత్సరానికి అది రూ. 6.92 లక్షలకు పెరుగుతుంది.

భద్రత: ఉచితంగా రూ. 48 లక్షల నాన్-కంట్రిబ్యూటరీ ఇన్సూరెన్స్ కవర్ ఉంటుంది. విధి నిర్వహణలో అమరులైతే రూ. 44 లక్షల ఎక్స్‌గ్రేషియా లభిస్తుంది.

సేవా నిధి : 4 ఏళ్ల పదవీకాలం పూర్తి చేసుకుని బయటకు వచ్చే ప్రతి అగ్నివీర్‌కు రూ. 11.71 లక్షల సేవా నిధి ప్యాకేజీ అందుతుంది. ఇందులో వారు ప్రతి నెలా (టెన్యూర్ పూర్తయ్యే వరకు) తమ జీతం నుంచి పొదుపు చేసిన రూ. 5.02 లక్షలతో పాటు, అంతే మొత్తాన్ని ప్రభుత్వం జోడించి చక్రవడ్డీతో కలిపి అందిస్తుంది.

విశిష్ట నైపుణ్యాలు ఉన్న అగ్నివీరులను మరింత ఎక్కువ సంఖ్యలో దళాల్లో ఉంచుకునేలా భవిష్యత్తులో ఈ పథకంలో కొన్ని సవరణలు చేసే యోచనలో కూడా భారత రక్షణ శాఖ ఉందని తెలుస్తోంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More