Florida jet crash : లైవ్ వీడియో.. రోడ్డు పక్కన జెట్ క్రాష్- తొమ్మిది మంది దుర్మరణం!
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో దారుణ విమాన ప్రమాదం చోటుచేసుకుంది. టెక్సాస్ నుంచి బహామాస్కు ప్రయాణిస్తున్న ఒక ప్రైవేట్ లియర్‌జెట్ విమానం రద్దీగా ఉండే నివాస ప్రాంతంలో కూలిపోవడంతో 9 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ విషాదకర సంఘటన దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి.
అమెరికాలో స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం ఒక దారుణమైన విమాన ప్రమాదం చోటుచేసుకుంది. 9 మంది ప్రయాణికులతో టెక్సాస్‌లోని ఆస్టిన్ నుంచి బయలుదేరిన ఒక ప్రైవేట్ లియర్‌జెట్ విమానం, ఫ్లోరిడాలోని పామ్ బీచ్ కౌంటీ నివాస ప్రాంతంలో ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న తొమ్మిది మందీ అక్కడికక్కడే సజీవదహనమయ్యారు!

ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అవి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. అమెరికా రవాణా శాఖ కార్యదర్శి సీన్ డఫీ ఈ ప్రమాదాన్ని ధృవీకరిస్తూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వివరాలను వెల్లడించారు.
టేకాఫ్ నుంచి ప్రమాదం వరకు ఏం జరిగింది?
ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) నివేదిక ప్రకారం.. 'లియర్‌జెట్ 60' రకానికి చెందిన ఈ ప్రైవేట్ విమానం టెక్సాస్‌లోని ఆస్టిన్-బెర్గ్స్ట్రోమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బహామాస్‌లోని నార్త్ ఎలుథెరా విమానాశ్రయానికి పయనమైంది.
తూర్పు దిశగా 35,000 అడుగుల (సుమారు 11 కిలోమీటర్లు) ఎత్తులో విమానం ప్రయాణిస్తున్న సమయంలో తీవ్రమైన గాలి తుపాను, మంచు గడ్డకట్టడం, వర్షం ఉన్నట్లు పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కి సమాచారం అందించారు. ప్రమాదాన్ని తప్పుకునేందుకు మరో 2,000 అడుగుల పైకి వెళ్లేందుకు అనుమతి కోరారు.
అయితే ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే విమానం నియంత్రణ కోల్పోయి అత్యంత వేగంగా కిందికి దిగడం ప్రారంభించింది. పైలట్ అత్యవసర నిరోధక సంకేతాలను పంపినప్పటికీ, విమానం ఒక్కసారిగా కుడివైపునకు వంగి నిలువుగా నేలకేసి దూసుకొచ్చింది. మధ్యాహ్నం 1:50 గంటల సమయంలో ఫ్లోరిడాలోని క్రెస్ట్హావెన్ ప్రాంతంలో ఉన్న గ్రీన్ ఏకర్స్ సరిహద్దుల్లో ఈ విమానం రోడ్డు పక్కన కూలిపోయింది.
"క్షిపణిలా దూసుకొచ్చి పడింది": ఫ్లోరిడా గవర్నర్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో ఈ విమానం రాకెట్/ మిస్సైల్ మాదిరిగా నిలువుగా రోడ్డు పక్కన పడి భారీ పేలుడు సంభవించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. పడిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగి భారీ గుంత ఏర్పడింది.
"ఇది నిజంగానే ఒక అత్యంత వినాశకరమైన విమాన ప్రమాదం. ఆకాశం నుంచి ఒక క్షిపణి కిందకు దూసుకొచ్చి రోడ్డు పక్కన క్రాష్ అయినట్లు ఉంది. అక్కడ భారీ గుంత ఏర్పడింది," అని ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
జనావాసాలపై పడకుండా రోడ్డు పక్కన కూలిపోయినప్పటికీ, భయాందోళనల కారణంగా చుట్టుపక్కల ఉండే సుమారు 600 మంది స్థానిక నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం కల్పిస్తున్నారు. ఈ ప్రమాదం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన ప్రముఖ 'మార్-ఎ-లాగో' ఎస్టేట్‌కు కేవలం 11 కిలోమీటర్ల దూరంలోనే జరగడం గమనార్హం.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన దృశ్యాలను ఇక్కడ చూడండి :
విచారణ వేగవంతం చేసిన ఎన్టీఎస్బీ..
ప్రమాదానికి గల ఖచ్చితమైన సాంకేతిక కారణాలను వెలికితీసేందుకు నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు (ఎన్టీఎస్బీ) రంగంలోకి దిగింది. ఎఫ్ఏఏ నిపుణుల బృందం కూడా ప్రమాద స్థలానికి చేరుకుని విమాన శకలాలు, బ్లాక్ బాక్స్ డేటాను సేకరించే పనిలో పడింది. ఈ ఘటనపై సోమవారం పూర్తి వివరాలతో కూడిన పత్రికా సమావేశం నిర్వహించనున్నట్లు ఎన్టీఎస్బీ అధికారులు వెల్లడించారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


