...
...
Next Story

స్వదేశంలో విదేశీ వర్సిటీల క్యాంపస్‌లు: డిగ్రీయే కాదు.. విద్యార్థులు ఏం ఆశించాలి?

భారత్‌లో విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్‌లు వేగంగా పెరుగుతున్న వేళ, విద్యార్థులు కేవలం గ్లోబల్ డిగ్రీతో సంతృప్తి చెందకూడదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎన్‌ఈపీ 2020 లక్ష్యాలకు అనుగుణంగా విదేశీ వర్సిటీల నుంచి ఆశించాల్సిన 6 కీలక అంశాలపై ప్రత్యేక కథనం.

Published on: Nov 3, 2026, 14:51:49 IST
Advertisement

భారత ఉన్నత విద్యా రంగంలో విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్‌లు రోజురోజుకూ పెరిగే ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. విదేశాలకు వెళ్లే పని లేకుండా, స్వదేశంలోనే అంతర్జాతీయ స్థాయి డిగ్రీ పొందడం విద్యార్థులకు ఎంతో కలసివచ్చే అంశమే. అయితే, కేవలం విదేశీ బ్రాండ్ పేరు, విదేశీ పాఠ్యాంశాలు లేదా అనుకూలత మాత్రమే సరిపోవు. ఈ క్యాంపస్‌లు విద్యార్థులకు ఎంతవరకు సమగ్రమైన, నాణ్యమైన విద్యను అందిస్తున్నాయనేదే అసలైన పరీక్ష. గ్లోబల్ విద్యా ప్రమాణాలను భారతీయ అవసరాలతో ముడిపెడుతూ, విద్యార్థుల్లో స్వతంత్ర ఆలోచనా శక్తిని, సామాజిక బాధ్యతను పెంపొందించేలా ఈ బోధన ఉందో లేదో చూడాలి.

స్వదేశంలో విదేశీ వర్సిటీల క్యాంపస్‌లు: డిగ్రీయే కాదు.. విద్యార్థులు ఏం ఆశించాలి?
స్వదేశంలో విదేశీ వర్సిటీల క్యాంపస్‌లు: డిగ్రీయే కాదు.. విద్యార్థులు ఏం ఆశించాలి?

జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ 2020) ఉన్నత విద్యలో బహుళ సబ్జెక్టుల అధ్యయనం, పరిశోధన ధోరణి, అంతర్జాతీయ అనుసంధానానికి పెద్దపీట వేసింది. ఈ నేపథ్యంలో, భారత్‌లో అడుగుపెడుతున్న విదేశీ వర్సిటీల నుంచి విద్యార్థులు ప్రధానంగా ఆరు అంశాలను ఆశించాలని క్వీన్స్ యూనివర్సిటీ బెల్ఫాస్ట్-గిఫ్ట్ సిటీ (GIFT City) క్యాంపస్ ఇనాగ్యురల్ డీన్ ప్రొఫెసర్ ఎం. సతీష్ కుమార్ స్పష్టం చేస్తున్నారు.

1. స్థానిక అవసరాలకు తగ్గ అంతర్జాతీయ ప్రమాణాలు

విదేశీ వర్సిటీ పేర్లు చూసి కాకుండా, అక్కడ అందిస్తున్న బోధన, పరిశోధనలు, మూల్యాంకన విధానాలు, స్థానికంగా లభించే అకడమిక్ మద్దతును విద్యార్థులు పరిశీలించాలి. గ్లోబల్ విద్యా ప్రమాణాలను భారతీయ ఆర్థిక ప్రాధాన్యతలు, సామాజిక పరిస్థితులు, సాంకేతిక మార్పులతో అనుసంధానించినప్పుడే ఆ విద్యకు సార్థకత చేకూరుతుంది.

2. స్వతంత్ర ఆలోచనా ధోరణి పెంపొందించడం

కేవలం రాత పరీక్షలు పాస్ అవ్వడం లేదా మొదటి ఉద్యోగం సాధించడమే ధ్యేయం కాకూడదు. క్లిష్టమైన ప్రశ్నలను సంధించే, ఆధారాలను విశ్లేషించే 'స్వతంత్ర ఆలోచనా శక్తి'ని (Intellectual Agency) పెంచేలా బోధన సాగాలి. ఉదాహరణకు, ఫైనాన్స్ చదివే విద్యార్థి లాభనష్టాలతో పాటు నైతిక విలువలను, డేటా అనలిటిక్స్ విద్యార్థి డేటాలోని పక్షపాత ధోరణులను, నిర్మాణ రంగానికి చెందిన విద్యార్థి వాతావరణ మార్పులను అర్థం చేసుకోవడం చాలా అవసరం.

3. ఏఐ యుగానికి తగిన నూతన బోధనా పద్ధతులు

విశ్వవిద్యాలయాలు నెరవేర్చలేని అవాస్తవ ఉద్యోగ హామీలను ఇవ్వకూడదు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు (Skills), కొత్త పరిస్థితుల్లో జ్ఞానాన్ని ఉపయోగించే సామర్థ్యం (Capability), ఆ సామర్థ్యాన్ని ఉత్పాదకత (Productivity)గా మార్చే మెలకువలను నేర్పించాలి. లైవ్ ఇండస్ట్రీ ప్రాజెక్టులు, ఇంటర్న్‌షిప్‌లు, 'వెరిఫైడ్ టాలెంట్ రిపోజిటరీ' వంటి వేదికల ద్వారా విద్యార్థులు తమ నైపుణ్యాలను యజమానులకు నేరుగా చూపించే అవకాశం లభించాలి.

5. భారతీయ మూలాలు దెబ్బతినకుండా అంతర్జాతీయ అనుభవం

అంతర్జాతీయ విద్య అంటే కేవలం విదేశీ పర్యటనలు మాత్రమే కాదు. స్వదేశంలోనే ఉంటూ అంతర్జాతీయ అధ్యాపకుల బోధన, ప్రపంచస్థాయి పరిశోధనల్లో భాగస్వామ్యం, గ్లోబల్ నెట్‌వర్కింగ్ సాధించాలి. భారతీయ విద్యా సంస్థలను కేవలం విద్యార్థులను చేర్చుకునే మార్గాలుగా చూడకుండా, సమాన భాగస్వాములుగా గుర్తించినప్పుడే ద్విపాక్షిక జ్ఞాన మార్పిడి సాధ్యమవుతుంది.

6. పరిశోధన, సామాజిక బాధ్యత

ఉన్నత విద్య కేవలం ఉద్యోగం కోసమే కాకుండా, నిర్ణయాల వల్ల సమాజంపై పడే ప్రభావాన్ని అర్థం చేసుకునేలా చేయాలి. సాంకేతికంగా మెరుగైన ఫైనాన్షియల్ మోడల్ ఎవరినైనా నష్టపరుస్తుందా, లేదా కొత్త నిర్మాణాలు పర్యావరణానికి హాని చేస్తున్నాయా అనే అంశాలను ప్రశ్నించగలగాలి. జాతీయ, అంతర్జాతీయ సవాళ్లకు పరిష్కారాలు చూపే పరిశోధనలకు విదేశీ క్యాంపస్‌లు తోడ్పడాలి.

మార్పు దిశగా ఉన్నత విద్య

"ఏఐ సహాయంతో తెలివిగా పనిచేస్తూనే, అది లేనప్పుడు స్వతంత్రంగా ఆలోచించగల విద్యార్థులను తీర్చిదిద్దినప్పుడే ఎన్‌ఈపీ 2020 లక్ష్యాలు నెరవేరుతాయి. విదేశీ క్యాంపస్‌ల పనితీరును అంచనా వేయడానికి ఇదే అసలైన ప్రమాణం" అని ప్రొఫెసర్ ఎం. సతీష్ కుమార్ అభిప్రాయపడ్డారు. కేవలం విదేశీ డిగ్రీకి పరిమితం కాకుండా, విద్యార్థుల ఆలోచనా పరిధిని, అనుకూలతను, సామాజిక బాధ్యతను విస్తరించే విద్యను అందించడమే ఈ క్యాంపస్‌ల ప్రధాన లక్ష్యంగా ఉండాలి.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks