iPhone 18 : ఐఫోన్ 18 ప్రో నుంచి ఐఫోన్ డ్యుయో వరకు- యాపిల్ లేటెస్ట్ గ్యాడ్జెట్స్ ఫీచర్లు, ధరలు..
Apple iphone 18 pro max : ఐఫోన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాపిల్ వార్షిక ఈవెంట్‌లో భాగంగా కంపెనీ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ 'ఐఫోన్ డ్యూయో'తో పాటు ఐఫోన్ 18 ప్రో సిరీస్, వాచ్ 12, ఎయిర్‌పాడ్స్ 5ను ప్రవేశపెట్టింది. వాటి ఫీచర్లు, ధర వివరాలను ఇక్కడ చూసేయండి..
యాపిల్ లవర్స్ ప్రతి సంవత్సరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఘట్టం ఆవిష్కృతమైంది. కాలిఫోర్నియాలోని కుపెర్టినోలో ఉన్న కంపెనీ ప్రధాన కార్యాలయంలో జరిగిన "రైజ్ అండ్ షైన్" వార్షిక ఈవెంట్‌లో ఈ టెక్ దిగ్గజం సరికొత్త ప్రొడక్ట్స్‌ని లాంచ్ చేసింది. మచ్ అవైటెడ్ ఐఫోన్ 18 ప్రో సిరీస్‌తో పాటు సరికొత్త విప్లవానికి తెరతీస్తూ కంపెనీ తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ‘ఐఫోన్ డ్యూయో’ను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చింది. వీటితో పాటు ఏఐ టెక్నాలజీతో పనిచేసే ఎయిర్‌పాడ్స్ 5, అత్యాధునిక హెల్త్ ఫీచర్లు ఉన్న యాపిల్ వాచ్ సిరీస్ 12, వాచ్ అల్ట్రా 4 మోడళ్లను ఆవిష్కరించింది.

భారత మార్కెట్లో ఈ కొత్త డివైజ్‌ల ధరలు, వాటి ప్రత్యేకతలపై పూర్తి కథనం ఇది.
1. ఫోల్డబుల్ విప్లవం: ఐఫోన్ డ్యూయో..
యాపిల్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ సంస్థ రూపొందించిన మొదటి ఫోల్డబుల్ ఫోన్ పేరు ఐఫోన్ డ్యూయో.
డిస్‌ప్లే అండ్ డిజైన్: మడిచినప్పుడు సాధారణ ఐఫోన్‌లా, విప్పినప్పుడు 7.6 అంగుళాల పెద్ద ఐప్యాడ్ తరహా స్క్రీన్‌తో ఈ ఐఫోన్ డ్యూయో ఆకట్టుకుంటుంది. లోపలి, వెలుపలి స్క్రీన్లలో 12-మెగాపిక్సెల్ కెమెరాలను అమర్చారు.
పెర్ఫార్మెన్స్: సరికొత్త శక్తివంతమైన ఏ20 ప్రో చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇందులో 48-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, పవర్ ఫుల్ డ్యూయల్ బ్యాటరీ వ్యవస్థను అందించారు.
ధర: భారతదేశంలో ఐఫోన్ డ్యూయో ప్రారంభ ధర రూ. 2,99,900గా నిర్ణయించారు. ఇది స్టార్ వైట్, నైట్ స్కై రంగుల్లో లభిస్తుంది. 256జీబీ నుంచి 2టీబీ వరకు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.
2. ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్..
ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ, అత్యుత్తమ ప్రాసెసింగ్‌ను కోరుకునే వినియోగదారుల కోసం ఐఫోన్ 18 ప్రో సిరీస్‌ను రూపొందించారు.
కెమెరా అండ్ ఏఐ ఫీచర్లు: 48-మెగాపిక్సెల్ ఫ్యూజన్ మెయిన్ కెమెరా, మెరుగైన డైనమిక్ ఐలాండ్, లేటెస్ట్ ఐఓఎస్ 27 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. కొత్త యాపిల్ ఇంటెలిజెన్స్, మెరుగైన సిరి ఏఐ సామర్థ్యాలతో పర్సనలైజ్డ్ అనుభూతిని ఇస్తుంది.
ఛార్జింగ్ అండ్ బ్యాటరీ: ఐఫోన్ 18 ప్రో కేవలం 15 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. అలాగే 18 ప్రో మ్యాక్స్ మోడల్ పూర్తి ఛార్జింగ్‌పై ఏకంగా 30 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది.
ధరలు: భారత మార్కెట్లో ఐఫోన్ 18 ప్రో ప్రారంభ ధర రూ. 1,64,900 కాగా, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ప్రారంభ ధర రూ. 1,79,900. ఇవి బ్లాక్, సిల్వర్, గ్లేసియర్, బర్గండీ రంగుల్లో, 256జీబీ నుంచి 2టీబీ స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తాయి.
ఐఫోన్ 18, 18 ప్రో ప్రీ-ఆర్డర్లు ఈ శనివారం మొదలవుతాయని, డెలివరీలు ఈ నెల 18న ప్రారంభమవుతాయని తెలుస్తోంది. ఇక ఫోల్డబుల్ ఐఫోన్ డ్యుయో ప్రీ-ఆర్డర్లు అక్టోబర్ 16, 2026 నుంచి ప్రారంభమై, అక్టోబర్ 23, 2026 నుంచి విక్రయానికి అందుబాటులోకి వస్తాయి.
కాగా రూమర్స్‌ని నిజం చేస్తూ.. యాపిల్ సంస్థ ఈసారి ఐఫోన్ 18 స్టాండర్డ్ మోడల్ని లాంచ్ చేయలేదు. ఇది వచ్చే ఏడాది విడుదలవ్వనుంది.
3. యాపిల్ ఎయిర్‌పాడ్స్ 5..
ఓపెన్-ఇయర్ డిజైన్‌లో అత్యుత్తమ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అందించేలా యాపిల్ ఎయిర్‌పాడ్స్ 5ను ఆవిష్కరించారు.
ప్రత్యేకతలు: మల్టీపోర్ట్ అకౌస్టిక్ ఆర్కిటెక్చర్, నెక్ట్స్ జెన్ అడాప్టివ్ ఈక్వలైజర్‌తో వచ్చిన ఈ బడ్స్, పాత ఎయిర్‌పాడ్స్ 4 కంటే 50 శాతం ఎక్కువ బయటి శబ్దాలను నిరోధిస్తాయి. విదేశీ భాషలను అర్థం చేసుకోవడానికి 'లైవ్ ట్రాన్స్‌లేషన్' ఫీచర్ ఇందులో కీలక ఆకర్షణ. డస్ట్, చెమట, నీటిని తట్టుకునేలా మెరుగైన ఐపీ రేటింగ్‌ను కలిగి ఉన్నాయి.
ధర: ప్రామాణిక వేరియంట్ ధర రూ. 14,900 కాగా, వైర్‌లెస్ ఛార్జింగ్ కేస్ వేరియంట్ రూ. 17,900కు అందుబాటులో ఉంటుంది.
4. యాపిల్ వాచ్ సిరీస్ 12..
ఆరోగ్య సంరక్షణ, గుండె కొట్టుకునే వేగాన్ని అత్యంత కచ్చితత్వంతో కొలిచే హెల్త్ సెన్సింగ్ సిస్టమ్‌తో ఈ స్మార్ట్‌వాచ్ వచ్చింది.
హెల్త్ ఫీచర్లు: అత్యంత వేగవంతమైన ఎస్11 చిప్‌సెట్‌తో పనిచేసే ఈ వాచ్‌లో ఈసీజీ, స్లీప్ ఆప్నియా నోటిఫికేషన్లు, ఫాల్ డిటెక్షన్, ఎమర్జెన్సీ ఎస్‌ఓఎస్, స్లీప్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఆడియో ఇంటెలిజెన్స్ ఫీచర్లను ప్రైవసీకి అత్యధిక ప్రాధాన్యమిస్తూ డిజైన్ చేశారు.
సైజులు, ధర: ఇది 42ఎంఎం, 46ఎంఎం సైజుల్లో అల్యూమినియం, టైటానియం ఫినిషింగ్‌లలో లభిస్తుంది. ఆపిల్ వాచ్ సిరీస్ 12 ప్రారంభ ధర రూ. 56,900.
5. యాపిల్ వాచ్ అల్ట్రా 4..
అడ్వెంచర్లు, క్రీడాకారుల కోసమే ప్రత్యేకంగా రూపొందించిన అత్యుత్తమ స్మార్ట్‌వాచ్ ఇది.
ఫీచర్లు: ఎస్11 చిప్‌సెట్, దీర్ఘకాలం మన్నిక నిచ్చే బ్యాటరీ, ఆల్టిమీటర్, అత్యాధునిక ట్రాకింగ్ ఫీచర్లు దీని సొంతం. ఇది నాచురల్, బ్లాక్ టైటానియం రంగులతో పాటు ప్రత్యేకమైన సిల్వర్ హెర్మేస్ ఎడిషన్‌లో దొరుకుతుంది.
ధర: భారత మార్కెట్లో యాపిల్ వాచ్ అల్ట్రా 4 ప్రారంభ ధర రూ. 1,09,900.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


