పాలే లేకుండా పనీర్ తయారీ.. అనలాగ్ అమ్మకాలపై నిషేధం.. ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక ప్రతిపాదనలు

పాల పదార్థాలు లేకుండా తయారుచేసే అనలాగ్ ఉత్పత్తులను 'పనీర్' పేరిట విక్రయించడంపై భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నిషేధం విధించేందుకు సిద్ధమైంది. నకిలీ పనీర్ ఉత్పత్తులతో వినియోగదారులు మోసపోకుండా నిరోధించేందుకు ఈ నూతన మార్గదర్శకాలను ప్రతిపాదించింది.

Published on: Sep 25, 2026, 11:06:09 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

మార్కెట్లో లభించే కృత్రిమ లేదా ప్రత్యామ్నాయ పనీర్ ఉత్పత్తులకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. పాలు, పాల ఉత్పత్తులు కాకుండా వంట నూనెలు, పిండి పదార్థాలతో తయారుచేసే 'అనలాగ్ పనీర్'ను ఇకపై 'పనీర్' అనే పేరుతో విక్రయించకూడదని ప్రతిపాదించింది. ఈ మేరకు ఆహార భద్రత, ప్రమాణాల (అమ్మకాల నిషేధం, నియంత్రణ) నిబంధనలు - 2011కు సవరణలు చేస్తూ ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

పాలే లేకుండా పనీర్ తయారీ.. అనలాగ్ పనీర్ అమ్మకాలపై నిషేధం.. ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక ప్రతిపాదనలు
పాలే లేకుండా పనీర్ తయారీ.. అనలాగ్ పనీర్ అమ్మకాలపై నిషేధం.. ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక ప్రతిపాదనలు

అనలాగ్ పనీర్ అంటే ఏమిటి?

పనీర్ అనగానే స్వచ్ఛమైన పాలు, వాటిలోని వెన్న, ప్రొటీన్లతో తయారు చేసే ఆహార పదార్థం గుర్తుకొస్తుంది. అయితే, అనలాగ్ పనీర్‌లో ఎలాంటి పాల ఉత్పత్తులను వాడరు. పాల కొవ్వులు, ప్రొటీన్ల స్థానంలో కూరగాయల నూనెలు (వెజిటబుల్ ఆయిల్స్), పిండి (స్టార్చ్), ప్లాంట్ ప్రొటీన్లు, ఎమల్సిఫైయర్లు, ఇతర రసాయనాలను ఉపయోగిస్తారు. చూడటానికి, తాకడానికి, రుచికి ఇది అచ్చం అసలైన పనీర్‌లాగే ఉంటుంది. దీంతో సాధారణ వినియోగదారులు అసలైన పనీర్‌కు, అనలాగ్ పనీర్‌కు మధ్య తేడాను గుర్తించలేక మోసపోతున్నారు.

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రతిపాదించిన నియమాలు

ఇప్పటికే 'అనలోగ్ ఇన్ డైరీ కాంటెక్స్ట్' కేటగిరీ కింద లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ పొందిన ఉత్పత్తులు తమ పేరులో, లేబులింగ్‌లో లేదా మార్కెటింగ్‌లో 'పనీర్' అనే పదాన్ని వాడటాన్ని తక్షణమే నిలిపివేయాలని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ స్పష్టం చేసింది. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం 2006లోని సెక్షన్ 92(2) ప్రకారం ఈ ప్రతిపాదనను సిద్ధం చేశారు.

ఈ ప్రతిపాదనపై ప్రజలు, పారిశ్రామికవేత్తలు తమ అభ్యంతరాలు, సూచనలను 60 రోజుల్లోగా పంపవచ్చని పేర్కొంది. న్యూఢిల్లీలోని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కార్యాలయానికి రాతపూర్వకంగా గానీ, regulation@fssai.gov.in ఈమెయిల్ ద్వారా గానీ తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చని సూచించింది.

రాష్ట్రాల ఆంక్షలు.. జొమాటో నిర్ణయం

వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి పలు రాష్ట్రాలు అనలాగ్ పనీర్ తయారీ, విక్రయాలపై ఆంక్షలు విధించాయి. హోటళ్లు, రెస్టారెంట్లు తాము అందించే వంటకాల తయారీలో అనలాగ్ పనీర్ ఉపయోగిస్తే ఆ విషయాన్ని కస్టమర్లకు స్పష్టంగా తెలియజేయాలని అధికారులు హెచ్చరించారు.

మరోవైపు ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో కూడా దీనిపై కఠిన వైఖరి అవలంబించింది. తమ ప్లాట్‌ఫామ్‌లోని రెస్టారెంట్లు అనలాగ్ పనీర్ వంటకాలను 'పనీర్' పేరుతో విక్రయిస్తే జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తామని, అటువంటి రెస్టారెంట్లను యాప్ నుంచి తొలగిస్తామని స్పష్టం చేసింది. ఇప్పటికే అలాంటి ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు ప్రకటించిన రెస్టారెంట్ల వంటకాలను తమ మెనూల నుంచి తొలగించింది.

కస్టమర్లు తాము ఏం తింటున్నారో స్పష్టంగా తెలుసుకునే హక్కు వారికి ఉందని, ఆహార రంగంలో పారదర్శకత పెంచడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధికారులు వెల్లడించారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More