GAIL Recruitment 2027 : గేట్ స్కోర్‌తో గెయిల్‌లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు- వివరాలివే..
మహారత్న ప్రభుత్వ రంగ సంస్థ ‘గెయిల్ ఇండియా లిమిటెడ్’లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ప్రారంభమవుతున్నాయి. గేట్ 2027 స్కోర్ ఆధారంగా ఎంపిక చేసే ఈ కేంద్ర ప్రభుత్వ కొలువులకు సంబంధించిన అర్హతలు, వయోపరిమితి, దరఖాస్తు విధానం ఇక్కడ చూడండి..
ప్రభుత్వ రంగ సంస్థల్లో స్థిరపడాలని భావించే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు దిగ్గజ సంస్థ ‘గెయిల్ ఇండియా లిమిటెడ్’ మంచి అవకాశం తెచ్చింది. 2027 సంవత్సరానికి గాను ‘ఎగ్జిక్యూటివ్ ట్రైనీ’ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్ 2027) లో సాధించే ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఏటా వేలాది మంది బీటెక్ అభ్యర్థులు గేట్ పరీక్షకు సిద్ధమవుతుంటారు. నాణ్యమైన జీవన శైలి, అత్యధిక వేతనం, ఉద్యోగ భద్రత కల్పించే పబ్లిక్ సెక్టార్ ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి గెయిల్ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ అద్భుతమైన అవకాశం.
గెయిల్ రిక్రూట్మెంట్ 2027- విభాగాలు, విద్యార్హతలు..
ఈ ప్రకటన ద్వారా కెమికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (కెమికల్): కెమికల్, పెట్రోకెమికల్, కెమికల్ టెక్నాలజీ తదితర సంబంధిత ఇంజనీరింగ్ కోర్సులు పూర్తి చేసిన వారు అర్హులు.
ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఇన్‌స్ట్రుమెంటేషన్): ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ కోర్సులు చదివిన వారు దరఖాస్తు చేయవచ్చు.
ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఎలక్ట్రికల్): ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ పవర్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (మెకానికల్): మెకానికల్, ప్రొడక్షన్, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్, మ్యానుఫాక్చరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అభ్యర్థులు అర్హులు.
అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 65 శాతం మార్కులతో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ వర్గాల అభ్యర్థులకు 60 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
గెయిల్ రిక్రూట్మెంట్ 2027- వయోపరిమితి
గెయిల్ రిక్రూట్మెంట్ 2027 కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయస్సు 18 మార్చి 2027 నాటికి 26 సంవత్సరాలు మించకూడదు. రిజర్వేషన్ వర్గాలైన ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో మినహాయింపులు అందుతాయి.
గెయిల్ రిక్రూట్మెంట్ 2027- ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు విధానం..
ఈ పోస్టుల భర్తీకి గేట్ 2027 మార్కులను మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటారు. పాత గేట్ స్కోర్లు (2026 లేదా అంతకంటే ముందువి) పరిగణనలోకి తీసుకోరు. గేట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి, తదుపరి రౌండ్లయిన గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 17, 2027న ప్రారంభమై మార్చి 18, 2027తో ముగుస్తుంది. అర్హులైన అభ్యర్థులు గేల్ అధికారిక వెబ్‌సైట్ gailonline.com సందర్శించి ఆన్‌లైన్ ఫారమ్‌ను సమర్పించాల్సి ఉంటుంది.
గెయిల్ రిక్రూట్మెంట్ 2027- ఇలా అప్లై చేసుకోండి..
- గెయిల్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లండి
- ఎగ్జిక్యూటివ్ ట్రైనీ రిక్రూట్మెంట్ లింక్‌ని క్లిక్ చేయండి.
- రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.
- లాగిన అయ్యి, అప్లికేషన్ ఫామ్‌ని ఫిల్ చేయండి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించండి.
- ఫామ్ సబ్మిట్ చేసి, కన్ఫర్మేషన్ పేజీని డౌన్లోడ్ చేసుకోండి
- ప్రింటౌట్ తీసుకోండి.
గెయిల్ రిక్రూట్మెంట్ 2027 నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాల్సి ఉంటుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


