GATE 2026 : రేపటి నుంచి గేట్ పరీక్ష- అభ్యర్థులు ఇవి కచ్చితంగా ఫాలో అవ్వాలి..
ఐఐటీ గువాహటీ రేపటి నుంచి గేట్ 2026 పరీక్షలను నిర్వహించనుంది. ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీల్లో జరిగే ఈ పరీక్షల కోసం హాజరయ్యే అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలు, పరీక్షా విధానం, నెగిటివ్ మార్కింగ్ వివరాలను కమిషన్ వెల్లడించింది.
ఫిబ్రవరి 7, 2026 శనివారం నుంచి గేట్ 2026 పరీక్షలను ప్రారంభించనుంది ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) గువాహటీ. ఈ పరీక్షలు 8, 14, 15 తేదీల్లో కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎగ్జామ్ సెంటర్లకు వెళ్లే అభ్యర్థులు కచ్చితంగా కొన్ని విషయాలను పాటించాలి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

గేట్ 2026- పరీక్షా సమయాలు, విధానం..
ఐఐటీ గేట్ 2026 పరీక్షలు రెండు షిఫ్టుల్లో జరుగుతాయి. మొదటి షిఫ్ట్ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, రెండొవ షిఫ్ట్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉంటుంది. ఈ పరీక్షలో మొత్తం 30 టెస్ట్ పేపర్లు ఉంటాయి. ఒక అభ్యర్థి ఈ 30 టెస్ట్ పేపర్లలో ఒకటి లేదా రెండు పేపర్లకు హాజరు కావాల్సి ఉంటుంది. అన్ని టెస్ట్ పేపర్ల పరీక్షలు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) మోడ్‌లో జరుగుతాయి. ఇక్కడ అభ్యర్థులు కంప్యూటర్ స్క్రీన్‌పై ప్రశ్నలను చూస్తారు.
గేట్ 2026- పరీక్షా మార్గదర్శకాలు ఇవే..
గేట్ 2026 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు కింద పేర్కొన్న నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది:
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టిక్కెట్లను పరీక్షా కేంద్రానికి వెంట తీసుకువెళ్లాలి. అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యే ముందు తమ హాల్ టిక్కెట్లను పూర్తిగా తనిఖీ చేసుకోవాలి.
UPSC CSE 2026 : యూపీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్! సివిల్ సర్వీసెస్ రూల్స్‌లో భారీ సంస్కరణలు..
పరీక్షా షెడ్యూల్ ప్రారంభానికి 40 నిమిషాల ముందే అభ్యర్థులు తమకు కేటాయించిన సీట్లలో కూర్చోవడానికి అనుమతిస్తారు. పరీక్ష ప్రారంభానికి 20 నిమిషాల ముందు అభ్యర్థులు లాగిన్ అయి ఇన్స్ట్రక్షన్లను చదవడం ప్రారంభించవచ్చు.
క్యాలిక్యులేటర్లు, మొబైల్ ఫోన్లు, బ్లూటూత్ పరికరాలు, ఎలక్ట్రానిక్/కమ్యూనికేషన్ పరికరాలు, వాలెట్లు, పుస్తకాలు, పేపర్లు, లూజ్ షీట్లు, డేటా లేదా హ్యాండ్‌బుక్‌లు, టేబుల్‌లు, పెన్/పెన్సిల్ బాక్స్/పౌచ్, అనలాగ్/డిజిటల్/స్మార్ట్ వాచీలు పరీక్షా హాల్లోకి ఖచ్చితంగా నిషేధిస్తారు. అభ్యర్థులు అటువంటి పరికరాలను కలిగి ఉన్నట్లు తేలితే, వారు వాటిని ఉపయోగించినా, లేకపోయినా అనర్హులుగా ప్రకటిస్తారు.
గేట్ 2026 రఫ్ వర్క్ కోసం అభ్యర్థులకు స్క్రిబుల్ ప్యాడ్ ఇస్తారు. అభ్యర్థులు దానిని ఉపయోగించే ముందు స్క్రిబుల్ ప్యాడ్‌పై తమ పేరు, రిజిస్ట్రేషన్ నంబర్‌ను తప్పనిసరిగా రాయాలి.
గేట్ 2026- ప్రశ్నల సరళి, మార్కులు..
గేట్ 2026 టెస్ట్ పేపర్లలో మూడు రకాల ప్రశ్నలు ఉంటాయి: మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ (ఎంసీక్యూలు); మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్ (ఎంఎస్‌క్యూలు); న్యూమరికల్ ఆన్సర్ టైప్ (ఎన్ఏటీ) ప్రశ్నలు.
ఎంసీక్యూలలో తప్పు సమాధానాన్ని ఎంచుకుంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
1 మార్కు ఎంసీక్యూలో తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కు కోత విధిస్తారు.
అదేవిధంగా, 2 మార్కుల ఎంసీక్యూలో తప్పు సమాధానానికి 2/3 వంతు మార్కు కోత విధించడం జరుగుతుంది.
మరిన్ని సంబంధిత వివరాల కోసం అభ్యర్థులు ఐఐటీ గేట్ అధికారిక వెబ్‌సైట్‌ను చూడవచ్చు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


