UPSC CSE 2026 : యూపీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్! సివిల్ సర్వీసెస్ రూల్స్‌లో భారీ సంస్కరణలు..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ 2026లో భారీ సంస్కరణలే తీసుకొచ్చింది. పరీక్షా కేంద్రాల్లో ఫేస్ అథెంటికేషన్‌ను తప్పనిసరి చేయడంతో పాటు ఇప్పటికే సర్వీసులో ఉన్న అభ్యర్థులపై కఠినమైన అర్హత పరిమితులను విధించింది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్! పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులందరికీ ఫేస్ అథెంటికేషన్‌ను తప్పనిసరి చేసింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇప్పటికే కొన్ని సర్వీసుల్లో నియమితులైన అభ్యర్థులకు సంబంధించి కఠినమైన అర్హత పరిమితులను సైతం ప్రవేశపెట్టింది. ఈ మార్పులను గురువారం విడుదల చేసిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్‌ఈ) 2026 అధికారిక నోటిఫికేషన్‌లో వెల్లడించింది.

యూపీఎస్సీ సీఎస్‌ఈ 2026- ఖాళీలు, పరీక్ష తేదీలు..
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) వంటి ప్రతిష్ఠాత్మక పోస్టుల కోసం అధికారులను ఎంపిక చేసేందుకు యూపీఎస్సీ ఏటా ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూ అనే మూడు దశల్లో ఈ ప్రతిష్టాత్మక పరీక్షను నిర్వహిస్తుంది. ఇక ఈ ఏడాది రిక్రూట్‌మెంట్ సైకిల్ కోసం కమిషన్ మొత్తం 933 ఖాళీలను ప్రకటించింది. ఇందులో 33 పోస్టులను దివ్యాంగుల కోసం రిజర్వ్ చేశారు. ఈ పోటీ పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష మే 24న నిర్వహించనున్నట్లు కమిషన్ తెలిపింది.
యూపీఎస్సీ సీఎస్‌ఈ 2026- ఫేస్ అథెంటికేషన్, ఐడీ వెరిఫికేషన్..
"పరీక్షా ప్రక్రియ సురక్షితంగా, సజావుగా సాగేలా చూడటం కోసం, అభ్యర్థులందరూ పరీక్షా వేదిక వద్ద తప్పనిసరిగా ఫేస్ అథెంటికేషన్‌కు సహకరించాల్సి ఉంటుంది. ఫేస్ అథెంటికేషన్, ఐడెంటిటీ వెరిఫికేషన్, ఫ్రిస్కింగ్ కోసం అభ్యర్థులు నిర్ణీత సమయం కంటే ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి," అని యూపీఎస్సీ నోటిఫికేషన్ పేర్కొంది. గుర్తింపు, ఇతర వివరాల వెరిఫికేషన్ సులభంగా, వేగంగా జరగడం కోసం అభ్యర్థులు తమ ఆధార్ కార్డును ఐడీ డాక్యుమెంట్‌గా ఉపయోగించాలని కమిషన్ బలంగా సూచించింది.
సర్వీసులో ఉన్న అభ్యర్థులపై కొత్త నిబంధనలు..
మునుపటి పరీక్షల ద్వారా ఇప్పటికే కొన్ని సర్వీసుల్లో ఉన్న అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ కొత్త "పరిమితులను" స్పష్టం చేసింది. నోటిఫికేషన్ ప్రకారం, ప్రస్తుతం ఐఏఎస్ లేదా ఐఎఫ్ఎస్లో పనిచేస్తున్న ఏ అభ్యర్థి అయినా 2026 పరీక్షకు హాజరు కావడానికి "అర్హులు కారు". ఒకవేళ అభ్యర్థి ప్రిలిమ్స్ తర్వాత ఐఏఎస్ లేదా ఐఎఫ్ఎస్ సర్వీసుకు ఎంపికైతే, వారు ప్రిలిమ్స్‌లో అర్హత సాధించినప్పటికీ మెయిన్స్ పరీక్షకు హాజరు కావడానికి వీలు లేదు.
మెయిన్ పరీక్ష ప్రారంభమైన తర్వాత కానీ, ఫలితాలు వెల్లడించడానికి ముందు కానీ వారు నియమితులైతే, వారిని సీఎస్‌ఈ 2026 ఫలితాల కింద ఎటువంటి సర్వీసు/పోస్టుకు పరిగణనలోకి తీసుకోరు. అలాగే, ఇప్పటికే ఐపీఎస్కి ఎంపికైన లేదా నియమితులైన అభ్యర్థులు.. సీఎస్‌ఈ-2026 ద్వారా మళ్లీ అదే సర్వీసును ఎంచుకోవడానికి లేదా కేటాయించడానికి అర్హులు కారు. అయితే, ఐపీఎస్ లేదా సెంట్రల్ సర్వీస్ గ్రూప్ 'ఏ' కి కేటాయించిన అభ్యర్థులు, సంబంధిత అథారిటీ నుంచి ట్రైనింగ్‌లో చేరడంపై ఒకసారి మినహాయింపు పొందితే, వారు వెంటనే తదుపరి సీఎస్‌ఈ-2027 పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంటుంది.
ప్రశ్నాపత్రంపై అభ్యంతరాల గడువు తగ్గింపు..
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ప్రశ్నాపత్రంపై అభ్యంతరాలు తెలియజేసే గడువును ప్రస్తుతం ఉన్న ఏడు రోజుల నుంచి ఐదు రోజులకు తగ్గించారు. ప్రిలిమినరీ పరీక్షలోని ప్రశ్నలు, ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలియజేయడానికి హాజరైన అభ్యర్థులకు 5 రోజుల సమయం మాత్రమే ఇచ్చారు.
ఓబీసీ సర్టిఫికేట్, ఇతర నిబంధనలు..
సీఎస్‌ఈ 2026కి దరఖాస్తు చేసుకునే ఓబీసీ అభ్యర్థులు 2022-2023, 2023-2024స 2024-2025 ఆర్థిక సంవత్సరాల ఆదాయం ఆధారంగా రూపొందించిన ఓబీసీ (నాన్-క్రీమీ లేయర్) సర్టిఫికేట్‌ను సమర్పించాలి. ఇది ఏప్రిల్ 1, 2025 న లేదా ఆ తర్వాత జారీ చేసి ఉండాలి. కానీ ప్రిలిమ్స్ దరఖాస్తుకు చివరి తేదీ అయిన ఫిబ్రవరి 24 కంటే ముందే ఉండాలి.
అభ్యర్థులు కామన్ అప్లికేషన్ ఫారమ్ (సీఏఎఫ్) నింపేటప్పుడు తమ ఫోటోను అప్‌లోడ్ చేయడంతో పాటు "లైవ్ ఫోటోగ్రాఫ్"ను కూడా క్యాప్చర్ చేయాలి. తెల్లటి కాగితంపై బ్లాక్ ఇంక్‌తో ఒకదాని కింద ఒకటి మూడుసార్లు సంతకం చేసి, దానిని కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు సమర్పించిన తర్వాత దానిని వెనక్కి తీసుకోవడానికి వీలుండదు. అలాగే సబ్మిట్ చేసిన తర్వాత దరఖాస్తులోని ఏ ఫీల్డ్‌లోనూ సవరణలు/మార్పులకు అవకాశం లేదు.
దరఖాస్తులను https://upsconline.nic.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే సమర్పించాలి.

E-Paper












