...
...
Next Story

ఐపీవోకి 'ఫ్రీడమ్' ఆయిల్స్ మాతృసంస్థ జెమిని ఎడిబుల్స్.. సెబీకి పత్రాలు దాఖలు

ప్రసిద్ధ 'ఫ్రీడమ్' వంటనూనెల బ్రాండ్ మాతృ సంస్థ జెమిని ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా (GEFL) పబ్లిక్ ఆఫరింగ్‌ (IPO)కు సిద్ధమైంది. ఇందులో భాగంగా 4.11 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించేందుకు వీలుగా మూలధన మార్కెట్ల నియంత్రణ సంస్థ 'సెబీ'కి ముసాయిదా పత్రాలను (DRHP) సమర్పించింది.

Published on: Aug 24, 2026, 20:09:55 IST
Advertisement

హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ వంటనూనెల తయారీ సంస్థ 'జెమిని ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్' (GEFL) స్టాక్ మార్కెట్లలోకి అడుగుపెట్టేందుకు సన్నాహాలు ముమ్మరం చేసింది. పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధుల సేకరణకు అనుమతి కోరుతూ భారత మూలధన మార్కెట్ల నియంత్రణ సంస్థ 'సెబీ'కి (SEBI) ముసాయిదా ప్రాస్పెక్టస్ (DRHP) దాఖలు చేసింది.

ఆఫర్ ఫర్ సేల్ రూపంలో ఐపీవో

ఐపీవోకి 'ఫ్రీడమ్' ఆయిల్స్ మాతృసంస్థ జెమిని ఎడిబుల్స్.. సెబీకి పత్రాలు దాఖలు
ఐపీవోకి 'ఫ్రీడమ్' ఆయిల్స్ మాతృసంస్థ జెమిని ఎడిబుల్స్.. సెబీకి పత్రాలు దాఖలు

ఈ పబ్లిక్ ఆఫర్ పూర్తిగా 'ఆఫర్ ఫర్ సేల్' (OFS) రూపంలో సాగనుంది. కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు కలిపి గరిష్టంగా 4.11 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. ప్రమోటర్లు అల్కా చౌదరి, గోల్డెన్ అగ్రి ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రైజెస్ (GAIE) సుమారు 20.6 లక్షల షేర్లను విక్రయిస్తుండగా.. ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ అయిన బ్లాక్ రివర్ ఫుడ్ 2 పీటీఈ లిమిటెడ్ 3.086 కోట్లు, ఇన్వెస్ట్‌మెంట్ అండ్ కమర్షియల్ ఎంటర్‌ప్రైజ్ (ICE) 61.7 లక్షల షేర్లను ఆఫర్ చేస్తున్నాయి.

ఈ ఇష్యూలో కొత్త షేర్ల జారీ (Fresh Issue) ఏమీ లేదు. ఫలితంగా షేర్ల విక్రయం ద్వారా వచ్చే నిధులన్నీ అమ్మకం జరుపుతున్న వాటాదారులకే చేరుతాయి. కంపెనీకి ఎలాంటి సొమ్ము దక్కదు. ఈ షేర్లను బీఎస్‌ఈ (BSE), ఎన్‌ఎస్‌ఈ (NSE) వేదికలపై లిస్ట్ చేయనున్నారు. మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్, ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సర్వీసెస్ సంస్థలు ఈ ఇష్యూకి బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.

'ఫ్రీడమ్' బ్రాండ్‌తో దక్షిణాదిలో అగ్రస్థానం

పరిశ్రమ దిగ్గజం ప్రదీప్ కుమార్ చౌదరి నేతృత్వంలో నడుస్తున్న జీఈఎఫ్‌ఎల్.. ప్రధానంగా వంటనూనెలు, స్పెషాలిటీ ఫ్యాట్స్ తయారీ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ రంగాల్లో కొనసాగుతోంది. ఫ్రీడమ్ (Freedom), బి-రైట్ (Be-Rite), ఫస్ట్ క్లాస్ (First Klass) బ్రాండ్ల ద్వారా వినియోగదారులకు సేవలందిస్తోంది. కన్జ్యూమర్ గుడ్స్ ప్లాట్‌ఫామ్‌గా ఎదిగే క్రమంలో మసాలా దినుసులు, కన్వీనియెన్స్ ఫుడ్స్ విభాగానికి కూడా వ్యాపారాన్ని విస్తరించింది.

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో రెండు, కృష్ణపట్నంలో ఒక ప్లాంట్ చొప్పున జీఈఎఫ్‌ఎల్‌కు మొత్తం మూడు రిఫైనరీ ప్లాంట్లు ఉన్నాయి. వీటి వార్షిక రిఫైనింగ్ సామర్థ్యం 12,22,500 మెట్రిక్ టన్నులు కాగా, 2026 ఆర్థిక సంవత్సరంలో 6,66,174 మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని సాధించింది.

కంపెనీ ఆర్థిక పనితీరును పరిశీలిస్తే, 2020-2025 మధ్య కాలంలో బ్రాండెడ్ ఆదాయంలో 20.5 శాతం కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటు (CAGR) నమోదు చేసింది. సాధారణ మార్కెట్ వృద్ధి (10.1 శాతం)తో పోలిస్తే ఇది రెట్టింపు కావడం విశేషం. కంపెనీ ఆదాయం 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 9,053.84 కోట్లు ఉండగా, 2025 నాటికి రూ. 10,755.95 కోట్లకు, 2026 ఆర్థిక సంవత్సరంలో 16.83 శాతం వృద్ధితో రూ. 12,650 కోట్లకు చేరుకుంది. రాబోయే రోజుల్లో కేరళ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌ సహా తూర్పు భారతదేశ మార్కెట్లలో తమ నెట్‌వర్క్‌ను మరింత పెంచుకోవాలని కంపెనీ ప్రణాళికలు రచిస్తోంది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks