Cooking oil : వంటకు ఏ ఆయిల్ వాడాలి? ఏ నూనె హానికరం? అసలు నిజాలు ఇవి..
Best cooking oil : వంట నూనెల గురించి సోషల్ మీడియాలో వచ్చే కథనాలు విని చాలా మంది గందరగోళానికి గురవుతున్నారు. ఏ నూనె ఆరోగ్యానికి మంచిది? ఏ నూనెను ఎలా వాడాలి? అనే విషయాలపై నిపుణులు చెబుతున్న ముఖ్యమైన విషయాలను ఇక్కడ తెలుసుకోండి..
ఆయుర్వేదంలో ఆహారాన్ని కేవలం శరీరానికి ఇంధనం ఇచ్చే ఒక వస్తువుగా ఎప్పుడూ చూడలేదు. మన ప్రాచీన భారతీయ గ్రంథాలలో ‘స్నేహ’ అనే పదాన్ని ప్రస్తావించారు. ఇది నూనెలు, ఆరోగ్యకరమైన కొవ్వులకు సంబంధించినది! ఇవి శరీరానికి అవసరమైన పోషణను, వెచ్చదనాన్ని, జీవశక్తిని అందిస్తాయి. సాంప్రదాయ భారతీయ జీవనశైలిలో వంట నూనెలకు చాలా ప్రాధాన్యత ఉంది. మన దేశంలో వాతావరణం, వంట పద్ధతులు, జీవనశైలిని బట్టి వేర్వేరు ప్రాంతాలలో వేర్వేరు నూనెలను ఉపయోగించేవారు. ఉత్తర, తూర్పు భారతదేశంలో ఆవనూనె, దక్షిణాదిలో కొబ్బరినూనె, దేశంలోని ఇతర ప్రాంతాల్లో నువ్వుల నూనె, వేరుశనగ నూనెలను ఎక్కువగా వాడే సంస్కృతి శతాబ్దాలుగా వస్తోంది.

అయితే, ప్రస్తుత రోజుల్లో వంట నూనెల గురించి ప్రజల్లో ఎన్నో అపోహలు, గందరగోళాలు ఉన్నాయి. సోషల్ మీడియా ట్రెండ్స్, ఇన్‌ఫ్లుయెన్సర్ల సలహాలు, భయాందోళనలను సృష్టించే మార్కెటింగ్ వ్యూహాల వల్ల ఒక నూనె ‘ఆరోగ్యకరమైనది’ అని, మరొకటి ‘హానికరం’ అని ప్రజలు ముద్ర వేస్తున్నారు. దీనివల్ల వంటగదిలో ఏ నూనె వాడాలో తెలియక సామాన్యులు తలలు పట్టుకుంటున్నారు. అయితే, కేవలం ఒకే ఒక్క నూనె మన ఆరోగ్యాన్ని శాసించదని పోషకాహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మితిమీరి తినడం, శారీరక శ్రమ లేకపోవడం, ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్స్‌పై ఎక్కువగా ఆధారపడటమే అసలైన ఆరోగ్య సమస్యలకు కారణం అని అంటున్నారు.
అసలు.. ఏ నూనెలో ఏముంది?
అన్ని వంట నూనెలు ఒకేలా ఉంటాయనుకోవడం ఒక పెద్ద పొరపాటు. వాస్తవానికి, ప్రతి నూనెకు ఒక ప్రత్యేకమైన ఫ్యాటీ యాసిడ్ల నిర్మాణం, పోషకాలు, రుచి, స్మోక్ పాయింట్ (నూనె మరిగే ఉష్ణోగ్రత) ఉంటాయి. ఉదాహరణకు ఆవనూనెలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. సన్‌ఫ్లవర్ ఆయిల్ చాలా తేలికగా ఉండి అన్ని రకాల వంటకాలకు సరిపోతుంది. పామాయిల్, రైస్ బ్రాన్ ఆయిల్‌లలో ‘టోకోట్రినోల్స్’ ఉంటాయి, ఇవి కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి.
"పామాయిల్ ఎక్కువ వేడిని తట్టుకోగలదు. ఇందులో సాచురేటెడ్, అన్‌సాచురేటెడ్ కొవ్వుల సమతుల్యత ఉంటుంది. ఆలివ్ ఆయిల్‌లో ఉండే మోనో అన్‌సాచురేటెడ్ ఫ్యాట్ అయిన ‘ఒలీక్ యాసిడ్’ ఇందులోనూ ఉంటుంది. ప్రతి నూనెకు ఒక ప్రత్యేక పోషక విలువ ఉంటుంది కాబట్టి, కేవలం ఒకే రకమైన నూనెకు పరిమితం కాకుండా రకరకాల నూనెలను మార్చి మార్చి వాడటం మంచిది," అని భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఏఐఐఏ) చీఫ్ డైటెషియన్ అండ్ ఇంటిగ్రేటివ్ న్యూట్రిషన్ హెడ్ డాక్టర్ జ్యోతి అరోరా వివరించారు.
కొవ్వులు శరీరానికి విరోధులు కావు!
నూనెతో వండిన ఆహారం ఆరోగ్యానికి చెడు చేస్తుందనేది మరో మైండ్ గేమ్. నూనెలలో కొవ్వులు ఉంటాయి కాబట్టి, ఊబకాయం, గుండె జబ్బులకు నూనెలే కారణమని అందరూ నిందిస్తుంటారు. కానీ, శరీర సక్రమ పనితీరుకు కొవ్వులు చాలా అవసరం. ఉదాహరణకు పామాయిల్‌లో విటమిన్ ఈ, ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్ గుణాలున్న టోకోట్రినోల్స్ పుష్కలంగా ఉంటాయి.
ఐసీఎంఆర్–నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ జారీ చేసిన 'డైటరీ గైడ్‌లైన్స్ ఫర్ ఇండియన్స్ 2024' ప్రకారం.. సమతుల్య ఆహారంలో భాగంగా పామాయిల్‌ను కూడా నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. ఈ నూనెలు శరీరంలో విటమిన్లు అబ్జార్బ్ అవ్వడానికి, హార్మోన్ల నియంత్రణకు, కణాల పనితీరుకు, శరీరానికి శక్తిని ఇవ్వడానికి తోడ్పడతాయి. సమస్య నూనెల్లో లేదు, మనం వాడే మోతాదులో, మన జీవనశైలిలోనే ఉంది.
ఇంటి వంట వర్సెస్ బయటి ఫుడ్..
నూనె, చక్కెర, ఉప్పు ఎక్కువగా ఉండే ప్యాక్ చేసిన ప్రాసెస్డ్ ఫుడ్స్ కంటే ఇంట్లో తక్కువ నూనెతో వండుకునే ఆహారం ఎంతో ఆరోగ్యకరం. మనం వండే పద్ధతి కూడా ఇక్కడ చాలా ముఖ్యం. ఆవిరిపై ఉడికించడం, బాయిలింగ్, తక్కువ నూనెతో ఫ్రై చేయడం, ఎయిర్ ఫ్రైయింగ్ వంటి పద్ధతుల ద్వారా అనవసరమైన కొవ్వులు శరీరంలో చేరకుండా చూసుకోవచ్చు.
ఆలివ్ ఆయిల్ ఒక్కటే బెస్ట్ ఆ?
మెడిటరేనియన్ డైట్ ప్రాచుర్యం పొందాక, కేవలం ఆలివ్ ఆయిల్ మాత్రమే ఆరోగ్యకరమైన నూనె అనే భ్రమ అందరిలోనూ ఏర్పడింది. ఆలివ్ ఆయిల్‌లో మంచి గుణాలు ఉన్నప్పటికీ, అదే ఏకైక ఆప్షన్ కాదు! మన దేశీయ నూనెలైన ఆవనూనె, నువ్వుల నూనె, సన్‌ఫ్లవర్ ఆయిల్, వేరుశనగ నూనె, పామాయిల్ వంటివన్నీ సమతుల్య ఆహారంలో భాగమే. విదేశీ ట్రెండ్స్‌ను గుడ్డిగా ఫాలో అయ్యే ముందు భారతీయ వంట పద్ధతులను గమనించాలి. మన వంటల్లో డీప్ ఫ్రైలు, పోపులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ఇక్కడ ఎక్కువ ఉష్ణోగ్రతను తట్టుకునే నూనెలే అవసరమవుతాయి.
వాడిన నూనెనే మళ్లీ మరిగిస్తున్నారా? జాగ్రత్త!
వంటల్లో మనం చేసే అతి పెద్ద తప్పు.. వాడిన నూనెను పదే పదే వేడి చేయడం. చాలా ఇళ్లలో, హోటళ్లలో నూనె వృథా కాకూడదని ఫ్రై చేసిన నూనెనే మళ్లీ మళ్లీ వేడి చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల నూనెలో హానికరమైన ఆక్సిడైజ్డ్ సమ్మేళనాలు, ట్రాన్స్ ఫ్యాట్స్ ఏర్పడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి గుండె జబ్బులకు, జీర్ణక్రియ సమస్యలకు కారణమవుతాయి. ముఖ్యంగా బయటి ఫుడ్ తినేటప్పుడు ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
వంట నూనె ఏదైనా సరే.. దాని స్మోక్ పాయింట్‌ను బట్టి వాడాలి, ఒకసారి వాడిన నూనెను పారబోయడమే ఆరోగ్యానికి క్షేమకరం.
అలాగే మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్‌పై “కొలెస్ట్రాల్ ఫ్రీ”, “షుగర్ ఫ్రీ” లేదా “పామాయిల్ ఫ్రీ” అనే లేబుల్స్ చూడగానే వాటిని ఎంతైనా తినేయవచ్చని అనుకుంటారు. ఏ లేబుల్ ఉన్నా కూడా, అతిగా తింటే బరువు పెరగడం, మెటబాలిక్ డిజార్డర్స్ రావడం ఖాయం.
ఎక్కువ నూనె వేస్తేనే వంట రుచిగా ఉంటుందనేది కూడా అపోహే. నూనె మోతాదు మించితే అది అసలు పదార్థాల రుచిని దెబ్బతీస్తుంది. నూనెకు బదులు భారతీయ మసాలాలు, మూలికలు, తాజా పదార్థాలను సరైన పద్ధతిలో వాడితే తక్కువ నూనెతోనే అద్భుతమైన రుచిని, ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


