మంట పుట్టిస్తున్న వంట నూనె ధరలు: ఇంధనంగా పామ్ ఆయిల్.. భారతీయుల జేబుకు చిల్లు
వంట గదిలో ఘుమఘుమలాడే కూరలైనా, బండి మీద వేడివేడి బజ్జీలైనా.. మన తెలుగు రాష్ట్రాల్లో పామ్ ఆయిల్ వాడకం చాలా ఎక్కువ. అయితే, ఇప్పుడు ఈ వంట నూనె ధర సామాన్యుడికి చుక్కలు చూపించబోతోంది. దీనికి కారణం మన దేశంలో కాకుండా, ఎక్కడో ఉన్న ఇండోనేషియా, మలేషియా తీసుకున్న ఒక నిర్ణయం.
వంట నూనెగా మనం వాడుతున్న పామ్ ఆయిల్, ఇప్పుడు ఇంధనంగా (Biodiesel) మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా పామ్ ఆయిల్ ఎగుమతుల్లో ఇండోనేషియా, మలేషియాలదే అగ్రస్థానం. ఈ రెండు దేశాలు తమ పెట్రోల్, డీజిల్ దిగుమతులను తగ్గించుకోవడానికి పామ్ ఆయిల్ ను భారీగా బయో-డీజిల్ తయారీకి మళ్లించాలని నిర్ణయించాయి. ముఖ్యంగా ఇండోనేషియా జూలై 1 నుంచి 'B50' విధానాన్ని అమలు చేయబోతోంది. అంటే డీజిల్‌లో 50 శాతం పామ్ ఆయిల్ కలుపుతారు. దీనివల్ల ఆ దేశం నుంచి మనకు వచ్చే ఎగుమతులు భారీగా తగ్గిపోనున్నాయి.

భారత్ ఎందుకు భయపడుతోంది?
మన దేశం తన వంట నూనె అవసరాల్లో 55 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇందులో సింహభాగం పామ్ ఆయిల్‌దే. దీనికి ప్రధాన కారణం ఇది సోయాబీన్ లేదా సన్‌ఫ్లవర్ ఆయిల్ కంటే చౌకగా దొరకడమే.
2025 గణాంకాల ప్రకారం.. అంతర్జాతీయ మార్కెట్లో ఒక టన్ను పామ్ ఆయిల్ ధర సుమారు 997 డాలర్లు ఉంటే, సోయా ఆయిల్ 1,420 డాలర్లు, సన్‌ఫ్లవర్ ఆయిల్ 1,526 డాలర్లుగా ఉంది.
అంటే ఇతర నూనెలతో పోలిస్తే పామ్ ఆయిల్ చాలా చౌక. ఇప్పుడు దీని సరఫరా తగ్గితే, డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం.
ఇండోనేషియా 'మాస్టర్ ప్లాన్'.. మనకు సెగ
ఇండోనేషియా తన మొత్తం పామ్ ఆయిల్ ఉత్పత్తిలో సుమారు 41 శాతం (అంటే దాదాపు 2.1 కోట్ల టన్నులు) కేవలం బయో-డీజిల్ తయారీకే వాడాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో ఇది కేవలం 20-25 శాతంగానే ఉండేది. ఇప్పటికే పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధాల వల్ల పెట్రోల్, గ్యాస్ ధరల సెగ భారత్‌కు తగులుతోంది. ఇప్పుడు వంట నూనె రూపంలో మరో భారం పడబోతోంది. ఇది కేవలం వంట నూనె ధరలనే కాకుండా.. బిస్కెట్లు, కాస్మెటిక్స్, బేకరీ ఉత్పత్తుల ధరలపైన కూడా ప్రభావం చూపుతుంది.
మన ప్రయత్నాలు ఏమయ్యాయి?
దేశీయంగా నూనె గింజల ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం 2021లో 'నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్' ప్రారంభించింది. అయితే, దీని పురోగతి చాలా నెమ్మదిగా ఉంది. 6.5 లక్షల హెక్టార్లలో పామాయిల్ తోటలు పెంచాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు కేవలం 2.5 లక్షల హెక్టార్లకే పరిమితమైంది. మరోవైపు సన్‌ఫ్లవర్ ఆయిల్ కోసం మనం రష్యా, ఉక్రెయిన్‌లపై ఆధారపడుతున్నాం. అక్కడ యుద్ధం వల్ల సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
మొత్తానికి, ఇటు ఇంధన అవసరాలు, అటు అంతర్జాతీయ రాజకీయాలు కలిసి సామాన్యుడి వంట గది బడ్జెట్‌ను అస్తవ్యస్తం చేసేలా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం తక్షణమే ప్రత్యామ్నాయ మార్గాలను వెతకకపోతే, సామాన్యుడి 'నూనె' కష్టాలు తప్పవు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. పామ్ ఆయిల్ ధరలు పెరగడానికి ప్రధాన కారణం ఏమిటి?
ప్రపంచంలోనే అతిపెద్ద ఎగుమతిదారులైన ఇండోనేషియా, మలేషియాలు పామ్ ఆయిల్ ను వంట కోసం కాకుండా, వాహనాల ఇంధనం (Biodiesel) తయారీకి మళ్లిస్తున్నాయి. దీనివల్ల మార్కెట్లో సరఫరా తగ్గి ధరలు పెరుగుతున్నాయి.
2. భారత్‌లో పామ్ ఆయిల్ వాడకం ఎందుకు ఎక్కువ?
సోయాబీన్, వేరుశనగ లేదా సన్‌ఫ్లవర్ నూనెలతో పోలిస్తే పామ్ ఆయిల్ ధర చాలా తక్కువ. అందుకే సామాన్యులు, హోటళ్లు, పారిశ్రామిక ఉత్పత్తుల్లో (బిస్కెట్లు, షాంపూలు) దీన్ని ఎక్కువగా వాడుతుంటారు.
3. ధరల పెరుగుదల నుంచి మనం ఎలా బయటపడవచ్చు?
దేశీయంగా పామాయిల్ తోటల సాగును పెంచడం, ఇతర నూనె గింజల ఉత్పత్తిపై రైతులకు ప్రోత్సాహకాలు అందించడం ద్వారా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చు.
4. B50 మాండేట్ అంటే ఏమిటి?
ఇండోనేషియా ప్రభుత్వం అమలు చేస్తున్న విధానం ప్రకారం.. డీజిల్‌లో 50 శాతం పామ్ ఆయిల్ నుంచి తీసిన బయో-డీజిల్ కలుపుతారు. దీనివల్ల ఆ దేశం పెట్రోలియం దిగుమతులను తగ్గించుకోవాలని చూస్తోంది.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


