గోల్డ్ ఈటీఎఫ్‌లు vs గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు.. ఏవి మేలు?

15 నెలల కనిష్ఠం నుంచి బంగారం ధరలు పుంజుకుంటున్న వేళ, ఏ మార్గంలో పెట్టుబడి పెడితే మంచి రాబడి వస్తుందన్న చర్చ సాగుతోంది. తక్కువ ఖర్చుతో గోల్డ్ ఈటీఎఫ్‌లు మేలని నిపుణులు సూచిస్తున్నారు.

Published on: Nov 27, 2026, 15:58:54 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

బంగారం ధరలు 15 నెలల కనిష్ఠ స్థాయి నుంచి వేగంగా పుంజుకుంటున్నాయి. బుధవారం 10 గ్రాములకు రూ.1,20,750 కనిష్ఠ స్థాయిని తాకిన ఎంసీఎక్స్ బంగారం రేటు, వరుసగా రెండు సెషన్లలో పెరిగింది. ప్రస్తుతం దేశంలో 10 గ్రాముల పసిడి ధర సుమారు రూ.1,25,800 వద్ద ఉంది. కనిష్ఠ స్థాయి నుంచి దాదాపు రూ.6,000 మేర పుంజుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 3,600 డాలర్ల నిరోధక స్థాయిని దాటి, ఇంట్రాడేలో గరిష్ఠంగా 3,679 డాలర్లకు చేరింది.

గోల్డ్ ఈటీఎఫ్‌లు vs గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు.. ఏవి మేలు?
గోల్డ్ ఈటీఎఫ్‌లు vs గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు.. ఏవి మేలు?

దేశంలో 10 గ్రాముల బంగారం రికార్డు గరిష్ఠమైన రూ.1,80,779 కంటే ఇంకా రూ.55,000 తక్కువగానే ఉన్నా, భౌతిక రూపంలో బంగారం కొనడం సామాన్యులకు తక్కువ ఖర్చుతో కూడుకున్న పని కాదు. అందుకే చాలామందికి గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు మెరుగైన ప్రత్యామ్నాయాలుగా నిలుస్తున్నాయి. అయితే ధరలు కోలుకుంటున్న ఈ సమయంలో ఏ మార్గంలో పెట్టుబడి పెడితే మెరుగైన రాబడి వస్తుందన్న మీమాంస సామాన్యుల్లో కనిపిస్తోంది.

పసిడి ధరలు పుంజుకుంటున్న వేళ సామాన్య మదుపరులు లాభాలు ఆర్జించేందుకు ఏ సాధనం బాగుంటుందన్న దానిపై నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) నియంత్రణలో పనిచేసే ఈ సాధనాల్లో ఖర్చులు, పెట్టుబడి విధానాలను బట్టి రాబడిలో తేడాలు ఉంటాయి.

ఖర్చుల లెక్క.. ఈటీఎఫ్‌లదే పైచేయి

"గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెట్టాలంటే మదుపరుడికి డీమ్యాట్ ఖాతా తప్పనిసరి, అదే గోల్డ్ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి డీమ్యాట్ ఖాతా లేకపోయినా సరిపోతుంది. ఖర్చుల పరంగా చూస్తే గోల్డ్ ఈటీఎఫ్‌లే మేలు. ఎందుకంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్లలో పెట్టిన సొమ్మును ఫండ్ మేనేజర్ గోల్డ్ ఈటీఎఫ్‌లలోనే మదుపు చేస్తారు, దానికి ఎక్స్‌పెన్స్ రేషియో రూపంలో రుసుము వసూలు చేస్తారు. దీనివల్ల గోల్డ్ ఈటీఎఫ్‌లతో పోలిస్తే రాబడి కొద్దిగా తక్కువగా ఉంటుంది" అని ఆప్టిమా మనీ మేనేజర్స్ ఎండీ, సీఈఓ పంకజ్ మఠ్‌పాల్ తెలిపారు.

దీర్ఘకాలికంగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి, అలాగే ఒకేసారి పెద్ద మొత్తం పెట్టాలనుకునే వారికి గోల్డ్ ఈటీఎఫ్‌లు అనుకూలంగా ఉంటాయని పంకజ్ మఠ్‌పాల్ చెప్పారు. గోల్డ్ ఈటీఎఫ్ మదుపరులు కేవలం బ్రోకరేజీ మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. కానీ గోల్డ్ మ్యూచువల్ ఫండ్ మదుపరులు ఫండ్ మేనేజర్ రుసుము కింద అదనపు ఎక్స్‌పెన్స్ రేషియో చెల్లించాలి. ఇది సాధారణంగా 0.40 శాతం నుంచి 1 శాతం వరకు ఉంటుంది.

ఎవరికి ఏది తగినది?

"బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునే ట్రేడర్లకు ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్) బాగా సరిపోతుంది. గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ తరహాలో పనిచేస్తాయి, వీటిలో ఫండ్ మేనేజర్ మీ డబ్బును గోల్డ్ ఈటీఎఫ్‌లో పెడతారు. మార్కెట్ గురించి పూర్తి అవగాహన ఉన్న మదుపరులు గోల్డ్ ఈటీఎఫ్ ఎంచుకోవడం మంచిది, అవగాహన తక్కువగా ఉన్నవారు గోల్డ్ మ్యూచువల్ ఫండ్ల వైపు వెళ్లవచ్చు" అని సెబీ నమోదిత మార్కెట్ నిపుణుడు అనుజ్ గుప్తా వివరించారు.

గోల్డ్ మ్యూచువల్ ఫండ్ మదుపరులు ఫండ్ మేనేజర్ రుసుముతో పాటు, నిర్ణీత గడువు కంటే ముందే నిధులను వెనక్కి తీసుకుంటే ఎగ్జిట్ లోడ్ కూడా చెల్లించాల్సి ఉంటుందని అనుజ్ గుప్తా చెప్పారు. అందువల్ల గోల్డ్ ఈటీఎఫ్‌లతో పోలిస్తే మ్యూచువల్ ఫండ్లలో రాబడి తక్కువగా ఉంటుంది.

గోల్డ్ ఈటీఎఫ్‌ను ఎలా ఎంచుకోవాలి?

గోల్డ్ ఈటీఎఫ్‌ను ఎంపిక చేసుకునేటప్పుడు ట్రేడ్ వాల్యూమ్, ప్రీమియంను తప్పనిసరిగా గమనించాలని పంకజ్ మఠ్‌పాల్ సూచించారు. ప్రీమియం ఎక్కువగా ఉంటే రాబడి తక్కువగా ఉంటుంది. కాబట్టి మెరుగైన రాబడి కోసం తక్కువ ప్రీమియంతో ట్రేడ్ అవుతున్న గోల్డ్ ఈటీఎఫ్ పథకాన్ని ఎంచుకోవాలి.

ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో నిఫ్టీ గోల్డ్ బీఈఎస్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ గోల్డ్ ఈటీఎఫ్, నిప్పాన్ ఇండియా ఈటీఎఫ్ గోల్డ్ బీఈఎస్‌లలో పెట్టుబడి పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పంకజ్ మఠ్‌పాల్ పేర్కొన్న ప్రధాన గోల్డ్ ఈటీఎఫ్‌ల వివరాలు ఇలా ఉన్నాయి:

  • నిఫ్టీ గోల్డ్ బీఈఎస్ (Nifty Gold BeES)
  • ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ గోల్డ్ ఈటీఎఫ్ (ICICI Prudential Gold ETF)
  • నిప్పాన్ ఇండియా ఈటీఎఫ్ గోల్డ్ బీఈఎస్ (Nippon India ETF Gold BeEs)
  • హెచ్‌డీఎఫ్‌సీ గోల్డ్ ఈటీఎఫ్ (HDFC Gold ETF)

ప్రధాన గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు ఇవే

పెట్టుబడి పెట్టడానికి అనువైన గోల్డ్ మ్యూచువల్ ఫండ్ల గురించి అడిగినప్పుడు అనుజ్ గుప్తా ఈ కింది పథకాలను పేర్కొన్నారు.

  • ఎస్‌బీఐ గోల్డ్ మ్యూచువల్ ఫండ్ (SBI Gold Mutual Fund)
  • హెచ్‌డీఎఫ్‌సీ గోల్డ్ మ్యూచువల్ ఫండ్ (HDFC Gold Mutual Fund)
  • నిప్పాన్ ఇండియా గోల్డ్ సేవింగ్స్ ఫండ్ (Nippon India Gold Savings Fund)
  • ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ గోల్డ్ ఈటీఎఫ్ ఎఫ్‌ఓఎఫ్ (ICICI Prudential Gold ETF FoF)
  • కోటక్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్ (Kotak Gold Mutual Fund)

(గమనిక: ఈ కథనం కేవలం విద్యాపరమైన సమాచారం, అవగాహన కోసమే. ఇందులోని అభిప్రాయాలు, సిఫార్సులు వ్యక్తిగత విశ్లేషకులు లేదా బ్రోకింగ్ సంస్థలవి మాత్రమే, ఇవి మింట్ అభిప్రాయాలు కావు. ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందైనా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణులను సంప్రదించడం శ్రేయస్కరం.)

ABOUT THE AUTHOR

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.