తొలిసారి $5,000 మార్కును దాటిన బంగారం ధర.. వెండి కూడా సెంచరీ కొట్టింది

బంగారం ధర సరికొత్త రికార్డు సృష్టించింది. ఔన్స్ బంగారం ధర $5,100 మార్కును దాటగా, వెండి కూడా తొలిసారి $100 మైలురాయిని అధిగమించింది.

Updated on: Jan 26, 2026, 14:38:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ అనిశ్చితి, అంతర్జాతీయ సంబంధాల్లో వస్తున్న పెను మార్పులు పసిడికి రెక్కలు తొడిగాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 5,000 డాలర్ల మార్కును దాటి రికార్డు సృష్టించింది. సోమవారం ట్రేడింగ్‌లో స్పాట్ గోల్డ్ ధర 2.2 శాతం పెరిగి $5,089.78 వద్ద స్థిరపడగా, ఒక దశలో ఇది గరిష్టంగా $5,110.50ని తాకింది.

రాకెట్ లా దూసుకెళుతున్న బంగారం ధరలు (AFP)
రాకెట్ లా దూసుకెళుతున్న బంగారం ధరలు (AFP)

బంగారం ధరలు 2025 ఏడాదిలో ఏకంగా 64 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 1979 తర్వాత పసిడికి ఇదే అత్యుత్తమ ఏడాది కావడం గమనార్హం. కేవలం ఈ ఏడాది (2026) ప్రారంభం నుంచే బంగారం ఇప్పటికే 18 శాతానికి పైగా లాభపడింది.

వెండి కూడా తగ్గేదేలే..

బంగారంతో పాటు వెండి ధరలు కూడా ఆకాశాన్నంటాయి. శుక్రవారం ట్రేడింగ్‌లో వెండి ధర తొలిసారి $100 మార్కును దాటి సరికొత్త రికార్డు నెలకొల్పింది. గత ఏడాది వెండి ధరలో 147 శాతం పెరుగుదల కనిపించింది. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి భారీగా డిమాండ్ పెరగడం, మార్కెట్‌లో వెండి నిల్వలు తగ్గడం వల్ల ధరలు ఇలా అమాంతం పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

పసిడి పరుగుకు కారణాలేంటి?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలు మార్కెట్లలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా:

ఫెడరల్ రిజర్వ్‌పై విమర్శలు: అమెరికా కేంద్ర బ్యాంకుపై ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు ఇన్వెస్టర్లలో ఆందోళన పెంచుతున్నాయి.

అంతర్జాతీయ ఉద్రిక్తతలు: గ్రీన్‌ల్యాండ్ వ్యవహారం, వెనిజులాలో సైనిక జోక్యం వంటి హెచ్చరికలు ప్రపంచ దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి.

కరెన్సీపై నమ్మకం తగ్గడం: ప్రభుత్వ బాండ్లు, కరెన్సీల కంటే బంగారం వైపు మొగ్గు చూపడాన్ని నిపుణులు 'డిబేస్‌మెంట్ ట్రేడ్' (Debasement Trade) గా అభివర్ణిస్తున్నారు.

"అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న అస్థిర నిర్ణయాల వల్ల అమెరికన్ ఆస్తుల మీద ఇన్వెస్టర్లకు నమ్మకం సడలుతోంది. అందుకే అందరూ సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు పరుగులు తీస్తున్నారు" అని క్యాపిటల్.కామ్ సీనియర్ మార్కెట్ అనలిస్ట్ కైల్ రోడ్డా వివరించారు.

మున్ముందు ఏంటి పరిస్థితి?

ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఈ ఏడాది చివరి నాటికి బంగారం ధర 6,000 డాలర్లకు చేరువయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేంద్ర బ్యాంకులు భారీగా బంగారాన్ని నిల్వ చేసుకోవడం, రిటైల్ కొనుగోళ్లు పెరగడం పసిడి ధర మరింత పెరగడానికి దోహదం చేస్తాయని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర ఎంత?

కరీంనగర్ టౌన్ గోల్డ్ అండ్ సిల్వర్ మర్చెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ధరల ప్రకారం ఈరోజు (సోమవారం 26 జనవరి 2026) మధ్యాహ్నం 12 గంటలకు బంగారం 10 గ్రాముల ధర రూ. 1,65,350గా ఉంది. వెండి ధర 10 గ్రాములకు రూ. 3600గా ఉంది. నగరాన్ని బట్టి ఇది అటుఇటుగా మారుతుంది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More