Gold Silver price : ఇరాన్​పై దాడులు- బంగారం, వెండి ధరలకు రెక్కలు.. నేటి పరిస్థితి ఇది..

Comex gold : పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ ఆర్థిక మార్కెట్లను కుదిపేస్తున్నాయి. సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం, వెండి వైపు ఇన్వెస్టర్లు మళ్లడంతో సోమవారం (మార్చి 2) ధరలు భారీగా పెరిగాయి. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Mar 2, 2026, 08:15:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఆర్థిక మార్కెట్లను వణికిస్తున్నాయి. ఈ ప్రభావంతో సోమవారం, మార్చి 2న బంగారం, వెండి ధరలు సుమారు 2.5 శాతం మేర పెరిగాయి. ఆర్థిక మార్కెట్లలో అస్థిరత నెలకొన్నప్పుడు ఇన్వెస్టర్లు సురక్షితమైన ఆస్తిగా భావించే విలువైన లోహాల వైపు మళ్లడమే దీనికి ప్రధాన కారణం.

బంగారం, వెండి ధరలకు రెక్కలు..
బంగారం, వెండి ధరలకు రెక్కలు..

అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు నేడు ఇంట్రాడే సెషన్‌లో ఔన్సుకు 5,400 డాలర్ల మార్కును తాకింది. అటు వెండి ధర కూడా దాదాపు 2 శాతం పెరిగి, ఆసియా ట్రేడింగ్ గంటల్లో ఔన్సుకు 96.93 డాలర్ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.

నేటి ధరల పెరుగుదలకు కారణాలేంటి?

గడిచిన వారాంతంలో పశ్చిమాసియాలో చోటుచేసుకున్న పరిణామాలు మార్కెట్లను కుదిపేస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై జరిపిన భారీ దాడులకు ప్రతిగా.. టెహ్రాన్ (ఇరాన్) పలు దేశాలపై క్షిపణుల వర్షం కురిపించింది.

ఈ దాడుల తొలిరోజే ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అల్​ ఖమేనీ మరణించినట్లు వార్తలు వచ్చాయి.

ప్రతీకార చర్యగా ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు ఇజ్రాయెల్‌తో పాటు ఖతార్, యూఏఈ, కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా సైనిక స్థావరాలను, ఇతర సౌకర్యాలను తాకాయి. ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు తోడు, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ దౌత్య సంబంధాలను పునర్నిర్మిస్తుండటం కూడా బంగారం ధరలు నిరంతరం పెరగడానికి ప్రధాన కారణమవుతున్నాయి. సెంట్రల్ బ్యాంకుల భారీ కొనుగోళ్లు, ఇన్వెస్టర్లు ప్రభుత్వ బాండ్లు, కరెన్సీల నుంచి వైదొలగి బంగారం వైపు రావడం ధరలకు ఊతాన్నిస్తోంది.

బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ఫిబ్రవరి నెలలో కూడా బంగారం తన జోరును కొనసాగించింది. వరుసగా ఏడు నెలల పాటు లాభాలను నమోదు చేస్తూ వస్తోంది. 1973 తర్వాత పసిడికి ఇంతటి సుదీర్ఘ లాభాల కాలం రావడం ఇదే మొదటిసారి.

పెట్టుబడికి ఇది సరైన సమయమేనా? నిపుణులు ఏమంటున్నారు?

జతీన్ త్రివేది (విపి రీసెర్చ్ అనలిస్ట్, ఎల్​కేపీ సెక్యూరిటీస్):

ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు, రిస్క్ ఆసెట్స్ ఒత్తిడికి గురైనప్పుడు, పెట్టుబడులు సహజంగానే విలువైన లోహాల వైపు మళ్లుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇవి అనిశ్చితికి వ్యతిరేకంగా రక్షణ కవచంలా (హెడ్జ్​) పనిచేస్తాయని పేర్కొన్నారు. యుద్ధం మరింత ముదిరితే ఈ ధరల పెరుగుదల ఇలాగే కొనసాగవచ్చని, అయితే ప్రారంభంలో 3-6% పెరిగిన తర్వాత కొంత లాభాల స్వీకరణ జరిగే అవకాశం ఉందని ఆయన సూచించారు.

పొన్ముడి ఆర్ (సిఈఓ, ఎన్రిచ్ మనీ): బంగారం, వెండి మార్కెట్లలో ఒడిదుడుకులు నియంత్రణలోనే ఉన్నాయని, అయితే కీలకమైన బ్రేక్-అవుట్ స్థాయిల వద్ద ఇన్వెస్టర్ల భాగస్వామ్యం గణనీయంగా పెరిగిందని ఆయన తెలిపారు. టెక్నికల్ పరంగా చూస్తే పసిడికి డిమాండ్ బలంగా ఉందని పేర్కొన్నారు.

ఫవాద్ రజాక్జాదా (మార్కెట్ అనలిస్ట్, సిటీ ఇండెక్స్): రాయిటర్స్ కథనం ప్రకారం.. "బంగారానికి ఉన్న ‘హెవెన్ డిమాండ్’ కారణంగా ధరలు మళ్లీ 5,500 డాలర్ల స్థాయికి చేరవచ్చు. ఇది సాధ్యమైతే, జనవరిలో నమోదైన గరిష్ట స్థాయి 5,600 డాలర్లను అధిగమించి సరికొత్త రికార్డును సృష్టించే అవకాశం ఉంది," అని ఆయన అంచనా వేశారు.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఇన్వెస్ట్​మెంట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More