US Iran war : ఇరాన్​పై దాడులు.. అంతా గందరగోళం! సోమవారం స్టాక్​ మార్కెట్​ పరిస్థితేంటి గురువు గారు?

అమెరికా- ఇజ్రాయెల్​లు అనుకున్నది సాధించాయి! ఇరాన్​పై దాడి చేసి ఆ దేశ అగ్రనేతనే హతమార్చాయి. ఈ వ్యవహారం ఇప్పుడు ప్రపంచవ్యాప్త స్టాక్​ మార్కెట్​లను గడగడలాడిస్తోంది. మరి సోమవారం భారత స్టాక్​ మార్కెట్​పై వీటి ప్రభావం ఎంత? నిపుణులు ఏమంటున్నారంటే..

Published on: Mar 01, 2026 10:45 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పశ్చిమాసియాపై కమ్ముకున్న యుద్ధమేఘాలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. ఇరాన్​పై అమెరికా- ఇజ్రాయెల్​ దాడులు చేయడం, ఆ దేశ అగ్రనేత అయతొల్లా అల్​ ఖమేనీని హతమార్చడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్​ సైతం ప్రకటించింది. ఈ పరిణామం ఇరాన్ అణు వివాదంపై పాశ్చాత్య దేశాలతో జరగాల్సిన దౌత్యపరమైన పరిష్కార ఆశలను పూర్తిగా నీరుగార్చింది. ఈ యుద్ధ ప్రభావం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను పెంచడమే కాకుండా, సోమవారం మార్కెట్లు ప్రారంభమైనప్పుడు ఈక్విటీలు, బంగారం, వెండి వంటి ఆస్తులపై తీవ్ర ప్రభావం చూపుతుందని మదుపర్లు ఆందోళన చెందుతున్నారు.

సోమవారం స్టాక్​ మార్కెట్​ పరిస్థితేంటి?
సోమవారం స్టాక్​ మార్కెట్​ పరిస్థితేంటి?

భారత స్టాక్ మార్కెట్‌పై ప్రభావం ఎంత?

సోమవారం దలాల్ స్ట్రీట్ భారీ 'గ్యాప్-డౌన్'తో ప్రారంభమయ్యే అవకాశం ఉందని స్టాక్ మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నిఫ్టీ 50 అంచనా: నిఫ్టీ 50 ఇండెక్స్ తన సపోర్ట్​ స్థాయి అయిన 24,850 - 24,800ను కోల్పోతే, అది 24,500 నుంచి 24,400 స్థాయిలను పరీక్షించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితి వల్ల బంగారం, వెండి వైపు మదుపర్లు మొగ్గు చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.

సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ అవినాష్ గోరక్షకర్ మాట్లాడుతూ.. "అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల తర్వాత అనిశ్చితి పెరిగింది. ముఖ్యంగా ప్రపంచ చమురు సరఫరాలో 20% వాటా కలిగిన 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' (దీనిపై ఇరాన్​కి పట్టు ఉంది) వద్ద సరఫరా గొలుసుకు ముప్పు పొంచి ఉంది. అందుకే నిఫ్టీ 24,800 పైన నిలబడటం కష్టమే," అని అన్నారు.

ఎస్ఎస్ వెల్త్‌స్ట్రీట్ వ్యవస్థాపకురాలు సుగంధ సచ్‌దేవా మాట్లాడుతూ.. "స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మూతబడితే ముడి చమురు ధరలు అమాంతం పెరిగి, రవాణా ఖర్చులు, ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయి. ఇది కేంద్ర బ్యాంకుల పాలసీలను క్లిష్టతరం చేస్తుంది," అని వివరించారు.

టెక్నికల్ అవుట్‌లుక్ - సుమీత్ బగాడియా:

చాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమీత్ బగాడియా ప్రకారం.. శుక్రవారానికే నిఫ్టీ 200-డే ఈఎంఏ కంటే తక్కువగా ముగియడం మార్కెట్ బలహీనతను సూచిస్తోంది. వరుసగా నాలుగోసారి రెడ్ క్యాండిల్ ఏర్పడటం మార్కెట్ 'బేరిష్' ట్రెండ్‌లోకి వెళ్తున్నట్లు సంకేతమిస్తోంది. నిఫ్టీకి 25,300–25,350 వద్ద బలమైన రెసిస్టెన్స్​ ఉంది.

కాగా ఇంకొందరు నిపుణుల ప్రకారం.. భారత స్టాక్​ మార్కెట్లు ఇప్పటికే డౌన్​లో ఉన్నాయి. ఫలితంగా సోమవారం గ్యాప్​-డౌన్​ అయినా, అక్కడి నుంచి కోలుకునే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు.

బంగారం- వెండి ధరల పరిస్థితేంటి?

ఇరాన్​- అమెరికా, ఇజ్రాయెల్​ మధ్య యుద్ధమేఘాల నేపథ్యంలో మదుపర్లు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారని నిపుణుడు అనుజ్ గుప్తా తెలిపారు.

బంగారం: అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు ఒక ఔన్సు‌కు 5,300 డాలర్లు దాటితే, భారత్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ. 1,68,000 నుంచి రూ. 1,70,000 వరకు చేరవచ్చు.

వెండి: వెండి ధర అంతర్జాతీయంగా ఔన్సుకు 100 డాలర్లు మార్కును తాకితే, భారత్‌లో కిలో వెండి ధర రూ. 3,00,000కు చేరుకునే అవకాశం ఉంది.

US Israel Strikes : అప్రమత్తంగా ఉండండి...! ఇరాన్‌, ఇజ్రాయెల్‌లోని పౌరులకు భారత ఎంబసీ అడ్వైజరీ

ముడి చమురుపై ప్రభావం - అమిత్ గోయల్..

అమెరికా- ఇజ్రాయెల్ దాడులు కేవలం ఇరాన్ సైనిక స్థావరాలకే పరిమితం కావొచ్చని అమిత్ గోయల్ అభిప్రాయపడ్డారు. చమురు బావులపై దాడులు చేస్తే సరఫరా దెబ్బతిని అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతుందని, తద్వారా 9 నెలల్లో జరగబోయే కాంగ్రెషనల్ ఎన్నికల్లో ట్రంప్ పార్టీకి నష్టం జరుగుతుందని ఆయన విశ్లేషించారు. అందుకే బ్రెంట్ క్రూడ్ 80 డాలర్లకు మించకపోవచ్చని ఆయన అంచనా వేశారు.

(గమనిక- ఇది కేవలం సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్​లో ఇన్వెస్ట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)