Trump Tariffs : ట్రంప్ టారిఫ్‌లకు బ్రేక్- రేపు స్టాక్ మార్కెట్లకు భారీ లాభాలు! ఈ స్టాక్స్‌పై ఫోకస్..
అమెరికా దిగుమతి సుంకాలపై ఆ దేశ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు భారతీయ ఎగుమతిదారులకు భారీ ఊరటనిచ్చింది. ఈ పరిణామంతో సోమవారం భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో (గ్యాప్ అప్) ప్రారంభమయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అమెరికా వాణిజ్య విధానాల్లో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ట్రేడింగ్ భాగస్వాములపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విధించిన ‘రెసిప్రోకల్ టారిఫ్’లను ఆ దేశ సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయితే, ఈ తీర్పు వెలువడిన కొన్ని గంటల్లోనే అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ.. అన్ని దేశాలకు వర్తించేలా 10 శాతం గ్లోబల్ టారిఫ్‌ను ప్రకటించారు.
అంతటితో ఆగకుండా, తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో కోర్టు తీర్పును విమర్శిస్తూ, ఈ గ్లోబల్ టారిఫ్ రేటును 10 శాతం నుంచి 15 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. దీనిని చట్టపరంగా పరీక్షించినట్లు, అమెరికా ప్రయోజనాలను కాపాడటానికి ఇది అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. రానున్న నెలల్లో మరిన్ని అదనపు సుంకాలను కూడా విధిస్తామని ఆయన హెచ్చరించారు.
భారత ఎగుమతిదారులకు ఊరట:
“భారతదేశానికి సంబంధించి, ఈ పరిణామం అమెరికా-భారత వాణిజ్య అమరికను మళ్లీ మొదటికి తెచ్చింది. ప్రస్తుతానికి టారిఫ్ భారం 10-15 శాతానికే పరిమితం కావచ్చు. ఇది టెక్స్‌టైల్స్, ఫార్మాస్యూటికల్స్, జెమ్స్, మెషినరీ వంటి రంగాల ఎగుమతిదారులకు స్వల్పకాలిక అనిశ్చితిని తెచ్చినప్పటికీ, గతంలో ప్రతిపాదించిన కఠిన చర్యల కంటే ఇది తక్కువ ప్రమాదకరమైనది,” అని ఎన్‌రిచ్ మనీ సీఈఓ పొన్ముడి ఆర్. అభిప్రాయపడ్డారు.
సోమవారం స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
అమెరికా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సోమవారం భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో (గ్యాప్ అప్ ఓపెనింగ్) ప్రారంభం కానున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
గిఫ్ట్ నిఫ్టీ: గిఫ్ట్ నిఫ్టీలో సానుకూల ధోరణి కనిపిస్తోంది. శుక్రవారం నిఫ్టీ-50 ఇండెక్స్ 25,571 వద్ద ముగియగా, ఫిబ్రవరి 26 ఎక్స్‌పైరీ గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ 25,764 వద్ద స్థిరపడ్డాయి. అంటే సుమారు 200 పాయింట్ల ప్రీమియం కనిపిస్తోంది.
సెన్సెక్స్ అంచనా: ఈ భారీ వ్యత్యాసాన్ని బట్టి చూస్తే, సోమవారం ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్ 500 పాయింట్ల కంటే ఎక్కువ లాభంతో ప్రారంభమయ్యే అవకాశం ఉందని సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ అవినాష్ గోరక్షకర్ పేర్కొన్నారు. అయితే, ట్రంప్ తన టారిఫ్ విధానాల కోసం ప్రత్యామ్నాయ చట్టపరమైన మార్గాలను వెతుకుతామన్న వ్యాఖ్యలు అంతర్జాతీయ మార్కెట్లలో కొంత ఒడిదుడుకులకు కారణం కావచ్చని పొన్ముడి హెచ్చరించారు.
సోమవారం ఫోకస్‌లో ఉండే రంగాలు, షేర్లు..
ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ (ఐఈఈపీఏ) కింద విధించిన సుంకాల వల్ల గతంలో సుమారు 50 బిలియన్ డాలర్ల విలువైన భారత ఎగుమతులు ప్రభావితమయ్యాయి. ఇప్పుడు కోర్టు తీర్పుతో ఈ క్రింది స్టాక్స్ వెలుగులో ఉంటాయి:
టెక్స్‌టైల్స్ : వర్ధమాన్ టెక్స్‌టైల్ , వెల్స్పన్ లివింగ్, కేపీఆర్ మిల్, ట్రైడెంట్ వంటి ఎగుమతి ఆధారిత షేర్లు.
జెమ్స్ అండ్ జ్యువెలరీ : కళ్యాణ్ జ్యువెలర్స్, సెన్కో గోల్డ్, టైటాన్.
ఆటో విడిభాగాలు: భారత్ ఫోర్జ్ , అపోలో టైర్స్ కంపెనీల ఎగుమతి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంది.
కెమికల్స్ : బీఏఎస్ఎఫ్ ఇండియా , నవీన్ ఫ్లోరోకెమికల్, యూపీఎల్ వంటి స్టాక్స్ లబ్ధి పొందవచ్చు.
సుంకాల్లో తగ్గుదల ఈ కంపెనీల ఆదాయ మార్జిన్లను పెంచుతుందని, తద్వారా సోమవారం మార్కెట్లో ఇవి కీలకంగా మారతాయని ఎస్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్ అనలిస్ట్ సీమా శ్రీవాస్తవ పేర్కొన్నారు.
(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు మీరు మీ సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదిండ శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


