Trump tariff : సుప్రీంకోర్టుపై కోపం! ప్రపంచ దేశాలపై 10శాతం సుంకాలు వేసిన ట్రంప్..
ప్రపంచ దేశాలపై 10శాతం సుంకాలు విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు సంబంధిత ఆదేశాలపై సంతకం చేసినట్టు వివరించారు. ట్రంప్ విధించే సుంకాలు చెల్లుబాటు కావని ఆ దేశ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన కొన్ని గంటల్లోనే ఈ పరిణామం చోటుచేసుకుంది.
ప్రపంచ దేశాలపై అమెరికా విధిస్తున్న సుంకాలు చెల్లవని ఆ దేశ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిన కొన్ని గంటల్లోనే, అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ప్రపంచ దేశాలపై 10శాతం సుంకాలు విధిస్తున్నట్టు, ఇందుకు సంబంధించిన ఆదేశాలపై సంతకం చేసినట్టు వెల్లడించారు. ఇది “దాదాపు వెంటనే” అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. దిగుమతులపై ఈ 10శాతం సుంకాలు 150 రోజుల పాటు అమల్లో ఉంటాయని, ఈలోగా మరిన్ని టారిఫ్‌లు విధించేందుకు కసరత్తు చేస్తామని ఆయన అన్నారు.

సుప్రీంకోర్టు తీర్పు తనని ప్రభావితం చేయదని, తాను వెనకడుగు వేయనని ట్రంప్ తన తాజా నిర్ణయంతో తేల్చిచెప్పారు.
అసలేం జరుగుతోంది?
రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ‘టారిఫ్’లతో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై అంతర్జాతీయంగానే కాదు సొంత దేశంలోనే ఆయన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఇందులో భాగంగా, ట్రంప్ సుంకాలకు వ్యతిరేకంగా ఆ దేశ సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. ఇంతకాలం వాటిని విచారిస్తూ వచ్చిన సుప్రీంకోర్టు.. ట్రంప్ సుంకాలు చెల్లవని శుక్రవారం సంచలన తీర్పును వెలువరించింది.
ఫలితంగా ట్రంప్ ఇంతకాలం వేసిన అన్ని సుంకాలు రద్దు అయ్యాయి.
ట్రంప్ స్పందన ఇలా..
సుప్రీంకోర్టు వెలువరించిన ఈ తీర్పు ట్రంప్‌నకు గట్టి ఎదురుదెబ్బే అని చెప్పుకోవాలి. కానీ ఆయన మాత్రం ‘తగ్గేదే లే’ అన్న వైఖరిని ప్రదర్శిస్తూ, తన బలాన్ని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ప్రపంచ దేశాలపై 10శాతం సుంకాలు వేశారు.
ట్రూత్ సోషల్ వేదికగా ఆయన స్పందిస్తూ.. "అన్ని దేశాలపై 10 శాతం గ్లోబల్ టారిఫ్ విధిస్తూ ఓవల్ ఆఫీస్‌లో ఇప్పుడే సంతకం చేశాను. ఇది తక్షణమే అమల్లోకి వస్తుంది," అని ప్రకటించారు.
ప్రస్తుతానికి 10% సుంకాలను అమలు చేస్తున్నా, దీర్ఘకాలంలో పాత స్థాయి సుంకాలనే (10% నుంచి 50%) తిరిగి తెచ్చేందుకు ట్రంప్ బృందం సిద్ధమైంది.
సుప్రీంకోర్టు తీర్పు వల్ల ప్రభుత్వం కోల్పోయే ఆదాయాన్ని సమం చేయడానికి ట్రంప్ యంత్రాంగం కొత్త ఎత్తుగడ వేసేందుకు యోచిస్తోంది.
సెక్షన్ 122 ప్రయోగం: 1974 నాటి వాణిజ్య చట్టంలోని సెక్షన్ 122ను ట్రంప్ తొలిసారిగా ప్రయోగించారు. దేశ ఆర్థిక లోటును అధిగమించేందుకు 150 రోజుల పాటు గరిష్టంగా 15 శాతం సుంకాలు విధించే అధికారం దీని ద్వారా అధ్యక్షుడికి లభిస్తుంది.
ఆదాయం తగ్గకుండా ప్లాన్: ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ స్పందిస్తూ.. సుప్రీంకోర్టు తీర్పు వల్ల తగ్గే ఆదాయాన్ని ఈ కొత్త 10శాతం సుంకాలు, అలాగే సెక్షన్ 301, 232 కింద చేపట్టే విచారణల ద్వారా భర్తీ చేస్తామని చెప్పారు. దీనివల్ల 2026లో ప్రభుత్వానికి వచ్చే మొత్తం టారిఫ్ ఆదాయంలో పెద్దగా మార్పు ఉండదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
న్యాయపరమైన చిక్కులు ఉన్నాయా?: ఈ కొత్త సుంకాలను కూడా కోర్టులో సవాలు చేసే అవకాశం ఉంది. అయితే, సెక్షన్ 122 గడువు కేవలం 150 రోజులు మాత్రమే కావడంతో, కోర్టు తుది తీర్పు ఇచ్చేలోపే ఈ సుంకాల కాలపరిమితి ముగిసిపోయే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం తగ్గిందా?
సుప్రీంకోర్టు తీర్పు వల్ల ట్రంప్ తన 'బేరసారాల శక్తి' కొంత కోల్పోయారని ట్రెజరీ సెక్రటరీ అంగీకరించారు. అయితే, నేరుగా కాకుండా ఏదో ఒక విధంగా మళ్లీ పాత స్థాయి సుంకాలనే అమలు చేయాలని వైట్ హౌస్ పట్టుదలతో ఉంది.
"మన దగ్గర అద్భుతమైన ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి, వీటి ద్వారా దేశం మరింత బలోపేతం అవుతుంది," అని ట్రంప్ కొన్ని గంటల ముందు వ్యాఖ్యానించారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


