సుప్రీంకోర్టు షాక్ ఇచ్చినా ‘తగ్గేదే లే’ అంటున్న ట్రంప్! సుంకాలను కొనసాగించేందుకు ఉన్న మార్గాలు ఇవి..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన భారీ సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయితే, తాను వెనక్కి తగ్గనని ట్రంప్ తేల్చి చెప్పారు. మరి ఇప్పుడు సుంకాలను కొనసాగించాలంటే, ట్రంప్‌నకు ఉన్న ఆప్షన్లు ఏంటి?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశంలో అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే వాడాల్సిన ప్రత్యేక అధికారాలను అడ్డం పెట్టుకుని, ఇతర దేశాల నుంచి వచ్చే వస్తువులపై భారీగా సుంకాలు విధించడం చెల్లదని అమెరికా సుప్రీంకోర్టు శుక్రవారం సంచలన తీర్పునిచ్చింది. అధ్యక్షుడికి ఉన్న అధికారాల పరిధిని మించి ఈ నిర్ణయం తీసుకున్నారని కోర్టు స్పష్టం చేసింది.

అయితే, ట్రంప్ మాత్రం తాను వెనక్కి తగ్గేదే లేదని, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సుంకాలను కొనసాగిస్తానని గట్టిగా ప్రకటించారు.
ట్రంప్ పట్టుదల: 10 శాతం గ్లోబల్ టారిఫ్ ఖాయం..
సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ట్రంప్ స్పందించారు. "సుప్రీం తీర్పుతో సంబంధం లేకుండా, అమెరికా ప్రయోజనాలను కాపాడేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. సెక్షన్ 122 కింద ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల వస్తువులపై 10 శాతం అదనపు సుంకం విధించే ఉత్తర్వులపై సంతకం చేస్తాను," అని ఆయన ప్రకటించారు. ఇతర దేశాలు, కంపెనీల అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసుల నుంచి అమెరికాను రక్షించేందుకు ఈ నిర్ణయం తప్పదని ఆయన వాదించారు.
ట్రంప్ ముందున్న ఇతర మార్గాలివే:
ట్రంప్ పరిపాలన ప్రస్తుతం సుంకాలను అమలు చేయడానికి ప్రధానంగా నాలుగు చట్టపరమైన మార్గాలను పరిశీలిస్తోంది:
సెక్షన్ 122 (ట్రేడ్ యాక్ట్ 1974): ఇది ట్రంప్ దగ్గర ఉన్న అత్యంత వేగవంతమైన ఆయుధం. దేశ వాణిజ్య లోటును తగ్గించడానికి 15 శాతం వరకు సుంకాలు విధించే అవకాశం ఉంటుంది. అయితే, ఇది కేవలం 150 రోజులు మాత్రమే చెల్లుతుంది. ఆ పైన పొడిగించాలంటే కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరి.
సెక్షన్ 232 (ట్రేడ్ ఎక్స్‌పాన్షన్ యాక్ట్ 1962): దిగుమతుల వల్ల దేశ భద్రతకు ముప్పు ఉందని భావిస్తే ఈ చట్టాన్ని వాడవచ్చు. గతంలో స్టీల్, అల్యూమినియం సుంకాల కోసం ట్రంప్ దీనినే ఉపయోగించారు. దీనిపై దర్యాప్తునకు 270 రోజుల సమయం పట్టినప్పటికీ, ఇది చట్టబద్ధంగా చాలా బలంగా ఉంటుంది.
సెక్షన్ 301 (ట్రేడ్ యాక్ట్ 1974): చైనా వంటి దేశాల వాణిజ్య పద్ధతులను అడ్డుకోవడానికి ఇది సరైనది. దీని కింద విధించే సుంకాలు నిరవధికంగా కొనసాగవచ్చు.
సెక్షన్ 338 (టారిఫ్ యాక్ట్ 1930): ఇప్పటివరకు ఎప్పుడూ వాడని ఈ చట్టం కింద 50 శాతం వరకు సుంకాలు విధించవచ్చు. అమెరికా వస్తువుల పట్ల వివక్ష చూపే దేశాలపై దీనిని ప్రయోగించాలని ట్రంప్ బృందం యోచిస్తోంది.
ట్రంప్ సుంకాలను కోర్టు ఎందుకు కొట్టివేసింది?
అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (ఐఈఈపీఏ) కింద ట్రంప్ ఈ సుంకాలను విధించారు. సాధారణంగా యుద్ధాలు లేదా తీవ్రమైన జాతీయ విపత్తుల సమయంలో వాడే ఈ చట్టాన్ని, వాణిజ్య పరమైన సుంకాల కోసం వాడటం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. పన్నులు విధించే అధికారం కాంగ్రెస్‌కు ఉంటుందని, అధ్యక్షుడికి కాదని 6-3 మెజారిటీతో న్యాయమూర్తులు స్పష్టం చేశారు.
భారత్‌పై ప్రభావం ఏంటి?
భారత్‌తో అమెరికా కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలపై ఈ కోర్టు తీర్పు ప్రభావం ఉండబోదని ట్రంప్ స్పష్టం చేశారు. "ఇండియాతో చేసుకున్న డీల్‌లో మార్పు లేదు. వారు సుంకాలు చెల్లిస్తారు, మేము కాదు," అని ఆయన పేర్కొన్నారు.
అంటే, ప్రత్యామ్నాయ చట్టాల ద్వారా భారత్ నుంచి వచ్చే వస్తువులపై కూడా సుంకాలు కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
ముందుగా ఊహించినట్టే ఉన్న ఈ తీర్పుపై వైట్ హౌస్ అధికారులు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. "అధ్యక్షుడు అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి మా దగ్గర అనేక చట్టపరమైన ఆప్షన్లు ఉన్నాయి. రేపటి నుంచే కొత్త నిబంధనలు మొదలవుతాయి," అని అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమీసన్ గ్రీర్ ధీమా వ్యక్తం చేశారు.
ప్రశ్నలు- సమాధానాలు :-
ప్రశ్న- అమెరికా సుప్రీంకోర్టు సుంకాలను ఎందుకు రద్దు చేసింది?
సమాధానం- అధ్యక్షుడు ట్రంప్ 'అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం' కింద సుంకాలను విధించారు. ఈ చట్టంలో "రెగ్యులేట్" (నియంత్రణ) అనే పదం ఉన్నప్పటికీ, అది "సుంకాలు" (పన్నులు) విధించడానికి అధికారాన్ని ఇవ్వదని కోర్టు పేర్కొంది. రాజ్యాంగం ప్రకారం పన్నులు నిర్ణయించే అధికారం ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రతినిధులకే ఉంటుంది తప్ప అధ్యక్షుడికి లేదని 6-3 మెజారిటీతో న్యాయమూర్తులు తీర్పునిచ్చారు.
ప్రశ్న- ఇప్పుడు అమల్లోకి రాబోతున్న 'సెక్షన్ 122' అంటే ఏంటి?
సమాధానం- సెక్షన్ 122 అనేది 1974 వాణిజ్య చట్టంలోని ఒక నిబంధన. అమెరికా విదేశీ చెల్లింపుల లోటు ఎదుర్కొంటున్నప్పుడు, అధ్యక్షుడు గరిష్టంగా 15 శాతం వరకు సుంకాలను తాత్కాలికంగా విధించవచ్చు. అయితే ఇది కేవలం 150 రోజుల వరకు మాత్రమే చెల్లుతుంది. ఆ పైన పొడిగించాలంటే కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరి. సుప్రీం తీర్పు తర్వాత ట్రంప్ తన సుంకాల విధానాన్ని కొనసాగించడానికి దీనిని ఒక 'షార్ట్ టర్మ్' మార్గంగా ఎంచుకోవచ్చు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


