India US trade deal : భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందంలో ఏముంది? 10 ముఖ్యాంశాలు..
భారత్- అమెరికా దేశాలు ఒక మధ్యంతర వాణిజ్య ముసాయిదా ఒప్పందాన్ని ప్రకటించాయి. దీని ప్రకారం అమెరికా తన సుంకాలను 50% నుంచి 18%కి తగ్గించగా, భారత్ అమెరికా పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలను తొలగించడానికి అంగీకరించింది.
భారతదేశం, యునైటెడ్ స్టేట్స్ ఒక మధ్యంతర వాణిజ్య ముసాయిదా ఒప్పందాన్ని (ఇంటరిమ్ ట్రేడ్ ఫ్రేమ్‌వర్క్ అగ్రిమెంట్) ప్రకటించాయి. ఇందులో భాగంగా వాణిజ్యాన్ని విస్తృతం చేయాలనే నిబద్ధతతో పాటు భారత ఎగుమతులపై అమెరికా విధించే సుంకాలను 18%కి (గతంలో ఉన్న 50% నుంచి) తగ్గించడానికి ఇరు దేశాలు అంగీకరించాయి.

గత ఏడాది (ఫిబ్రవరి 13, 2025) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ప్రారంభమైన 'యూఎస్-ఇండియా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం' చర్చల ఫలితంగా ఈ మధ్యంతర ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ఇరు దేశాల భాగస్వామ్యంలో ఒక చారిత్రాత్మక మైలురాయిని సూచిస్తుందని, ఉమ్మడి ప్రయోజనాలు, నిర్దిష్ట ఫలితాల ఆధారంగా సమతుల్య వాణిజ్యానికి ఇది నిదర్శనమని భారత్-యూఎస్ ఒక జాయింట్ ప్రకటనలో తెలిపాయి.
భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందం - 10 ముఖ్యాంశాలు:
అమెరికా ఉత్పత్తులపై సుంకాల తగ్గింపు: ఈ ముసాయిదా ప్రకారం, భారత్ అన్ని అమెరికన్ పారిశ్రామిక వస్తువులపై, విస్తృతమైన వ్యవసాయ, ఆహార ఉత్పత్తులపై సుంకాలను తొలగిస్తుంది లేదా తగ్గిస్తుంది.
ప్రభావితమయ్యే ఉత్పత్తులు: డ్రైడ్ డిస్టిలర్స్ గ్రెయిన్స్, తాజా- ప్రాసెస్ చేసిన పండ్లు, జంతువుల మేత కోసం రెడ్ సోర్గం, సోయాబీన్ ఆయిల్, ట్రీ నట్స్, వైన్, స్పిరిట్స్ వంటి ఉత్పత్తులు ఈ జాబితాలో ఉన్నాయి.
సప్లై చైన్, మార్కెట్ యాక్సెస్: మార్కెట్ యాక్సెస్ పెంచడంతో పాటు స్థితిస్థాపకత కలిగిన సరఫరా గొలుసులకు మద్దతు ఇవ్వడం ఈ ఒప్పందంలో భాగం.
అమెరికా సుంకాల తగ్గింపు: భారత ఎగుమతులపై అమెరికా పరస్పర సుంకాలను 18% కి తగ్గించింది. చర్చలు ముందుకు సాగే కొద్దీ వీటిని మరింత తగ్గించే అవకాశం ఉంది.
18% సుంకం వర్తించే వస్తువులు: హస్తకళా ఉత్పత్తులు, కొన్ని యంత్రాలు, హోమ్ డెకర్, లెదర్, పాదరక్షలు, ఆర్గానిక్ కెమికల్స్, ప్లాస్టిక్, రబ్బర్, టెక్స్‌టైల్స్, దుస్తులు.
సుంకాల పూర్తిగా తొలగింపు: విమాన భాగాలు, రత్నాలు- వజ్రాలు, జెనరిక్ ఫార్మాస్యూటికల్స్‌పై అమెరికా పరస్పర సుంకాలను పూర్తిగా తొలగిస్తుంది.
ప్రాధాన్యత మార్కెట్ యాక్సెస్: ఇరు దేశాలు తమకు ఆసక్తి ఉన్న రంగాల్లో పరస్పరం నిరంతర ప్రాధాన్యత మార్కెట్ యాక్సెస్‌ని కల్పించుకోవడానికి కట్టుబడి ఉన్నాయి.
రూల్స్ ఆఫ్ ఆరిజిన్: ఒప్పంద ప్రయోజనాలు ప్రధానంగా భారత్- అమెరికాకే దక్కేలా ఇరు దేశాలు 'రూల్స్ ఆఫ్ ఆరిజిన్' నిబంధనలను రూపొందిస్తాయి.
500 బిలియన్ డాలర్ల కొనుగోళ్లు: భారత్ రాబోయే 5 ఏళ్లలో విమానాలు, విమాన భాగాలు, కోకింగ్ కోల్, ఎనర్జీ ప్రొడక్ట్స్, విలువైన లోహాలు, సాంకేతిక ఉత్పత్తులతో సహా మొత్తం 500 బిలియన్ డాలర్ల విలువైన అమెరికన్ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని భావిస్తోంది.
టెక్నాలజీ వాణిజ్యం: అమెరికా తన వంతుగా గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు, డేటా సెంటర్లలో ఉపయోగించే వస్తువులతో పాటు సాంకేతిక ఉత్పత్తుల వాణిజ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. సాంకేతిక సహకారాన్ని విస్తరిస్తుంది.
నాన్-టారిఫ్ అడ్డంకుల పరిష్కారం: ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రభావితం చేసే సుంకేతర అడ్డంకులను కూడా పరిష్కరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.
అమెరికన్ వైద్య పరికరాల వాణిజ్యంలో ఉన్న దీర్ఘకాలిక అడ్డంకులను తొలగించడానికి భారత్ అంగీకరించింది.
అమెరికన్ ఐసీటీ వస్తువుల మార్కెట్ ప్రవేశాన్ని ఆలస్యం చేసే దిగుమతి లైసెన్సింగ్ విధానాలను భారత్ తొలగిస్తుంది.
అమెరికన్ ఆహార, వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యంలో ఉన్న అడ్డంకులను కూడా భారత్ పరిష్కరించనుంది.
అంతేకాకుండా, థర్ట్ పార్టీ మార్కెట్-యేతర విధానాలను ఎదుర్కోవడానికి, పెట్టుబడి సమీక్షలు, ఎగుమతి నియంత్రణలపై సహకరించుకోవడానికి ఇరు దేశాలు అంగీకరించాయి.

E-Paper












