Gold Investment : నిఫ్టీ50, రియల్​ ఎస్టేట్​ని ఓడించిన 'బంగారం'- ఇన్వెస్టర్స్​కి భారీ లాభాలు..

గత 20 ఏళ్ల కాలంలో బంగారం పెట్టుబడిదారులకు కాసుల వర్షం కురిపించింది. ఈక్విటీలు, రియల్ ఎస్టేట్ వంటి ఇతర అసెట్ క్లాసుల కంటే బంగారం అత్యధిక రాబడిని అందించినట్లు ఓ నివేదిక వెల్లడించింది. సుదీర్ఘ కాలంలోనే కాకుండా, స్వల్ప కాలంలోనూ పసిడి తన ఆధిపత్యాన్ని చాటుకుంది.

Published on: Feb 15, 2026 9:10 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సంపదను సృష్టించడంలో ఈక్విటీలు (స్టాక్ మార్కెట్) ఎప్పుడూ ముందుంటాయని ఇన్వెస్టర్లు భావిస్తారు. కానీ, తాజా గణాంకాలు ఈ అంచనాలను తలకిందులు చేస్తున్నాయి! దీర్ఘకాలికంగా చూసినా లేదా స్వల్పకాలికంగా చూసినా.. బంగారంలో పెట్టుబడి ఇతర అన్ని రకాల ఇన్వెస్ట్​మెంట్​ మార్గాలను మించి రాబడిని అందించింది. ‘ఫండ్స్ ఇండియా వెల్త్ కాన్వర్జేషన్స్’ నివేదిక (జనవరి 31, 2026 నాటికి) ప్రకారం.. బంగారం కేవలం ఆపద సమయంలో ఆదుకునే సాధనంగానే కాకుండా, అత్యుత్తమ సంపద సృష్టికర్తగా నిలిచింది.

అదిరిపోయే రిటర్నులు ఇస్తున్న బంగారం!
అదిరిపోయే రిటర్నులు ఇస్తున్న బంగారం!

ఏ అసెట్ క్లాస్ ఎంత సంపదను సృష్టించింది? (20 ఏళ్ల విశ్లేషణ)..

గత 20 ఏళ్లలో వివిధ పెట్టుబడి సాధనాల పనితీరును పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి:

బంగారం: పసిడి అత్యధికంగా 15.6% కాంపౌండ్ వార్షిక రాబడిని (సీఏజీఆర్​) అందించింది. అంటే మీరు పెట్టిన పెట్టుబడి 20 ఏళ్లలో 18.3 రెట్లు పెరిగింది.

యూఎస్ ఈక్విటీలు: రూపాయి విలువ ప్రాతిపదికన ఇవి 15.1% వార్షిక రాబడిని ఇచ్చి, పెట్టుబడిని 16.6 రెట్లు చేశాయి.

భారతీయ ఈక్విటీలు (నిఫ్టీ50): భారత స్టాక్ మార్కెట్ సూచీ నిఫ్టీ 12.6% వార్షిక రాబడిని ఇచ్చింది. ఇది పెట్టుబడిని 10.7 రెట్లు పెంచింది.

రియల్ ఎస్టేట్ అండ్​ డెట్: రియల్ ఎస్టేట్ రంగం 7.8% వార్షిక రాబడిని (4.5 రెట్లు వృద్ధి) ఇవ్వగా, డెట్ (స్థిర ఆదాయ పథకాలు) 7.6% రాబడిని (4.3 రెట్లు వృద్ధి) మాత్రమే అందించగలిగాయి.

స్వల్పకాలంలోనూ పసిడిదే ఆధిపత్యం!

కేవలం 20 ఏళ్ల కాలంలోనే కాదు, 1, 3, 5, 10 ఏళ్ల కాలపరిమితిలోనూ బంగారం అద్భుతమైన ఫలితాలను సాధించింది:

గత ఏడాది: నిఫ్టీ కేవలం 9% రాబడిని ఇస్తే, బంగారం ఏకంగా 87.7% పెరిగింది.

గత 3 ఏళ్లు: నిఫ్టీ 14.1% రాబడి ఇవ్వగా, బంగారం 42.6% లాభాలను పంచింది.

గత 10 ఏళ్లు: నిఫ్టీ రాబడి 14.2% ఉండగా, బంగారం 19.7% వార్షిక రాబడితో దూసుకుపోయింది.

బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

ఫిబ్రవరి నెలలో బంగారం ధరలు పడినప్పటికీ, అంతకుముందు 18 నెలల పాటు బంగారం ధరలు నిరంతరం పెరుగుతూనే వచ్చాయి. దీనికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు:

  • ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు బంగారాన్ని భారీగా కొనుగోలు చేయడం.
  • వడ్డీ రేట్ల తగ్గింపు సంకేతాలు, అమెరికన్ డాలర్ బలహీనపడటం.
  • భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి.

"బంగారం, వెండి ఒక దశాబ్ద కాలం పాటు స్తబ్దతగా ఉండి, ఏడాది క్రితమే 'స్ట్రక్చరల్ బుల్ మార్కెట్'లోకి ప్రవేశించాయి. సాధారణంగా ఇలాంటి ట్రెండ్ 3 నుంచి 5 ఏళ్ల పాటు కొనసాగుతుంది," అని ఎంకే వెల్త్ మేనేజ్‌మెంట్ పేర్కొంది.

ఇన్వెస్టర్లకు నిపుణుల సలహా

బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని బ్రోకరేజ్ సంస్థలు సూచిస్తున్నాయి:

పాత ఇన్వెస్టర్లు: ఒకవేళ మీ పోర్ట్‌ఫోలియోలో బంగారం, వెండి వాటా 25-30 శాతం మించితే, కొంత మేర లాభాలను స్వీకరించి, వ్యూహాత్మక కేటాయింపులను మాత్రమే కొనసాగించాలి.

కొత్త ఇన్వెస్టర్లు: ఇప్పుడు మార్కెట్​లోకి రావాలనుకునే వారు ఒకేసారి కాకుండా విడతల వారీగా పెట్టుబడి పెట్టాలి. మొత్తం డబ్బుల్లో 5 నుంచి 10 శాతం మాత్రమే బంగారానికి కేటాయించడం సరైన పద్ధతి.

పెట్టుబడి మార్గాలు: ఫిజికల్ గోల్డ్​తో పాటు గోల్డ్/సిల్వర్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ వంటి డిజిటల్ మార్గాలను ఎంచుకోవడం ఉత్తమం.

"సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు, ఈటీఎఫ్​లలోకి నిధుల ప్రవాహం కొనసాగుతున్నందున బంగారం ధరలకు మద్దతు లభిస్తుంది. అయితే, అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీల్లో మార్పుల వల్ల స్వల్పకాలిక ఒడిదుడుకులు ఉండవచ్చు," అని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ హెచ్చరించింది.

ప్రశ్నలు - సమాధానాలు:-

ప్రశ్న- రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్ కంటే బంగారం ఎక్కువ లాభాలను ఎలా ఇవ్వగలిగింది?

దీర్ఘకాలికంగా చూస్తే బంగారం కేవలం ఆభరణంగానే కాకుండా ఒక సురక్షితమైన ఆస్తిగా నిలిచింది. ముఖ్యంగా గత 20 ఏళ్లలో ప్రపంచ ఆర్థిక సంక్షోభాలు, ద్రవ్యోల్బణం, రూపాయి విలువ పతనం వంటి కారణాలు బంగారానికి కలిసొచ్చాయి. నివేదిక ప్రకారం.. బంగారం 15.6% వార్షిక రాబడిని ఇవ్వగా, రియల్ ఎస్టేట్ 7.8% కి మాత్రమే పరిమితమైంది. దీనికి ప్రధాన కారణం బంగారంపై ఉండే అధిక లిక్విడిటీ (త్వరగా నగదుగా మార్చుకునే సౌలభ్యం), అంతర్జాతీయ మార్కెట్​లో పెరిగిన డిమాండ్.

ప్రశ్న- ఇప్పుడు బంగారం ధరలు గరిష్ట స్థాయిలో ఉన్నాయి కదా, కొత్తగా పెట్టుబడి పెట్టడం సురక్షితమేనా?

సమాధానం- ధరలు పెరిగిన మాట వాస్తవమే, అందుకే నిపుణులు 'డిసిప్లిన్డ్ అప్రోచ్' (క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి) పాటించాలని సూచిస్తున్నారు. ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా, విడతల వారీగా పెట్టుబడి పెట్టడం మంచిది. మీ మొత్తం ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోలో 5 నుంచి 10 శాతం వరకు బంగారానికి కేటాయించవచ్చు. ఇది భవిష్యత్తులో మార్కెట్ ఒడిదుడుకుల నుంచి మీ సంపదను కాపాడటమే కాకుండా, దీర్ఘకాలంలో స్థిరమైన రాబడులను అందిస్తుంది.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఇన్వెస్ట్​మెంట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)