Ayatollah Khamenei : అమెరికా- ఇజ్రాయెల్​ దాడిలో ఖమేనీ హతం- సంబరాలు చేసుకుంటున్న ఇరాన్​ ప్రజలు!

అమెరికా- ఇజ్రాయెల్​ జరిపిన దాడిలో ఇరాన్​ సుప్రీం లీడర్​ అయతొల్లా అల్​ ఖమేనీ హతమయ్యారు. ఈ విషయాన్ని ఆ దేశ మీడియా వెల్లడించింది. ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, మనవరాలు సైతం ప్రాణాలు కోల్పోయారు. 

Published on: Mar 1, 2026, 08:15:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మూడు దశాబ్దాలకు పైగా ఇరాన్ మతతత్వ పీఠాన్ని శాసించి, ఆ దేశాన్ని ఇజ్రాయెల్, అమెరికాతో ప్రత్యక్ష ఘర్షణ దిశగా నడిపించిన అత్యున్నత నాయకుడు అయతొల్లా అల్​ ఖమేనీ.. అమెరికా- ఇజ్రాయెల్​ దాడిలో హతమయ్యారు. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా ఆదివారం తెల్లవారుజామున ధ్రువీకరించింది.

ఇరాన్​ సుప్రీం లీడర్​ అయతొల్లా అల్​ ఖమేనీ హతం.. (REUTERS)
ఇరాన్​ సుప్రీం లీడర్​ అయతొల్లా అల్​ ఖమేనీ హతం.. (REUTERS)

అంతేకాదు, శనివారం జరిగిన దాడుల్లో ఖమేనీ కుమార్తె, అల్లుడు, మనవరాలు కూడా చనిపోయినట్టు ఇరాన్​ మీడియా ప్రకటన చేసింది.

ట్రంప్ సంచలన ప్రకటన - సంయుక్త ఆపరేషన్

ఈ అధికారిక ప్రకటన వెలువడటానికి కొన్ని గంటల ముందే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు సంయుక్తంగా నిర్వహించిన సైనిక ఆపరేషన్‌లో ఖమేనీ హతమయ్యారని ఆయన వెల్లడించారు. శనివారం ఇరాన్ వ్యాప్తంగా ఉన్న సైనిక, అణు అనుబంధ కేంద్రాలే లక్ష్యంగా ఇరు దేశాల దళాలు భారీ దాడులు నిర్వహించాయి. గత కొన్ని నెలలుగా పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా మధ్య నేరుగా జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

ఇరాన్ వీధుల్లో వెల్లువెత్తిన సంబరాలు..

ఖమేనీ మరణ వార్తను ట్రంప్​ తెలియజేసిన వెంటనే (అప్పటి ఇరాన్​ మీడియా ధ్రువీకరించలేదు) ఇరాన్ ప్రజలు శనివారం సాయంత్రం నుంచే పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకోవడం మొదలుపెట్టారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం.. ప్రజలు తమ బాల్కనీల నుంచి బాణసంచా కాలుస్తూ, అపార్ట్‌మెంట్ల నుంచి ఒకరినొకరు పిలుచుకుంటూ సంతోషం పంచుకుంటున్నారు.

ఆకాశంలో యుద్ధ విమానాలు లేదా క్షిపణులు వెళుతున్నప్పుడు కూడా ప్రజలు కేరింతలు కొడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

"ఈ యుద్ధం మాది కాదు. ఇది ద్వేషపూరిత ఇస్లామిక్ పాలనపై ట్రంప్ చేస్తున్న యుద్ధం. ఇందులో ట్రంప్ గెలవాలని మేం ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ఆయన గెలిస్తేనే ఇరాన్ ప్రజలకు స్వేచ్ఛ లభిస్తుంది," అని ఓ ఇరాన్​ పౌరుడు చెప్పుకొచ్చారు.

అయతొల్లా పాలనలో ఇరాన్​ ప్రజల జీవితాలు క్లిష్టంగా మారాయి. ద్రవ్యోల్బణంతో పాటు అగ్రరాజ్య ఆంక్షలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అందుకే దేశంలో మార్పు రావాలని, ట్రంప్​ సాయం చేయాలని గత కొంతకాలంగా అక్కడి ప్రజలు విజ్ఞప్తులు చేస్తూ వచ్చారు.

అమెరికాలో ప్రవాస ఇరానియన్ల భారీ ప్రదర్శనలు..

మరోవైపు అమెరికాలో కూడా ఖమేనీ మరణ వార్తపై మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. వెస్ట్‌వుడ్ వీధుల్లో ప్రజలు వేడుకలు జరుపుకోగా, లిటిల్ టోక్యోలో కొందరు నిరసనలు చేపట్టారు.

వెస్ట్‌వుడ్ సంబరాలు: విల్షైర్ బౌలేవార్డ్, వెటరన్ అవెన్యూలోని ఫెడరల్ బిల్డింగ్ వెలుపల డజన్ల కొద్దీ ప్రజలు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ జెండాలను ఊపుతూ డ్యాన్స్‌లు చేశారు, పాటలు పాడుతూ సంబరాలు చేసుకున్నారు.

బీటా అత్షానీ (ప్రదర్శనకారిణి): ఇరాన్‌లో అరెస్టయిన, చంపబడిన వారి చిత్రాలతో ఉన్న పోస్టర్‌ను పట్టుకున్న ఆమె మాట్లాడుతూ.. "అలీ ఖమేనీ ఎట్టకేలకు హతమయ్యాడు. మా దేశాన్ని మేం తిరిగి దక్కించుకునే అవకాశం వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు మద్దతు ఇచ్చిన అమెరికా- ఇజ్రాయెల్ ప్రజలకు కృతజ్ఞతలు," అని ఆనందం వ్యక్తం చేశారు.

అలీ సవందీ: "నాయకులు చనిపోయినందుకు మేం చాలా సంతోషంగా ఉన్నాము. 47 ఏళ్లుగా ఇస్లామిక్ పాలనలో నియంతృత్వానికి గురైన ఇరాన్ ప్రజల కోసం మేం సంతోషిస్తున్నాం. ఇకపై రెజా పహ్లవీ ఇరాన్‌కు వచ్చి ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛను పునరుద్ధరిస్తారు," అని వ్యాఖ్యానించారు.

నిరసన ప్రదర్శన: మరోవైపు, లిటిల్ టోక్యో స్టేషన్ వద్ద ఒక చిన్న బృందం ఈ దాడులను నిరసిస్తూ సమావేశమైంది. "ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపండి", "ఫాసిస్ట్ ట్రంప్ పాలన పోవాలి" అంటూ వారు ప్లకార్డులు ప్రదర్శించారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More