Ayatullah Al Khomeini : అయతొల్లా అల్ ఖమేనీ- మత బోధకుడి నుంచి ఇరాన్ అత్యున్నత శక్తి వరకు..
Ayatollah Khomeini : అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త సైనిక దాడుల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హతమైనట్లు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇదే నిజమైతే.. గత 36 ఏళ్లుగా రివల్యూషనరీ గార్డ్స్‌ను బలోపేతం చేస్తూ, నియంత పాలనను గుర్తు చేసే విధంగా సాగించిన ఆయన ప్రస్థానం ఈ దాడులతో ముగిసినట్టే!
ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని వెంటాడుతున్న ప్రశ్న- ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అల్ ఖమేనీ బతికే ఉన్నారా? అని. ఇరాన్- అమెరికా సంయుక్త ఆపరేషన్ అనంతరం ఖమేనీ చనిపోయినట్టు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించేశారు. కానీ ఇరాన్ మాత్రం అధికారికంగా ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో ఖమేనీ వ్యవహారంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

వాస్తవానికి ఖమేనీ బతికుండాలని కోరుకునే వారి కన్నా, ఆయన నుంచి విముక్తి పొందాలనుకునే వారే ఎక్కువగా ఉన్నారు!
ప్రస్తుతం 86 ఏళ్ల వయసున్న అయతొల్లా అల్ ఖమేనీ, 1989లో ఖొమేనీ మరణం తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన వ్యక్తిగత జీవితం, రాజకీయ ఎదుగుదల, మూడు దశాబ్దాల పాలనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి..
ఎవరీ అయతొల్లా అల్ ఖమేనీ?
అలీ ఖమేనీ 1939 ఏప్రిల్ 19న ఇరాన్‌లోని మషద్‌లో జన్మించారు. ఆయన తండ్రి సయ్యద్ జవాద్ ఖమేనీ ఒక గొప్ప ఇస్లామిక్ పండితుడు. ఖమేనీకి కేవలం నాలుగేళ్ల వయసున్నప్పుడే ఆయనను, ఆయన అన్నయ్యను అక్షరాలు, ఖురాన్ నేర్చుకోవడానికి ఆ కాలపు సంప్రదాయ ప్రాథమిక పాఠశాలలైన 'మక్తబ్'కు పంపారు. ఆ తర్వాత ఆయన తన విద్యాభ్యాసాన్ని కొనసాగించడానికి అప్పుడే కొత్తగా ఏర్పాటైన ఇస్లామిక్ పాఠశాలకు మారారు.
తన 18వ ఏట, అంటే 1957లో ఇరాక్‌లోని పవిత్ర స్థలాల సందర్శన కోసం వెళ్లారు. అయితే, పవిత్ర నగరం 'ఖుమ్'లో ఉన్నత మతపరమైన విద్యను అభ్యసించాలని ఆయన తండ్రి కోరుకోవడంతో 1958లో తిరిగి ఇరాన్ చేరుకున్నారు.
పోరాట పటిమ - విప్లవ గళం!
1962లో ఖుమ్‌లో చదువుకుంటున్న సమయంలోనే, ఖమేనీ ఇమామ్ ఖొమేనీకి మద్దతుదారుగా మారారు. అప్పట్లో షా పాలనలోని "అమెరికా అనుకూల, ఇస్లాం వ్యతిరేక విధానాలను" ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. తన 13వ ఏట నుంచే ఇస్లామిక్ దృక్పథంపై అవగాహన పెంచుకున్న ఖమేనీ, షా నిరంకుశత్వం, వారికి మద్దతుగా నిలిచిన బ్రిటీష్ వారిని ఎదిరించడం మొదలుపెట్టారు.
విప్లవ భావాలను వ్యాప్తి చేస్తున్నందుకు గాను 1963లో ఆయనను తొలిసారి అరెస్ట్ చేశారు. అదే ఏడాది జూన్‌లో ఖొమేనీ అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తినప్పుడు, ఖమేనీని రెండోసారి అరెస్ట్ చేసి 10 రోజుల పాటు జైల్లో ఉంచారు. 1967లో ఇరాన్ రహస్య పోలీసు విభాగం తనపై నిఘా ఉంచిందని గ్రహించి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు.
1975లో భద్రతా దళాలు మషద్‌లోని ఆయన ఇంటిపై దాడి చేసి, ఆరోసారి ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
ఇస్లామిక్ విప్లవం - కీలక మలుపు
1978లో రాజకీయ అస్థిరత పెరిగిన సమయంలో ఖమేనీ తిరిగి మషద్ చేరుకున్నారు. ఈ కాలమే ఇస్లామిక్ విప్లవానికి, షా పతనానికి దారితీసింది. ఇమామ్ ఖొమేనీ ఇరాన్‌కు తిరిగి రాకముందే ఏర్పాటైన 'ఇస్లామిక్ రివల్యూషనరీ కౌన్సిల్'లో ఖమేనీని ఒక సభ్యుడిగా నియమించారు.
1981లో మహమ్మద్ అలీ రాజాయ్ మరణం తర్వాత ఖమేనీ ఇరాన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ పదవిని చేపట్టిన తొలి మత గురువు ఆయనే. అదే ఏడాది టెహ్రాన్‌లోని అబూజర్ మసీదులో ప్రసంగిస్తుండగా, ఆయన పక్కనే ఉన్న టేప్ రికార్డర్‌లో బాంబు పేలింది. ఈ హత్యాయత్నంలో ఆయన కుడి చేయి తీవ్రంగా గాయపడింది.
ఇక 1985లో ఆయన రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1989లో అయతొల్లా ఖొమేనీ మరణానికి ముందు, ఖమేనీని తన రాజకీయ వారసుడిగా ఎంచుకున్నారు.
సుప్రీం లీడర్‌గా మూడు దశాబ్దాల పాలన
అత్యున్నత అధికారం చేపట్టిన తర్వాత, ఖమేనీ షియా ముస్లిం మత గురువుల నేతృత్వంలోని పాలనా వ్యవస్థను మరింత పటిష్టం చేశారు. ఈ నిర్ణయంతో ఆయనను దేవుడి తర్వాత అంతటి శక్తివంతుడిగా హార్డ్ లైనర్లు భావించడం మొదలుపెట్టారు.
అదే సమయంలో, ‘రివల్యూషనరీ గార్డ్స్’కు అపరిమితమైన అధికారాలు కట్టబెట్టారు. దేశ సైనిక, అంతర్గత రాజకీయాల్లో ఈ దళమే ప్రధాన శక్తిగా మారింది. ఇరాన్ బాలిస్టిక్ మిస్సైల్ ప్రోగ్రామ్ మొత్తం వీరి నియంత్రణలోనే ఉంటుంది.
ముప్పై ఏళ్లకు పైగా సాగిన ఆయన పాలనలో అనేక సవాళ్లు ఎదురయ్యారు:
సంస్కరణల ఉద్యమం: ఆయన అధికారం చేపట్టిన కొద్ది కాలానికే ఎన్నికైన నాయకులకు ఎక్కువ అధికారాలు కావాలని కోరిన సంస్కరణవాదుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అయితే భద్రతా దళాల సహాయంతో ఖమేనీ ఆ ఉద్యమాలను అణిచివేశారు.
నిరసన జ్వాలలు: 2009లో ఎన్నికల రిగ్గింగ్ ఆరోపణలు, 2017, 2019లో ఆర్థిక ఆంక్షల వల్ల పెరిగిన ధరలపై ప్రజలు భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు.
హిజాబ్ నిరసనలు: 2022లో 'మహ్సా అమిని' అనే యువతి హిజాబ్ సరిగ్గా ధరించలేదనే కారణంతో పోలీసుల అదుపులో మరణించడంతో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ఈ నిరసనలను అణిచివేసే క్రమంలో వందలాది మంది మరణించగా, వేలాది మంది జైలుపాలయ్యారు.
అప్పటి నుంచి ఇరాన్లో ప్రతియేటా ఏదో ఒక విషయంలో నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. నియంత పాలన నుంచి తమను రక్షించాలని చాలా మంది ఇరాన్‌వాసులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు విజ్ఞప్తి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఖమేనీ నాయకత్వంలో ఇరాన్ ఒక శక్తివంతమైన దేశంగా ఎదిగినప్పటికీ, అంతర్గత నిరసనలు, అంతర్జాతీయ ఆంక్షలు ఆయన పాలనకు ఎప్పుడూ సవాలుగానే నిలిచాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


