బంగారం ధరలు భగ్గు.. నగలకు బదులు బిస్కెట్ బంగారం వైపే మొగ్గు చూపుతున్న భారతీయులు

దేశంలో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరడంతో సామాన్యుల కొనుగోలు తీరు మారుతోంది. అధిక మజూరీ ఖర్చుల భారం తట్టుకోలేక, చాలామంది ఆభరణాల కంటే బంగారు నాణేలు, బిస్కెట్ల వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రపంచ స్వర్ణ మండలి (WGC) తాజా నివేదిక ప్రకారం, 2025లో నగల కొనుగోళ్లు భారీగా తగ్గాయి.

Published on: Dec 31, 2025, 10:15:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బంగారం అంటే భారతీయులకు కేవలం లోహం కాదు, అదొక సెంటిమెంట్. పండుగ వచ్చినా, శుభకార్యం జరిగినా అడపా దడపా బంగారం కొనడం మనకు ఆచారంగా వస్తోంది. అయితే, ఆకాశమే హద్దుగా పెరుగుతున్న పసిడి ధరలు ఇప్పుడు సామాన్యుడి సెంటిమెంట్‌ను, కొనుగోలు అలవాట్లను మార్చేస్తున్నాయి. గత రెండు దశాబ్దాలుగా ప్రతి పండుగకు ఏదో ఒక నగ కొనే అలవాటున్న ముంబై గృహిణి ప్రాచీ కదమ్, ఈసారి మాత్రం నెక్లెస్‌కు బదులు 10 గ్రాముల బంగారు నాణేన్ని కొనుగోలు చేశారు.

నగలకు బదులు బిస్కెట్ బంగారం వైపే మొగ్గు చూపుతున్న భారతీయులు (AFP)
నగలకు బదులు బిస్కెట్ బంగారం వైపే మొగ్గు చూపుతున్న భారతీయులు (AFP)

"15 శాతం అదనపు భారం ఎందుకు?"

“నాకు నగలు అంటే ఇష్టం, ఫంక్షన్లలో వేసుకోవచ్చు. కానీ, ఆభరణాల ధరపై అదనంగా 15 శాతం వరకు మజూరీ (Making Charges) కట్టడం ఇప్పుడు చాలా భారంగా అనిపిస్తోంది. అందుకే ఈసారి నగలకు బదులు నాణేన్ని కొనుగోలు చేయడమే ఉత్తమమనిపించింది” అని ప్రాచీ కదమ్ తన నిర్ణయాన్ని వివరించారు. ఈమె ఒక్కరే కాదు, ప్రస్తుతం దేశవ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులు ఇదే బాటలో నడుస్తున్నారు.

ప్రపంచ స్వర్ణ మండలి (WGC) గణాంకాల ప్రకారం.. 2025 మొదటి తొమ్మిది నెలల్లో భారతదేశంలో బంగారానికి ఉన్న మొత్తం డిమాండ్ గతేడాదితో పోలిస్తే 14 శాతం తగ్గింది. ఇందులో ముఖ్యంగా ఆభరణాల వినియోగం ఏకంగా 26 శాతం పడిపోగా, పెట్టుబడి రూపంలో (నాణేలు, బిస్కెట్లు) కొనుగోళ్లు 13 శాతం పెరగడం గమనార్హం.

రికార్డు స్థాయిలో ధరల పెరుగుదల

అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, అమెరికా వడ్డీ రేట్ల తగ్గింపు వంటి కారణాలతో డిసెంబర్ 26న బంగారం ధర రికార్డు స్థాయిలో ఒక ట్రాయ్ ఔన్స్‌కు 4,549.7 డాలర్లకు చేరుకుంది. ఈ ఏడాది అంతర్జాతీయంగా బంగారం ధరలు 67 శాతం పెరిగాయి. భారతదేశంలో దేశీయంగా పసిడి ధరలు ఏకంగా 77 శాతం పెరిగాయి. ఇదే సమయంలో స్టాక్ మార్కెట్ సూచీ నిఫ్టీ 50 కేవలం 9.7 శాతం లాభాన్ని మాత్రమే ఇవ్వడం గమనార్హం.

లైట్ వెయిట్ నగల వైపు చూపు

ధరలు భారీగా పెరగడంతో, నగలు కొనాలనుకునే వారు కూడా తమ బడ్జెట్‌కు తగ్గట్టుగా 'లైట్ వెయిట్' (తక్కువ బరువు) డిజైన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. కోల్‌కతాకు చెందిన నివేదిత చక్రవర్తి మాట్లాడుతూ.. "నెక్లెస్‌లో ఒక 6-7 గ్రాముల బరువు తగ్గిస్తే చాలు, లక్ష రూపాయలకు పైగా ఆదా అవుతోంది. అందుకే ఇప్పుడు గ్రాండ్ లుక్ కంటే లైట్ వెయిట్ డిజైన్లకే ప్రాధాన్యత ఇస్తున్నాం" అని పేర్కొన్నారు.

మారిన వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా జ్యువెలరీ సంస్థలు కూడా కొత్త బ్రాండ్లను మార్కెట్లోకి తెస్తున్నాయి. "ప్రస్తుతం కస్టమర్లు చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు. అందుకే తక్కువ క్యారెట్ (18k, 14k) ఉన్న నగలను కూడా యువత, ఉద్యోగినులు ఇష్టపడుతున్నారు" అని పీఎన్ గాడ్గిల్ జ్యువెలర్స్ చైర్మన్ సౌరభ్ గాడ్గిల్ తెలిపారు.

2026లోనూ ఇదే ట్రెండ్?

బంగారం ధరలు ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించకపోవడంతో, 2026లో కూడా ప్రజలు నగలకు బదులు పెట్టుబడి సాధనాలైన కాయిన్స్, గోల్డ్ ఈటీఎఫ్ (ETF)ల వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) అధ్యక్షుడు పృథ్వీరాజ్ కొఠారీ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి సుమారు 3.3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

మొత్తానికి, భారతీయులకు బంగారంపై ఉన్న మక్కువ తగ్గలేదు కానీ, అది కొనే రూపం మాత్రం మారుతోంది. అలంకారం కంటే భవిష్యత్తుకు భరోసానిచ్చే 'పెట్టుబడి'కే ఇప్పుడు పెద్దపీట వేస్తున్నారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More