CAFE 3 norms : వాహనదారులకు అలర్ట్.. సరికొత్త మైలేజ్, కాలుష్య నిబంధనలు తెస్తున్న కేంద్రం..
భారత ఆటోమొబైల్ రంగాన్ని కార్బన్ రహితంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. కార్ల మైలేజీని పెంచుతూ, కాలుష్యాన్ని తగ్గించే సరికొత్త 'సీఏఎఫ్ఈ-3' నిబంధనల ముసాయిదాను విద్యుత్ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఇది 2027 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. పూర్తి వివరాలు..
దేశంలో పెరుగుతున్న కాలుష్యానికి అడ్డుకట్ట వేయడంతో పాటు వాహనాల ఇంధన సామర్థ్యాన్ని (మైలేజ్) గణనీయంగా పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ప్యాసింజర్ వాహనాల కోసం మరింత కఠినమైన నిబంధనలతో కూడిన 'కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎఫీషియెన్సీ' (సీఏఎఫ్ఈ-III) మూడో విడత నిబంధనల ముసాయిదాను కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.

ఈ కొత్త నిబంధనలు 2027 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం ఉన్న సీఏఎఫ్ఈ-2 నిబంధనల గడువు 2027 మార్చి 31తో ముగియనుండటంతో, తదుపరి ఐదేళ్ల కాలానికి (2031-32 వరకు) ఈ కొత్త విధానాన్ని తీసుకువస్తున్నారు. ఈ ముసాయిదాపై పరిశ్రమ వర్గాలు, ప్రజల నుంచి సలహాలు, సూచనల కోసం 21 రోజుల గడువు ఇచ్చారు. స్టేక్‌హోల్డర్లు తమ అభిప్రాయాలను తెలపడానికి ఆగస్టు 6 వరకు సమయం ఉంది. అంతకుముందు 2025 సెప్టెంబర్‌లో విడుదల చేసిన ముసాయిదాలోని కఠినమైన లక్ష్యాలపై ఆటోమొబైల్ పరిశ్రమ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో, కేంద్రం కొన్ని మార్పులు చేసి ఈ సవరించిన కొత్త డ్రాఫ్ట్‌ను తీసుకొచ్చింది.
ఈ కొత్త నిబంధనలపై ఇప్పుడు భారత ఆటోమొబైల్ పరిశ్రమ రెండుగా చీలిపోయింది. చిన్న కార్ల తయారీదారులు, భారీ ఎస్‌యూవీ కార్ల తయారీదారులు తమతమ ప్రయోజనాలకు అనుగుణంగా నిబంధనలు ఉండాలంటూ భిన్నమైన ప్రతిపాదనలతో పోటీ పడుతున్నారు.
మైలేజ్ లక్ష్యాలు మరింత కఠినం!
కొత్త పాలసీ ప్రకారం.. వాహన కంపెనీల పనితీరును రెండు విడతలుగా (మొదటి మూడేళ్లు, ఆ తర్వాత రెండేళ్లు) సమీక్షిస్తారు. డ్రైవర్ సీటు కాకుండా గరిష్టంగా 8 మంది కూర్చునే సామర్థ్యం ఉండి, 2027-28 నుంచి 2031-32 మధ్య కాలంలో భారత్‌లో తయారయ్యే లేదా దిగుమతి అయ్యే 'ఎం1' కేటగిరీ ప్యాసింజర్ వాహనాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి.
కార్ల కంపెనీలు తయారు చేసే మొత్తం వాహనాల సగటు ఇంధన వినియోగం, కార్బన్ ఉద్గారాల పరిమితిని ప్రభుత్వం ఏటా మరింత కఠినతరం చేయనుంది.
2027-28 ఆర్థిక సంవత్సరానికి గాను సగటు మైలేజ్ లక్ష్యాన్ని 100 కిలోమీటర్లకు 3.996 లీటర్లుగా (అంటే కిలోమీటరుకు 94.76 గ్రాముల సీఓ2 ఉద్గారాలు) నిర్దేశించారు.
దీనిని 2031-32 నాటికి 100 కిలోమీటర్లకు 3.3273 లీటర్లకు (కిలోమీటరుకు 78.90 గ్రాముల CO2 ఉద్గారాలు) తగ్గించాలని ప్రతిపాదించారు.
వాహన తయారీ కంపెనీలకు సాంకేతికంగా మారడానికి, ఎక్కువ మైలేజ్ ఇచ్చే మోడళ్లను అభివృద్ధి చేయడానికి తగిన సమయం ఇచ్చేందుకే ఈ దశల వారీ విధానాన్ని ఎంచుకున్నారు.
క్లీన్ ఫ్యూయల్ కార్లకు బంపర్ ఆఫర్!
ఈ సరికొత్త సీఏఎఫ్ఈ-3 నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం పర్యావరణహిత ఇంధన వాహనాలకు చరిత్రలోనే మొదటిసారిగా ప్రత్యేక గుర్తింపునిచ్చింది. ఇథనాల్, బయో-ఫ్యూయల్స్, కంప్రెస్డ్ బయో-గ్యాస్‌లతో నడిచే వాహనాల నుంచి వెలువడే కార్బన్ ఉద్గారాల లెక్కింపులో తయారీదారులకు భారీ ఉపశమనం లభించనుంది. ఇందుకోసం ‘కార్బన్ న్యూట్రాలిటీ ఫ్యాక్టర్స్’ (సీఎన్ఎఫ్) అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు.
ప్రస్తుత ఇథనాల్ బ్లెండింగ్ స్థాయిల ఆధారంగా వాహనాలకు 8 శాతం సీఎన్ఎఫ్ తగ్గింపును ప్రతిపాదించారు. అంటే, ఈ వాహనాలు వాస్తవంగా విడుదల చేసే కాలుష్యం కంటే తక్కువ కాలుష్యం చేస్తున్నట్లుగా రికార్డుల్లో గుర్తిస్తారు. దీనివల్ల కంపెనీలు నిబంధనలను సులభంగా పాటించవచ్చు. దీనితో పాటు, ఆమోదిత ఇంధన పొదుపు సాంకేతికతలను వాడే వాహనాలకు కిలోమీటరుకు గరిష్టంగా 9 గ్రాముల సీఓ2 వరకు కంప్లయన్స్ ఇన్సెంటివ్‌లు లభిస్తాయి. అలాగే బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు, ప్లగ్-ఇన్ హైబ్రిడ్లు, స్ట్రాంగ్ హైబ్రిడ్లు, ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల సగటును లెక్కించేటప్పుడు వాల్యూమ్-ఆధారిత 'సూపర్ క్రెడిట్స్' సౌకర్యాన్ని కూడా కొనసాగించారు.
క్రెడిట్, డెబిట్ విధానం..
వాహన కంపెనీల కోసం కేంద్రం ఒక క్రెడిట్-అండ్ డెబిట్ సిస్టమ్‌ను తీసుకొచ్చింది. దీని ప్రకారం ప్రభుత్వం విధించిన కాలుష్య నియంత్రణ లక్ష్యాల కంటే మెరుగైన ప్రదర్శన కనబరిచే కంపెనీలు 'కంప్లయన్స్ క్రెడిట్స్' సంపాదిస్తాయి. ఈ క్రెడిట్లను వారు భవిష్యత్తు అవసరాల కోసం దాచుకోవచ్చు.
ఒకవేళ ఏదైనా కంపెనీ లక్ష్యాలను అందుకోవడంలో విఫలమైతే, వారు తమ పాత క్రెడిట్లను వాడుకోవచ్చు లేదా ఇతర వాహన తయారీదారులతో పూలింగ్ ఒప్పందాలు చేసుకోవచ్చు. అదీ కుదరకపోతే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ నుంచి క్రెడిట్లను కొనుగోలు చేసి తమ లక్ష్యాన్ని భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రారంభంలో ప్రతి కంప్లయన్స్ క్రెడిట్ ధరను రూ. 2,500గా నిర్ణయించారు. ఈ ధర ప్రతి ఏటా రూ. 500 చొప్పున పెరుగుతుంది. నిర్దేశిత గడువు ముగిసేలోగా ఈ క్రెడిట్లను ఉపయోగించకపోతే అవి రద్దయిపోతాయి.
ఈ నిబంధనలను ఉల్లంఘించే వాహన తయారీ సంస్థలపై ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ కింద భారీ జరిమానాలు విధిస్తారు. అయితే, ఏటా 1,000 కంటే తక్కువ వాహనాలను విక్రయించే చిన్న కార్ల తయారీ కంపెనీలకు ఈ కొత్త సీఏఎఫ్ఈ-3 నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


